Advertisement


Home > Politics - Gossip
బాబు ఇక్కడ లేకపోతే టీడీపీ ఇంత వీకా?

తెలుగుదేశం అధినేత ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎందుకు? అంటే..మూడేళ్లుగా ఎందుకు వెళ్తున్నారో, ఇప్పుడూ అందుకే వెళ్లారు. చంద్రబాబు విదేశానికి వెళ్తూ వెళ్తూ ఏపీలో వ్యవహారాలను సమీక్షించడానికి, చక్కబెట్టడానికి ఐదు మందితో ఒక కమిటీని నియమించి వెళ్లారు. దాంట్లో లోకేష్ బాబే ముఖ్య పాత్రధారి. ఇలా విదేశీ పర్యటనకు వెళ్లి, తనయుడికి పగ్గాలు అప్పగించి అతడికి కొంత అనుభవం తెప్పించడానికి కూడా బాబు ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నట్టుగా ఉన్నాడు.. కానీ, తీరా బాబు విదేశానికి వెళ్లాకా ఇక్కడ కథ మారిపోయింది! 

రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తెరపైకి రావడం. .ఆ వెంటనే రేవంత్ ఏపీ టీడీపీ లీడర్లపై సంచలన విషయాలు బయట పెట్టడం జరిగింది. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఏపీ, తెలంగాణ విభాగాలు అవాక్కయ్యాయి. అసలు రేవంత్ రెడ్డి మాటలపై ఏం స్పందించాలో, ఎలా స్పందించాలో కూడా తెలియని స్థితిలోకి పడిపోయాయి తెలుగుదేశం వర్గాలు. ఏపీ మంత్రి యనమల, పరిటాల సునీత కుటుంబాల మీద, వారు తెరాస అధినేత నుంచి పొందుతున్న లబ్ధిల గురించి, ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ అధికారికంగా స్పందించలేదు.. అంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు! ఇక తీరా.. తెలంగాణ టీడీపీ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరగనే జరిగింది. అందులో ఏం జరిగింది? వాదించుకున్నారు. 

రేవంత్ రెడ్డిపై మోత్కుపల్లి విరుచుకుపడితే, మోత్కుపల్లిపై రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ ఇచ్చాడు. మనసులో అసలు ఉద్దేశాలు ఏమున్నాయో కానీ.. కొంతమంది తెతెదేపా నేతలు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పొగబెట్టినట్టుగా వ్యవహారించారు! టీడీపీకి రాజీనామా చేస్తానని రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించక మునుపే తెలుగుదేశం నేతలు రేవంత్ పై చాలా నిందలే వేసేస్తున్నారు! ఈ మాటల వెనుక వాళ్ల లెక్కలు వాళ్లవి. ఎంతవరకూ వెళ్లిపోయారంటే.. ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడటం వరకూ! మామూలుగా ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు కామ్ గా ఉంటారు.. దీనిపై ఎక్కువ మాట్లాడితే అధినేతకే ప్రమాదం అని వేరే చెప్పనక్కర్లేదు. అయినా తెలుగుదేశం నేతలు రెచ్చిపోయారు! సరిగ్గా చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లగానే ఈ లొల్లి మొదలైంది.

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా లోగుట్లు బయటపడుతున్నాయి. రేవంత్ రెడ్డిని మరింతగా రెచ్చగొట్టి ఈ వ్యవహారాన్ని కంపుకంపు చేయడంలో టీడీపీ లీడర్లు ముందున్నారు. అవతల ఏపీ టీడీపీ లీడర్లు డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏం మాట్లాడితే రేవంత్ ఎలాంటి బాంబేస్తాడో అనేది వాళ్ల భయం. ఇదీ తెలుగుదేశం పార్టీలో జరుగతున్నవ్యవహారం. అందరికీ స్పష్టం అవుతున్న వ్యవహారం. మరి ఇప్పుడు బాబు నియమించి వెళ్లిన కమిటీ ఏం చేస్తోంది? హడావుడిగా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన లోకేష్ ఏం చేస్తున్నాడు? అంటే.. సమాధానాలు లేవు! బాబు విదేశీ పర్యటన మొత్తం తొమ్మిది రోజులపాటు ఉంది. ఆయన దాన్నంతా పూర్తి చేసుకుని వచ్చేసరికి టీడీపీలో ఇంకా ఏమేం జరుగుతాయో చూడాలి.