Home > Politics - Gossip
మళ్లీ అవమానిస్తారా?... ఆదరిస్తారా?

ప్రతి ఏడాది జనవరిలో ఓ జాతీయ ఉత్సవం ఘనంగా, వైభవంగా జరుగుతుంది. ఏమిటో తెలుసుగా? గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్‌ డే. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత మధ్య, ఓ విదేశీ అతిథి సమక్షంలో జరిగే గణతంత్ర దినోత్సవంలో ప్రధానమైన ఆకర్షణ, ఆసక్తిదాయకమైన కార్యక్రమం వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శన. ఆయా రాష్ట్రాల సంస్కృతీసంప్రదాయాలను, సంక్షేమ, అభివృద్ధి పథకాలను తెలియచేసే శకటాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి.

ప్రతి ఏడాది రాష్ట్రాలు ప్రత్యేక థీమ్‌తో శకటాలు రూపొందిస్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యమున్న శకటాల ప్రదర్శనలో వరుసగా రెండేళ్లు తెలంగాణకు అవమానం జరిగింది. 2014లో గణతంత్ర దినోత్సవం ముగిశాక రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి 2015లో 'బతుకమ్మ' థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించింది. కాని 2016, 2017లో అవకాశం ఇవ్వవలేదు.

ఇక వచ్చే ఏడాది (2018) ఏమవుతుందనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలుగింటి కోడలు. కాబట్టి ఎలాంటి కొర్రీలు వేయకుండా తెలంగాణ శకటానికి అనుమతి ఇస్తారని అనుకుంటున్నారు. ఢిల్లీలోని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్‌ మంత్రిని శకటం విషయం మాట్లాడారు. రెండేళ్లు వరుసగా అవకాశం ఇవ్వని వైనం వివరించారు.

2016 గణతంత్ర దినోత్సవంలో తెలంగాణ పాలుపంచుకోకుండా కొర్రీలు పెట్టింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని శకటాల ఎంపిక కమిటీ. రక్షణ శాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఈ కమిటీ ఉంటుంది. శకటాల ఎంపికకు ప్రతి రాష్ట్రం రెండు మూడు డిజైన్లు, కాన్సెప్టులు తయారుచేసి అక్టోబరులోనే ఎంపిక కమిటీకి పంపాలి.

ఆ డిజైన్లు, కాన్సెప్టులు పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేసి తెలియచేస్తే ఆ శకటాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. అదే పరేడ్‌లో చోటుచేసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతర, ప్రసిద్ధ నాట్యం పేరిణి, బతుకమ్మ థీమ్‌లు పంపింది. కాని ఎంపిక కమిటీ మూడింటినీ తిరస్కరించింది. మూడుసార్లు సమావేశమైన ఎంపిక కమిటీ మూడుసార్లూ తెలంగాణ కాన్సెప్టులను పక్కకు పెట్టింది.

విచిత్రమేమిటంటే ఏ కారణాలతో తిరస్కరించారో కూడా సమాచారం ఇవ్వలేదు. 'అయ్యా మా కాన్సెప్టులను ఎందుకు తిరస్కరించారు?' అని అడిగితే 'అవి మా ప్రమాణాలకు అనుగుణంగా లేవు' అని కమిటీలోని సభ్యులు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసుకున్న కాన్సెప్టులు మూడు సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించివే. మరి వీటికి ఎంపిక కమిటీ అభ్యంతరం ఎందుకు చెప్పిందో తెలియదు.

తాము నిర్థారించిన ప్రమాణాలకు (స్టాండర్డ్స్‌) అనుగుణంగా కాన్సెప్టులు లేవని మాత్రమే చెప్పింది. మరి ఆ ప్రమాణాలు ఏవి? అనే విషయం ప్రభుత్వానికి ముందే తెలియచేయలి కదా. అలా తెలియచేస్తే దాన్ని ప్రకారం ప్రతిపాదన తయారుచేసే అవకాశం ఉంటుంది. కాని ప్రభుత్వానికి ప్రమాణాలు తెలియచేశారో లేదో తెలియదు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 'బోనాలు పండుగ' థీమ్‌తో శకటం తయారీకి సర్కారు ప్రతిపాదన పంపింది. ఎంపిక కమిటీ దాన్ని తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం షాక్‌కు గురైంది.

తమది కొత్త ప్రభుత్వమని, తొలిసారి రిపబ్లిక్‌డే పెరేడ్‌లో పాల్గొంటున్నందున నిరాశకు గురిచేయొద్దని తెలంగాణ ఎంపీలు అప్పటి  రక్షణ మంత్రి మనోహర్‌ పారిక్కర్‌ను అభ్యర్థించారు. ఎలాగోలా ఆ గండం గడిచిపోయింది. కాని తరువాతి రెండేళ్లు అవకాశం ఇవ్వకుండా అవమానించారు. దీంతో హర్ట్‌ అయిన ఎంపీలు, ప్రభుత్వ పెద్దలు కేంద్రాన్ని బతిమాలే ప్రసక్తే లేదని తేల్చిపారేశారు. తీవ్రంగా ఆగ్రహించిన సిఎం కేసీఆర్‌ తన ప్రభుత్వం అధికారంలో ఉన్నంతవరకూ శకటం ప్రతిపాదనే పంపనన్నారు. ఎందుకో మనసు మారినట్లుంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడారు.