cloudfront

Advertisement


Home > Movies - Movie News

చట్ట సభలకు సినీగ్లామర్‌ మరింత పెరుగుతుందా?

చట్ట సభలకు సినీగ్లామర్‌ మరింత పెరుగుతుందా?

భారతీయ చట్ట సభలకు సినీగ్లామర్‌ కొత్త ఏమీకాదు. దశాబ్దాల నుంచి సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తూనే ఉన్నారు, కొందరు గొప్ప సక్సెస్‌లను సాధించారు. కొందరు అట్టర్‌ ప్లాప్‌ అయ్యారు. మరికొందరు ఏదో అలా అలా బండి నడిపిస్తూ ఉన్నారు. పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు అయిన వారున్నారు. బతికున్నంత కాలం అలాంటి వాళ్లు ఒక వెలుగు వెలిగారు. కాలేజీల నుంచి, గ్రామ స్థాయిల నుంచి రాజకీయాలు చేస్తూ ఎదిగిన నేతలకు మించిన స్థాయిలో సినిమా హీరోలు రాజకీయంగా రాణించిన సందర్భాలున్నాయి.

అలాంటి సంచనాల్లో కరుణానిధి, ఎంజీఆర్‌ వంటి వాళ్లు ముందుంటారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌, జయలలిత వంటి వాళ్లుంటారు. వీళ్లు మాత్రమే గాక.. చట్ట సభలకు ప్రజల నుంచి ఎన్నికైన వాళ్లు, తమవంటూ పార్టీలు పెట్టి కొంత ప్రయత్నాలు సాగించిన వాళ్లు, సాగిస్తున్న వాళ్లు చాలామంది ఉన్నారు.

ఈసారి కూడా చాలామంది సినిమా వాళ్లు ఎన్నికల పోరులో ఉన్నారు. వారిలో ఎంతమంది నెగ్గుతారు? ఎంతవరకూ రాజకీయంగా వారు రాణిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తిదాయకమైన అంశంగా  మారింది. ఈసారి ఎన్నికల రణరంగంలో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీలో ఉన్న కొందరు సినీ ప్రముఖుల జాబితాను పరిశీలిస్తే.. వీరిలో ఎవరు రాణిస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతుంది.

సుమలత.. ఎంపీగా విజయం ఖరారే?
నటీమణిగా కాకుండా, అంబరీష్‌ సతీమని అనే హోదాతో సుమలత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ఇండిపెండెంట్‌గా మండ్య ఎంపీ సీటు నుంచి పోటీలో ఉన్నారు. అక్కడ జేడీఎస్‌తో ఆమె అమీతుమీ పోరాడుతున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా ఉన్న కుమారస్వామి తనయుడు కూడా సినీనటుడే కావడం గమనార్హం. అతడు నటించింది ఒక సినిమాలో అయినా.. సినీ గుర్తింపు కలిగినవాడే. ఇలాంటి నేపథ్యంలో వారిద్దరి మధ్యన పోరాటం గట్టిగా సాగుతూ ఉంది. సుమలత, నిఖిల్‌ గౌడల పోరులో సుమలత పైచేయి సాధించే అవకాశాలు లేకపోలేదు.

అంబరీష్‌ మరణంతో ఆమెపై ఉన్న సానుభూతి, ఆ ప్రాంతంలో అంబరీష్‌కు రాజకీయంగా ఉన్న గుర్తింపు, వారి సొంత కులస్తులు గట్టిగా ఉండటం, బీజేపీ ప్రత్యక్షంగా మద్దతు పలుకుతూ ఉండటం, కాంగ్రెస్‌ వాళ్లు కూడా లోపాయికారీగా సహకరిస్తున్నారనే విశ్లేషణల నేఫథ్యంలో సుమలత విజయం సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.

