cloudfront

Advertisement


Home > Movies - Movie News

డబ్బింగ్‌ చెప్పుకోవడమే డెడికేషన్‌!

డబ్బింగ్‌ చెప్పుకోవడమే డెడికేషన్‌!

మనం చేసే పనిపట్ల అంకితభావం ఉండాలని అంటారు.. ఏ రంగంలో పని చేసేవాళ్లకు అయినా వర్తించే నియమం ఇది. మరి సినిమా రంగం.. ఇది గ్లామరస్‌ ఫీల్డ్‌, కలర్‌ఫుల్‌ ఫీల్డ్‌, కోట్ల రూపాయలు సంపాదించుకోగల ఫీల్డ్‌... బోలెడంత గుర్తింపును ఇచ్చే ఫీల్డ్‌. ఈ ఫీల్డ్‌లో దాదాపుగా వారసత్వంతోనే ఎక్కువమంది సెటిలవుతూ ఉంటారు. అలా అయినా, లేదా ఏదైనా లక్‌ కలిసి వచ్చి.. ఒక్కసారి స్టాండ్‌ అయ్యారంటే.. అంతకు మించి కావాల్సింది ఏమీలేదు. ఇదే బయటివాళ్లకు ఉన్న అభిప్రాయం. ఈ ఫీల్డ్‌లో పనిచేస్తున్న వాళ్లలోనూ దాదాపు ఇదేధోరణి కొంతవరకూ కనిపిస్తుంది. అయితే ఈ గ్లామరస్‌ ఫీల్డ్‌లో కూడా తమ అంకిత భావాన్ని చాటేవాళ్లు.. తీవ్రంగా కష్టపడేవాళ్లూ.. చాలామంది కనిపిస్తారు. వాళ్లకు అంత అవసరం లేకపోయినా.. కష్టపడటమే వాళ్ల ప్రత్యేకత! అలాంటి వాళ్లే స్టార్లుగా మన్నన పొందుతూ ఉంటారు!

 

వృత్తి పట్ల అంకితభావం ఏమిటో వారిని చూసి అర్థం చేసుకోవాలి. రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ఇదే టాపిక్‌ గురించి రాస్తూ ఒకచోట లతామంగేష్కర్‌ గురించి ప్రస్తావిస్తారు. ఆ బాలీవుడ్‌ గాయనీమణికి తెలుగు రాదు, అర్థంకాదు. పలకడం కూడా కష్టమే. అయినా మనవాళ్లు ఆమెచేత కొన్ని పాటలు పాడించారు. అవి కూడా క్లాసిక్స్‌ అయ్యాయనుకోండి. యండమూరి రచయితగా పనిచేసిన ఒక సినిమాకు లతా మంగేష్కర్‌ చేత ఒక సాంగ్‌ పాడిస్తున్నారట. తెలుగులో లిరిక్స్‌ ఇచ్చారు. వాటిని కూడబలుక్కుని ఏదో ట్యూన్‌కు తగ్గట్టుగా పాడేసి ఆమె వెళ్లిపోవచ్చు. అడిగేవారు ఎవరూలేరు. ఆమె పేరు పడితేచాలు నిర్మాతలు, దర్శకుడికి కూడా. అలా ఏదో కమర్షియల్‌గా వ్యవహరించేసి పాడేసి, డబ్బు తీసుకుని వెళ్లిపోతే ఆమె భారతరత్న స్థాయికి వెళ్లేది కాదేమో!

తను పాడుతున్న పాటను మొత్తం ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసి ఇవ్వమని అడిగిందట ఆమె. అక్కడే ఉన్న యండమూరి ఆ పాటను మొత్తం అనువదించి ఆమెకు ఇచ్చారట. తెలుగులో డైరెక్టుగా భావాన్ని అర్థం చేసుకోలేని లతా.. ఇంగ్లిష్‌లో ఆ పాటను అర్థం చేసుకుని.. అప్పుడు పాడటానికి రెడీ అయ్యిందట. అదీ అంకిత భావం అంటే. ఇలాంటి అంకిత భావాన్ని నేటితరం వారు చూపుతున్నారా లేదా అనేది పెద్ద సందేహం. ప్రత్యేకించి సినిమా రంగంలో! ఈ తరహా అంకిత భావానికి నిదర్శనంగా పాత వాళ్లనే ప్రస్తావించుకోవాలి. ఈ తరానికి కూడా టచ్లో ఉన్న అలాంటి ఆర్టిస్టులే మమ్ముట్టీ, కమల్‌హాసన్‌, మోహన్‌లాల్‌ లాంటివాళ్లు!

సపోజ్‌ 'యాత్ర' సినిమాకు మమ్ముట్టీ అంత కష్టపడి తెలుగు కూడబలుక్కుని డబ్బింగ్‌ చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి? ఆయనే డబ్బింగ్‌ చెప్పుకోకపోతే ఆ పాత్రకు వేరేవాళ్లు వాయిస్‌ ఇస్తారు. నటించడంతోనే మమ్ముట్టీ బాధ్యత అయిపోతుంది. సినిమాకు ఇదే రెస్పాన్సే ఉంటుంది. మమ్ముట్టీకి వచ్చే పేరు ఎలాగూ వస్తుంది. యాత్ర సినిమాకే కాదు, ఇది వరకూ ఆయన నటించిన డైరెక్ట్‌ తెలుగు సినిమా.. స్వాతికిరణం వంటి వాటికి, అనువాద సినిమా దళపతికి సొంత డబ్బింగ్‌ అవసరం ఏముంది?

