Home > Politics - Gossip
బాబు దూకుడు ఖజానాపై గుదిబండ!

ఒక పనిని పూర్తి చేయడంలో తనకు చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించుకోవడం వేరు.. అలా నిరూపించుకునే ప్రయత్నంలో అనవసరపు ఆర్థికభారాన్ని పెంచేయడం మరొక ఎత్తు. మొదటి పని మంచిదే కానీ, కానీ అందుకోసం రెండో పద్ధతిని అనుసరించడం మాత్రం సమర్థించలేం.

ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విషయంలో అదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ప్రాణప్రదమైన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం అనేది తన తక్షణ ప్రాధాన్యం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి.. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద వేల కోట్ల రూపాయల అదనపు – అనవసర- భారాన్ని పెట్టడానికి సిద్ధమవడాన్ని గమనించినప్పుడు ఎవరైనా సరే.. విస్తుపోవాల్సిందే.

పోలవరం ప్రాజెక్టు విషయంలో పనులు వేగంగా చేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. మొన్నటిదాకా ప్రతిసోమవారమూ సమీక్షిస్తూ వచ్చారే తప్ప అక్కడ తదనుగుణంగా ఏమీ జరగలేదు. ఆయన కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయించడం, ఆర్థికభారం కరెక్టు కాదంటూ.. కేంద్రం ఆ ప్రతిపాదన తిరస్కరించడం జరిగింది.

రాష్ట్రం డబ్బు ఖర్చు పెట్టి అయినా కాఫర్ డ్యాం సత్వరం పూర్తి కావడానికి అవసరమైన తతిమ్మా ఏర్పాట్లు కొత్త టెండర్లతో చేయాల్సిందే అని చంద్రబాబు నిర్ణయించిన తర్వాత.. కేంద్రం ఇంకా ఘాటుగానే స్పందించింది. అసలు కాఫర్ డ్యాం అవసరం లేదు. డిజైను మారుద్దాం అంటూ పనులు ఆపించింది. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఇంకా దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ నాయకులతో సమావేశంలో పోలవరం ను ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ పూర్తి చేయలేం. కేంద్రం డబ్బు ఇవ్వకపోతే మనమైనా పూర్తి చేసుకోవాల్సిందే అని ఆయన చాలా ధాటిగా చెప్పేశారు.

ఈ నిర్ణయమే అసమంజసంగా అనిపిస్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానికి ప్రతిపైసా కేంద్రం ఖర్చుపెట్టాలనేది విభజన చట్టంలోని మాట. చట్ట ప్రకారం జరగాల్సిన దానికి చంద్రబాబు ఎందుకు అడ్డం పడుతున్నారో.. తెలియదు. కేంద్రం డబ్బులివ్వకపోతే.. వారు చట్టాన్ని అతిక్రమించినట్లు లెక్క. అందుకు ముఖ్యమంత్రి తానొక రాష్ట్రం నాయకుడిగా పోరాడాలి తప్ప.. మీరు మోసం చేస్తే మా డబ్బు తో చేసేసుకుంటాం.. అంటూ రాష్ట్రఖజానాకు భారం వేయడం విజ్ఞత అని ఎలా అనిపించుకుంటుంది.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ పూర్తి కాదు అని చంద్రబాబు అంటున్నారు. ఈ మాటలే పెద్దమాయ. ఎందుకంటే ఆయన చెబుతున్న కొత్త టెండర్లు జరిగినా సరే.. గ్రావిటీతో నీళ్లు ఇవ్వగలిగేలా ఒక భాగం పని జరగచ్చు తప్ప.. అసలు ప్రాజెక్టు రాబోయే రెండేళ్లలో తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా పూర్తి కాదు. అలాంటప్పుడు చంద్రబాబు ఈ భారాన్ని మోపడం ఎందుకు అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఖజానాపై భారం వేసే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలి.