Home > Politics - Gossip
వాళ్లంతా ‘ఆకర్ష మంత్రం’ పఠిస్తున్నారు!

సాధారణంగా ఎక్కడైనా సరే పనితీరుకు ఒక కొలబద్ధ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు పనిచేయడమే పనితనం అనిపించుకుంటుంది. పనిచేసే ఆసక్తి ఉన్న వారికి చాలా సందర్భాల్లో ఇది మ్యాచ్ అవుతుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో తమకు ఆసక్తి లేని పనిని కూడా కేవలం గుర్తింపు కోసం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది.

తమకు ఆసక్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా.. అస్తిత్వం చాటుకోవడం కోసం, తమ హోదాకు భంగం కలగకుండా ఉండడం కోసం సీనియర్లు చాలా మంది కొత్తగా ‘ఆకర్ష మంత్రం ’ నేర్చుకుంటున్నారు. ఇతర పార్టీల్లోంచి నాయకుల్ని కాంగ్రెసులోకి తీసుకురావడానికి తామంటే తాము అని పోటీ పడుతున్నారు.

రేవంత్ రెడ్డి వచ్చి చేరిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రెండు రకాలుగా మేలు జరిగింది. ఎటూ తెలుగుదేశం ఖాళీ అవుతున్నట్లే. తెరాసకు ప్రత్యామ్నాయం చూడాలంటే.. కాంగ్రెస్ దిక్కే నడవాలి అనే అభిప్రాయం నాయకుల్లో క్రియేట్ అయింది. అదే సమయంలో.. ఆ పార్టీలోని ఇతర సీనియర్లు అందరూ కొంత యాక్టివేట్ అయ్యారు. ఇప్పటినుంచి కష్టపడడం ఎందుకు.. ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటూ వచ్చిన వాళ్లంతా ఇప్పుడు వేగిరపడుతున్నారు. తాము కూడా పనిచేసినట్లుగా, చేస్తున్నట్లుగా పార్టీ బలం పెంచడానికి కష్టపడుతున్నట్లుగా అధిష్టానం కళ్లలో పడే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి రావడంతోటే తన వెంట కొందరు కీలక నాయకుల్ని తీసుకువచ్చారు. ఈ రంగు మార్చుకున్న పచ్చదళం మొత్తం కాంగ్రెస్ కు ఖచ్చితంగా ప్లస్ పాయింటే. అయితే రాష్ట్రంలో జరిగే బహిరంగ సభలో ఆర్భాటంగా చేరికల పర్వం నడిపించడానికి రేవంత్ ఇంకా అనేక మంది నాయకులను సిద్ధం చేస్తున్నారు. ఇదంతా జరిగిందంటే.. గనుక.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి రేవంత్ ఒక్కడే పనిచేస్తున్నాడు.. మిగిలిన వాళ్లంతా చోద్యం చూస్తున్నారు అనే ఇంప్రెషన్ వస్తుందనేది తతిమ్మా సీనియర్ల భయంగా ఉంది.

అందుకని వారు తాము కూడా ఇతర పార్టీలనుంచి వలసలను ఆకర్షించాలనేది ఒక బెంచ్ మార్క్ లాగా నిర్ణయించుకున్నారు. తమకు కూడా పార్టీలో పాస్ మార్కులు పడాలంటే.. ఇతరనాయకులపై ఆకర్ష మంత్రం ప్రయోగించాలనేది వారి లెక్క. పాపం.. కాంగ్రెసు నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కష్టపడి పనిచేయాల్సి వస్తోంది.