Home > Politics - Gossip
ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రయివేట్ జెట్?

ఇప్పుడు రాజకీయాలకు డబ్బు కీలకం. అలా అని డబ్బు సమస్యకాదు. అడ్డగోలుగా డబ్బు వచ్చి పడుతోంది రాజకీయాల్లో. అందుకే ఖర్చుకు వెనుకాడంలేదు. కడప ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రెస్టీజియస్ గా తీసుకుంది అధికారపార్టీ. అందుకే ఎక్కడలేని బలగాలను అక్కడ మోహరించిందట. ఈ క్రమంలో ఒక ఓటుకు పాతికలక్షల వరకు ఇచ్చినట్లు రాజకీయవర్గాల బోగట్టా.

ఆ ముచ్చట అలావుంటే, వైకాపా బెంగుళూరులో క్యాంప్ రన్ చేస్తే, తెలుగుదేశం పార్టీ మూడుచోట్ల క్యాంప్ లు రన్ చేసిందట. అయితే ఈ మూడు క్యాంప్ లు సమన్వయం చేస్తూ, అక్కడ వున్నవారికి అన్ని సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించేందుకు తెలుగుదేశం కీలక ప్రముఖులు ఓ ప్రయివేట్ జెట్ ను వాడారట. కడప, పాండిచ్చేరి, గోవా, బెంగళూరుల నడుమ ఈ జెట్ లో రోజూ ఉదయం నుంచి సాయంత్రం చక్కర్లు కొట్టిందట. అంటే ఖర్చు ఏ రేంజ్ లో చేసారో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ఈ రెండు స్థానాల్లో మెజారిటీ ఓట్లు వైకాపావే. అది 2014 నాటి పరిస్థితి. కానీ ఈ మూడేళ్లలో ఈక్వేషన్లు అనేకం మారాయి. అధికారం, అవకాశ వాదం, ఇతరత్రా అనేక వ్యవహారాలు తెరమీదకు వచ్చాయి. పైగా ఈ ఎన్నికల్లో డబ్బు మంచినీళ్ల మాదిరిగా ఖర్చు చేసారు. ఓటుకు పాతికలక్షలు ఇచ్చినట్లు సీమ జిల్లాల్లో బలంగానే వినిపిస్తోంది. చిత్రమేమిటంటే అయినా కూడా గెలుపు ధీమా ఒకవైపు కాకుండా రెండు వైపులా వినిపించడం.

కడప, కర్నూలు, నెల్లూరు సీట్లను గెలుచుకుంటామని ఇరు వర్గాలు ధీమా పడుతున్నాయి. వైకాపా వర్గాలు కడపలో నాలుగైదు ఓట్లతో అయినా గట్టెక్కేస్తామని అంటున్నాయి. ఇక్కడ వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి పోటీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి కూడా అంతకంటే ధీమాతో ఉన్నారు. ఇరు వర్గాలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికల్ని. ఈ నేపద్యంలో రేపు ఫలితాలు ఎలా ఉండనున్నాయో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలకే ప్రయివేట్ జెట్ లు రంగప్రవేశం చేస్తే, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు ఎలా వుంటుందో సీన్. ఎన్ని కోట్లకు కోట్లు ఖర్చు చేస్తారో? ఎన్ని జెట్ లు రంగప్రవేశం చేస్తాయో?