Advertisement


Home > Politics - Gossip
‘రాజీనామా’ అంటున్న పైడికొండ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల మధ్య వార్ మొదలైందా? మోడీతో చంద్ర బంధమే తుమ్మితే ఊడే ముక్కు చందంగా ఉన్నదని అంతా అనుకుంటున్న వేళ... ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య బంధం ముందే పుటుక్కుమనబోతున్నదా అనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముమ్మరంగా జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశంపార్టీ నాయకులతో రేగిన విభేదాల పర్యవసానంగా.. దేవాదాయ శాఖ మంత్రి భాజపాకు చెందిన సీనియర్ నాయకుడు పైడికొండ మాణిక్యాల రావు తన మంత్రి పదవినే వదులుకోవడానికి సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.

పైడికొండ మాణిక్యాల రావుకు పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్  ముళ్లపూడి బాపిరాజు తో విబేదాలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా తాడేపల్లి గూడెం మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ మంత్రిని ఆఫ్టరాల్ ఫోటోగ్రాఫర్ అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి ఆజ్యం జత చేశాయి. వీరితో విభేదాలతో అలకపూనిన మాణిక్యాల రావు తన మంత్రి పదవికి రాజీనామా చేసేయడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మంత్రికి అలక తెప్పించిన తెదేపా నాయకులపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

బాపిరాజు వైఖరి వల్ల తరచూ సమస్యలు వస్తున్నాయంటూ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారని.. తీరు మార్చుకోకపోతే.. చర్యలు తప్పవని కూడా హెచ్చరించారని తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య వెస్ట్ గోదావరి వేదికపై ఏర్పడిన ప్రతిష్టంభన ను తొలగించడానికి ముగ్గురు నాయకులతో ఓ కమిటీ కూడా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రాజీనామా వంటి సీరియస్ డెసిషన్ తీసుకోకుండా ఉండడానికి మాణిక్యాల రావును బుజ్జగించేందుకు కూడా చంద్రబాబునాయుడు కొందరు నేతలతో మాట్లాడి దౌత్యం నెరపుతున్నట్లుగా పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

పైడికొండ మాణిక్యాల రావు.. తొలినుంచి చంద్రబాబు పట్ల అతి విధేయత కనపరచని.. స్వతంత్ర వైఖరితో వ్యవహరించే మంత్రిగా ఏపీ కేబినెట్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రబాబు కూడా ఎన్నడూ ఇతర మంత్రులతో వ్యవహరించినట్లుగా ఆయనతో డీల్ చేయకుండా, జాగ్రత్తలు తీసుకుంటూనే వచ్చారు. అయితే.. చంద్రబాబు సంయమనం పాటిస్తూనే ఉన్నారు గానీ.. తెలుగుతమ్ముళ్ల దూకుడు వల్ల ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడింది. దీన్ని చక్కదిద్దడానికి చంద్రబాబు కసరత్తు చేయాల్సి వస్తోంది.

టీటీడీ బోర్డు ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం నిర్ణయానికి వ్యతిరేకంగా పైడికొండ రాజీనామా చేయాలనుకుంటున్నట్లు కొన్ని పుకార్లు వచ్చాయి గానీ.. అది అంత ప్రధానకారణం కాదని.. తెలుగుదేశం నాయకులతో విభేదాలు తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినందునే ఆయన మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.