Advertisement


Home > Politics - Gossip
రేవంత్ తర్వాత తెరాసలోకి సండ్ర!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది! ఆ పార్టీ పతనం పరిపూర్ణం కావడానికి మరో మెట్టు మాత్రమే మిగిలి ఉంది. దానికి కూడా నిర్ణయం జరిగిపోయినట్లు పుకార్లు వస్తున్నాయి గానీ.. ముహూర్తం తేలలేదు. ఒక పార్టీ బలానికి అసెంబ్లీలో ఉండే సభ్యుల ప్రాతినిధ్యమే గనుక.. నిదర్శనం అయ్యేట్లయితే.. తెలుగుదేశం త్వరలోనే పూర్తిగా జవసత్వాలు ఉడిగిపోయిన పార్టీగా మిగిలిపోవడం తథ్యం.

ఎందుకంటే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖరారు. అది పూర్తయిన తర్వాత.. పార్టీకి ఉన్న మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెరాసలో చేరుతారనే ప్రచారం ఇప్పుడు మళ్లీ జోరందుకుంటోంది. ఆయన పోక కూడా పూర్తయితే.. తాను తెలుగుదేశం పార్టీకి చెందిన వాడిని అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని ఆర్.కృష్ణయ్య ఒక్కరే సభలో మిగులుతారు. 

రేవంత్ తర్వాత.. సండ్రవెంకట వీరయ్య తెరాసలోకి జంప్ చేయడం అనివార్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ‘ఓటుకు నోటు’ కేసులో ఇరుక్కున్న ప్రధానమైన వ్యక్తి సండ్ర వెంకటవీరయ్యే.  ఆ కేసు ఉచ్చు నుంచి బయటపడడానికి ఆయన కూడా గులాబీ తీర్థం పుచ్చుకుంటారని దాదాపు ఏడాదికంటె ముందునుంచి ప్రచారం జరుగుతోంది.  ఇక ఇప్పుడు ఆ కేసులో ప్రధాన నిందితుడే కాంగ్రెస్ లోకి వెళుతున్నందున సండ్ర కూడా తన దారి తాను చూసుకుంటారని అంతా అనుకుంటున్నారు. రేవంత్ తోపాటు ఒకే కేసులో నిందితుడు గనుక.. ఆయన వెంట కాంగ్రెసులోకి వెళ్లచ్చు కదా అనే ఊహాగానాలు నడుస్తున్నప్పటికీ.. సండ్ర తెరాసలో చేరడమే ఇద్దరికీ సేఫ్ అనే వాదన వినిపిస్తోంది. 

ఇద్దరూ కాంగ్రెస్ లోకి వెళితే.. ప్రభుత్వం ఓటుకు నోటు కేసును తిరగతోడితే.. ఇద్దరికీ ఇబ్బందే. అలా కాకుండా, రేవంత్ కాంగ్రెస్లోకి వెళ్లి, సండ్ర తెరాసలోకి వస్తే.. ఆయన కోసం అయినా.. కేసు గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా ఇద్దరూ సేఫ్ గా ఉండొచ్చు. ఇలాంటి రకరకాల కాంబినేషన్లను లెక్కించి.. ఇద్దరూ చెరొక పార్టీలోకి వెళ్లవచ్చునని విశ్లేషకుల అంచనాలు సాగుతున్నాయి. 

సండ్రవెంకట వీరయ్య పార్టీ మారుతారనే పుకార్లు ఇప్పటివి కాదు. గతంలోనే ఈ  మాట బలంగా వినిపించినప్పుడు.. చంద్రబాబునాయుడు ఆయనకు టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యత్వం రూపంలో ఓ తాయిలం అందించి  పార్టీలోనే నిలబెట్టారు. ఇప్పుడు ఆ పదవి కూడా అయిపోయింది. మళ్లీ బోర్డును నియమించను కూడా లేదు. పదవులు పోగా, కేసులు మాత్రం మిగిలాయి. ఇలాంటప్పుడు అధికార పార్టీ పంచన ఉండడమే సేఫ్ అని సండ్ర కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఉన్న ముగ్గురిలో ఇద్దరు ఎమ్మెల్యేలు చెరోవైపు పోగా.. తెలుగుదేశం పార్టీ తరఫున.. గత ఎన్నికల వేళకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తొడకొట్టి బరిలోకి దిగిన బీసీసంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య.. ఏకైక తెదేపా ఎమ్మెల్యే అవుతారేమో.