Advertisement


Home > Politics - Gossip
ఎమ్మెల్యే వంశీ.. ఎవరికీ అర్థం కాడంతే.!

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎవరికీ అర్థం కారు. ఆయనంతే, అదో టైపు.! ఏ పార్టీలో వున్నా, ఆ పార్టీకి బలంగా మారాల్సింది పోయి, బలహీనతగా మారుతుంటారు. అదే ఆయన ప్రత్యేకత. మరోపక్క, వల్లభనేని వంశీని రాజకీయంగా వాడుకోవడం, అవసరం తీరాక ఆయనతో రాజకీయంగా ఆడుకోవడం అధికార తెలుగుదేశం పార్టీకి అలవాటేననుకోండి.. అది వేరే విషయం. 

ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న వంశీ, తన గన్‌మెన్‌ని ప్రభుత్వానికి సరెండర్‌ చేసేసి వార్తల్లోకెక్కారు. అదేమంటే, ప్రభుత్వం తీరుకి నిరసనగానట.! కానీ, చంద్రబాబు మీద తనకు విశ్వాసం తగ్గలేదట. అదెలా.? అదే మరి, వల్లభనేని వంశీ స్టయిల్‌ అంటే. ఇద్దరు గన్‌మెన్లను కోరుతూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు వల్లభనేని వంశీ. ఈయనకీ, సీతారామాంజనేయులు అనే పోలీస్‌ ఉన్నతాధికారికీ మధ్య 'విభేదాలు' తెరపైకి వచ్చాయి అప్పట్లో. అదంతా వల్లభనేని 'రభసే' అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

కాంగ్రెస్‌ హయాంలో నానా యాగీ చేసేశారు సదరు పోలీస్‌ ఉన్నతాధికారి గురించి వల్లభనేని వంశీ. టీడీపీ హయాంలో, ఎమ్మెల్యే అయ్యాక వల్లభనేని ఆ వివాదాన్ని మర్చిపోయారనుకున్నారంతా. కానీ, ఇప్పటికీ సదరు పోలీస్‌ ఉన్నతాధికారి నుంచి తనకు ప్రాణహాని వుందన్నది వల్లభనేని వంశీ ఆరోపణ. కామెడీగా వుంది కదూ.. పోలీస్‌ ఉన్నతాధికారి నుంచి, అధికార పార్టీ నేతకి 'థ్రెట్‌' అంటే, పోలీస్‌ శాఖ ఎలా విశ్వసిస్తుంది.? 

అన్నట్టు, ఈ మొత్తం వ్యవహారాన్ని ఇంకా వల్లభనేని వంశీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళలేదట. ఇది మరీ పెద్ద కామెడీ కదా.! అన్నట్టు, గతంలో టీడీపీ మీద అలిగి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వంశీ, ఆ తర్వాత మళ్ళీ టీడీపీలో సర్దుకుపోయారు. ఈసారి మళ్ళీ వంశీ, జగన్‌తో స్నేహం కోసం అడుగులేస్తున్నారనుకోవాలా.? లేదంటే, తన ట్రేడ్‌ మార్క్‌ గందరగోళ రాజకీయాలు తెరపైకి తెచ్చారనుకోవాలా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.