ప్రకాష్‌రాజ్‌.. ఈల వేస్తాడా?
ఈసారి ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్న మరో సినీ ప్రముఖుడు ప్రకాష్‌ రాజ్‌. ఈయనకు టికెట్‌ ఇవ్వడానికి కాంగ్రెస్‌ పార్టీ అయినా, ఆమ్‌ ఆద్మీ పార్టీ అయినా రెడీగానే కనిపించింది. అయితే ప్రకాష్‌ రాజ్‌ మాత్రం ఇండిపెండెట్‌గా పోటీకి దిగాడు. బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నాడు ఈ నటుడు. మొత్తం దక్షిణాదిన అంతా గుర్తింపు ఉన్న ప్రకాష్‌రాజ్‌ అలియాస్‌ ప్రకాష్‌ రాయ్‌.. అక్కడ నుంచి సత్తా చాటగలడా? అనేది మాత్రం సందేహంగానే  కనిపిస్తోంది. 'ఈల' గుర్తును తెచ్చుకుని ప్రకాష్‌ రాజ్‌ ఎంపీగా పోటీలో ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీలు బలీయమైన శక్తులుగా ఉన్నాయి. వారి మధ్యన ఈయన ఏ మేరకు నెట్టుకొస్తాడో చూడాలి!

మరో ఎంపీ అభ్యర్థి సురేష్‌ గోపి!
సొంత రాష్ట్రం కేరళ నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు సురేష్‌ గోపి. భారతీయ జనతాపార్టీ సానుభూతి పరుడుగా వ్యవహరిస్తున్న ఈయనకు ఇప్పటికే బీజేపీ వాళ్లు రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. కేరళలో బలపడటమే లక్ష్యంగా సురేష్‌ గోపి సినీగ్లామర్‌ను బీజేపీ వాడుకొంటూ వస్తోంది. రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమే కాకుండా.. ఇప్పుడు ఎంపీగా కూడా నిలబెట్టింది. ప్రత్యక్ష పోటీలో సురేష్‌ గోపి కమలం పార్టీ తరఫున ఏ మేరకు సత్తా చాటతాడో చూడాల్సి ఉంది!

కమల్‌ హాసన్‌.. పరిస్థితి ఏమిటి?
తను ఎక్కడా పోటీకి దిగలేదు కానీ.. తన పార్టీ అభ్యర్థులను అయితే కమల్‌ హాసన్‌ పోటీలో పెట్టారు. టార్చ్‌లైట్‌ గుర్తును తెచ్చుకుని.. వెలుగునిస్తానంటూ కమల్‌ ప్రచారం చేసుకొంటూ ఉన్నాడు. కమల్‌ రాజకీయ సిద్ధాంతాలకు తగ్గట్టుగానే ఉన్నారు ఆయన అభ్యర్థులు కూడా. విద్యావంతులు, రిటైర్డ్‌ బ్యూరోక్రాట్లను కమల్‌ ఎంపీలుగా పోటీలోకి దించారు. అయితే వారు సత్తా చాటగలరా? అనేది ప్రశ్నార్థకం. కమల్‌ మరీ బీభత్సమైన మాస్‌ హీరో కాదు. క్లాస్‌ వర్గాలకే కమల్‌ బాగా చేరువ. అలాంటి వారు ఓట్లు వేస్తే కమల్‌  అభ్యర్థులు గెలిచేస్తారా? అనేది సందేహమే. అయితే తమిళనాట ఇప్పుడు రాజకీయ శూన్యత ఉంది. అన్నాడీఎంకే ట్రెడిషనల్‌ ఓటు గనుక కమల్‌ వైపు మళ్లితే ప్రయోజనం ఉండవచ్చు. అయితే అది జరుగుతుందనేది అనుమానమే!

ఉపేంద్ర కథ అలానే ఉంది!
ఉపేంద్ర కూడా తన రాజకీయ పార్టీ తరఫున కొంత హడావుడి చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఒక పార్టీని స్థాపించి దాని నుంచి బయటకు వచ్చిన ఉప్పీ ఈసారి తన పార్టీ ద్వారా అభ్యర్థులను పోటీలో ఉంచాడు. వారు ఏ మేరకు రాణిస్తారు అనేది సందేహంగానే ఉంది. ఉప్పీ పార్టీపై కర్ణాటకలో ఏమీ అంచనాలు కూడా లేదు.

పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యే అయినా అవుతారా?
దక్షిణాదిన ఈసారి తన పార్టీతో లక్‌ను పరీక్షించుకుంటున్న మరో సినీహీరో పవన్‌ కల్యాణ్‌. వీరావేశ డైలాగులతో పవన్‌ కల్యాణ్‌ ప్రచారం కూడా చేసుకున్నారు. ఒకదశలో సీఎం పదవే టార్గెట్‌ అని చెప్పుకున్న పవన్‌ కల్యాణ్‌.. ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినా నెగ్గి చట్ట సభలోకి ఎంట్రీ ఇస్తారా? అనే దాని మీదే బెట్టింగులు నడుస్తూ ఉన్నాయి. పవన్‌ కల్యాణ్‌ రెండుచోట్ల నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో రెండుచోట్ల గెలుస్తారనే వాళ్లు కనిపించడం లేదు. కనీసం ఒకచోట గెలుస్తారని ఆయన విషయంలో కొందరు బెట్‌ వేస్తుండగా, రెండుచోట్లా ఓడతారంటూ మరికొందరు సాహసవంతులు బెట్టింగులకు రెడీగా కనిపిస్తూ ఉన్నారు.

తన పార్టీ తరఫున చాలా నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను పెట్టారు కానీ.. పవన్‌ కల్యాణ్‌ వారిని గెలిపించే రీతిలో ప్రచారం చేయలేదు. ప్రత్యేకించి చంద్రబాబును పల్లెత్తుమాట అనకపోవడం.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం పవన్‌ కల్యాణ్‌ గ్రాఫ్‌ను బాగా తగ్గించి వేసింది. తెలుగుదేశంలో లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకుని పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో పోటీ చేశారనే భావన ఓటర్ల నుంచి వ్యక్తం అయ్యింది. ఇప్పటికే పవన్‌ విషయంలో ఓటింగ్‌ కూడా ముగిసిపోయింది కాబట్టి.. ఇక అసలు కథ ఏమిటో తేలాల్సి ఉంది.

ఉత్తరాదిన గ్లామరస్‌ హీరోయిన్లు!
ఈసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీలో ఉన్నారు జయప్రద. గతంలో సమాజ్‌ వాదీ పార్టీ తరఫున ఎంపీగా నెగ్గిన నేపథ్యం ఉన్న జయ ఈసారి బీజేపీ తరఫున తన లక్‌ను పరీక్షించుకుంటున్నారు. రాంపూర్‌ నుంచినే పోటీలో ఉన్నారామె. మరి ఈ అలనాటి అందాల నటి.. రాంపూర్‌ నుంచి విజయం సాధించగలదా? అనేది ప్రస్తుతానికి మిస్టరీనే. ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపేయడంతో.. అక్కడ బీజేపీకి గట్టి పరీక్షే ఎదురవుతోంది. దీంతో జయప్రద విజయం సాధిస్తుందా? అనేది సందేహంగా ఉంది.

ఇక అచ్చం అలాంటి పరిస్థితినే ఎందుర్కొంటున్నారు హేమమాలిని. ఈసారి తనకు చివరి అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను వేడుకుంటున్నారు. మథుర నుంచి బీజేపీ తరఫున గత ఎన్నికల్లో బంపర్‌ మెజారిటీతో నెగ్గిన హేమ ఈసారి గెలిచి నిలిస్తే అది గొప్ప సంగతే అవుతోంది. ఇక కాంగ్రెస్‌ తరఫున నిలుస్తోంది న్యూ కమర్‌ ఊర్మిల. ముంబై నార్త్‌ ఎంపీ సీటు నుంచి ఆమె పోటీలో ఉన్నారు. గతంలో బాలీవుడ్‌ హీరో గోవింద ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫునే నెగ్గారు. ఆ స్థానంలో ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు ఊర్మిలను బరిలోకి దించారు.

కాంగ్రెస్‌కు సానుకూల నియోజకవర్గం కావడంతో ఊర్మిలకు కాస్తో కూస్తో విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తన ప్రచార పర్వంలో అతి ఏమీ చేయకుండా.. డీసెంట్‌ ప్రచారం చేసుకుంటోంది ఊర్మిల. కలిసొస్తే ఈ 'రంగీల' నటి ఎంపీగా లోక్‌సభలోకి ప్రవేశించడం ఖరారే!

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!