Advertisement


Home > Politics - Gossip
తెలంగాణ వాదనలో ఇదేం దుర్బుద్ధి!

ఓ కథ గుర్తు చేసుకోవాలి.

పూర్వకాలంలో ఇద్దరు మునులు ఒకచోట తపస్సు చేసుకుంటున్నారు. ఇద్దరూ బద్ధ శత్రువులు. కొంతకాలం గడిచాక.. ఇద్దరికీ ఒకేసారి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. ఒకడి దగ్గరకు వెళితే.. ‘రెండో వాడు ఏం కోరుకుంటాడో.. నాకు అవన్నీ రెట్టింపు కావాలి’ అని అడిగాడు. రెండో వాడి వద్దకెళ్లాడు దేవుడు. వాడు ఇంకా తెలివైన వాడు. మొదటివాడు ఏం అడిగాడో తెలుసుకున్నాడు. తను ఏం కోరుకున్నా.. తన శత్రువు తనకంటె గొప్పవాడైపోతాడని అర్థమైంది. చాలా ఆలోచించి ‘నాకు ఒక కన్ను, ఒక కాలు, ఒక చేయి పోవాలి దేవుడా’ అని కోరాడు. ఆ వెంటనే రెండో వాడికి రెండు కళ్లు, రెండు చేతులు, రెండు కాళ్లు పోయాయి....!

తాను చెడిపోయినా సరే.. ఇతరులు ఇంకా చెడిపోవాలని కోరుకునే వారి వైఖరికి సంబంధించిన కథ ఇది.

ఒక విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన ఇదే తీరుగా కనిపిస్తోంది. తెలంగాణ కృష్ణా జలాల్లో అదనపు వాటాలు కోరుకోవడం, గోదావరి మీద అదనపు ప్రాజెక్టులు కట్టుకోవడం ఇవన్నీ ఎన్నియనా జరగవచ్చు.. ఆ రాష్ట్రానికి ఉన్న కేటాయింపులను బట్టి కొత్తగా విభేదాలు రేగకుండా.. వారు అలాంటివన్నీ చేసుకోవచ్చు. కానీ కృష్ణా జలాల్లో అదనపు వాటాకోసం పోరాడుతున్న తెలంగాణ.. ఓ సరికొత్త వాదనను తెరపైకి తెస్తున్నది. అసలు గోదావరి జలాలను – కృష్ణ లోకి మళ్లించడమే తప్పు అని.. తగని పని అని వాదించే ప్రయత్నం చేస్తోంది.

గోదావరి జలాలను కృష్ణాలోకి తరలించడం అంటే.. అదేమీ.. తెలంగాణ చెరువుల్లో ఉన్న నీటిని దొంగిలించుకుపోవడం కాదు. వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని దారి మళ్లించి మరో రకంగా వినియోగించుకోవడం మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాదన ఎలా ఉన్నదంటే.. గోదావరి జలాలు కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోయినా పరవాలేదు. ఆ నీళ్లు వృథా అయినా మాకు సంతోషంగానే ఉంటుంది.

కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలు మాత్రం వాటిని వాడుకోవడానికి వీల్లేదు అని మంకు పట్టు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. పట్టిసీమ ద్వారా ఆ నీళ్లు మళ్లించకుంటే అవన్నీ వెళ్లి సముద్రంలో కలవడం తప్ప వాటికి మరో ప్రయోజనం లేదు. కృష్ణాలోకి వెళ్లకపోయినంత మాత్రాన ఆ నీళ్ల వలన తెలంగాణకు లాభం ఉంటుందనుకుంటే.. వారు ఆ వాదన లేవనెత్తడంలో అర్థముంది. వారికేమీ సంబంధం లేని ఆయకట్టు చివరి రాష్ట్రం, మిగుల జలాల వ్యవహారాన్ని తప్పుగా ఎత్తిచూపిస్తూ.. పట్టి సీమ ద్వారా తరలింపు అన్యాయం అనడంలో తెలంగాణ ప్రభుత్వం దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సంబంధాల విషయంలో చాలా విషయాల్లో సామరస్యంగా వ్యవహరిస్తూ, మిత్ర ధోరణిలోనే పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కారు ఈ విషయంలో మాత్రం ఇంత సత్యదూరమైన ప్రచారానికి ఎందుకు పాల్పడుతున్నదో అర్థం కావడం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.