Home > Politics - Gossip
అనర్హత గొడవలో.. పాపం వైకాపాదేనంట!

‘‘అనగనగా ఒక రాజు.. ఆ రోజుకు ఏడుగురు కొడుకులు...’’

మీకందరికీ తెలుసులెండి.. మళ్లీ ఒకసారి చెప్పుకుందాం..

‘‘ఆ ఏడుగురు కొడుకులు వేటకెళ్లారు. ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండబెట్టారు. ఏడో చేప ఎండలేదు.. చేపా చేపా ఎందుక ఎండలేదు అని అడిగితే.. నాకు గడ్డివామి అడ్డం వచ్చింది.. ’’ అన్నదిట. చిన్నతనంలో ప్రతి తెలుగువాడూ వినే ఈ కథలో మీకు ఇంతవరకూ గుర్తంటే చాలు.. అలా ఆ చేపగారు.. తాను ఎండకపోవడానికి గడ్డివామి గురించి నెపం పెట్టినట్టే.. ఇప్పుడు తెలుగునాట రాజకీయాలు కూడా నడుస్తున్నాయి.

నిజంగా ఇది చాలా గొప్ప ట్విస్టు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశంలోకి ఇప్పటిదాకా 22 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. 21 మంది గురించి.. ఇదివరలోనే స్పీకరు వద్ద  అనర్హత వేటు వేయాల్సిందిగా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే నెలలు, ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటిదాకా నిర్ణయం రాలేదు. ఎందుకురాలేదు సారూ.. అంటోంటే.. అందుకు కారణం వైఎస్సార్ కాంగ్రెసే అని ఏపీ స్పీకరు కోడెల శివప్రసాద్ చెప్పేస్తున్నారు.

22వ ఫిరాయింపు గురించి వైకాపా ఎమ్మెల్యేలు బుధవారం వెళ్లి ఫిర్యాదు చేశారు. వంతల రాజేశ్వరిని అనర్హురాలని చేయమని అడిగారు. ఆ తరువాత.. స్పీకరు ప్రెస్ మీట్ పెట్టి.. అనర్హత విషయంలో.. తాను నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణం.. వైకాపా వారు కోర్టుకు వెళ్లడమే అని తేల్చేశారు. ప్రస్తుతం ఈ విషయం సుప్రీం కోర్టులో ఉన్నదని... అక్కడినుంచి జడ్జిమెంట్ వచ్చాక నిర్ణయం తీసుకుంటా అని చెప్పారు.

ఆయన చెప్పిన మాటల్లో న్యాయపరమైన మంచి చెడుల గురించి ఇప్పుడు ఆలోచించగలిగే, వాదించగలిగే ఓపిక, నేర్పు ఎవరికి ఉంటుందిగానీ.. ఆ 21 మంది విషయంలో.. వైకాపా వారి పాప ఫలితంగానే నిర్ణయం తీసుకోలేదని చెబుతున్న స్పీకరు, ఈ 22 వ ఫిరాయింపు విషయంలో సబ్జెక్టు కోర్టులో లేదు గనుక.. తక్షణం నిర్ణయం తీసుకుంటారా? లేదా, ముందు అందిన ఫిర్యాదుల సంగతి తేలిన తర్వాత గానీ.. దీని గురించి పరిశీలించలేం అని చెబుతారా వేచిచూడాలి.

అలా చెబితే గనుక...

‘‘గడ్డివామీ గడ్డివామీ ఎందుకు అడ్డం వచ్చావ్ అని అడిగితే.. ఆవు నన్ను మేయలేదు’’ అన్నదిట.. అనే చందంగా ఉంటుంది.