డబ్బింగ్‌ ఆర్టిస్టులు దొరక్క మమ్ముట్టీ కూడబలుక్కుని తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకున్నాడా? ఆయనకున్న అంకిత భావం అలాంటిది. తన పాత్రకు మరొకరు డబ్బింగ్‌ చెప్పడం ఏమిటి.. వేరేవాళ్లు తనకు వాయిస్‌ అరువిస్తే మమ్ముట్టీకి అస్సలు నచ్చదట. ఏవో ఆయనతో సంబంధం లేకుండా ఇతర భాషల్లోకి అనువాదం అయ్యే సినిమాలను పక్కనపెడితే.. ఆయన చేసే స్ట్రైట్‌ సినిమాల్లో వేటికైనా ఆయనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొంటూ ఉంటాడు.

తమిళంలో కూడా ఇదే కథ. 'ప్రియురాలు పిలిచింది' అనే తమిళ సినిమాలో మమ్ముట్టీ నటించాడు. అప్పటికే మలయాళంలో ఆయన స్టార్‌ హీరో. అయినా.. తమిళంలో సొంత డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. అదే సినిమాలో నటించిన అప్పటి  తమిళ యువనటులు అజిత్‌, అబ్బాస్‌లకు వేరేవాళ్లు డబ్బింగ్‌ చెబితే.. మమ్ముట్టీ మాత్రం సొంత డబ్బింగ్‌ చెప్పుకున్నాడు అదీ అంకిత భావం అంటే. అలాంటి తీరుతోనే దశాబ్దాలుగా ఆయన ఆయన మెగాస్టార్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. పరాయి భాషలో మాట్లాడటం ఎంతకష్టమో.. ఆ భాషను నేర్చుకోవడానికి, కనీసం అవసరం మేరకు అయినా కొన్ని పదాలను సరిగా పలకడానికి చాలా కష్టపడాలని చెప్పనక్కర్లేదు. ఒక స్టార్‌ అయినా అలా కష్టపడేతత్వం మమ్ముట్టీది.

ఇక మోహన్‌లాల్‌ కూడా ఈ కోవకే చెందుతారు. ఆయన నటించిన స్ట్రైట్‌ తెలుగు సినిమా 'మనమంతా'కు సొంత డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. అదేదశలో నటించిన 'జనతా గ్యారేజ్‌'కు కూడా ఆయనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నా.. ఆ సినిమా రూపకర్తలు వేరేవాళ్లతో డబ్బింగ్‌ చెప్పించారు. దానికి వాళ్లు వేరే రీజన్‌ చెప్పుకున్నారు. అది వాళ్ల ఇష్టం. మోహన్‌లాల్‌ తనవంతు ప్రయత్నం చేశాడు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళంలో కూడా సొంత డబ్బింగ్‌ చెప్పుకునేందుకు రెడీగా ఉంటాడు కమల్‌ హాసన్‌. సదరు సినిమాలు తమిళంలో పాటు ఇతర భాషల్లో కూడా ఒకేసారి విడుదల అయ్యేట్టు అయితే కమల్‌ సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొంటూ ఉంటాడు. అయితే మరీ బిజీ అయితే మాత్రం.. ఎస్పీబీ వంటి వారు కమల్‌కు గొంతు అరువిస్తూ ఉంటారు.

నటన కోసం ఇలా ఇతర భాషలు నేర్చేసుకునే హీరోలు కొంతమంది ఈ తరంలోనూ ఉన్నారు. హీరోగా అంత సక్సెస్‌ కాలేకపోయాడు కానీ.. సిద్ధార్థ్‌ కూడా ఈ తరహావాడే. ఐదు భాషలను రాసి, మాట్లాడేగలిగే నటుడు ఇతడు. కన్నడీగ ప్రకాష్‌రాజ్‌.. క్యారెక్టర్‌ ఆర్టిస్టే అయినా.. తమిళ, తెలుగు భాషల ఇండస్ట్రీస్‌లో తన వాయిస్‌ను ప్రత్యేక ఆస్తిగా మార్చుకున్నాడు. కెరీర్‌ ఆరంభంలో ఈ నటుడికి వేరేవాళ్లు డబ్బింగ్‌ చెప్పారు. ప్రకాష్‌రాజ్‌ అసలు వాయిస్‌తో పోలిస్తే.. సదరు డబ్బింగ్‌ ఆర్టిస్టులు ఏ మూలకు సరిపోతారు?

పైన ప్రస్తావించుకున్న వాళ్లంతా.. డబ్బింగ్‌ కోసం కష్టపడాల్సిన అవసరం లేనివాళ్లు. వాళ్లు నటిస్తే చాలు.. అని చాలామంది ఫిల్మ్‌మేకర్లు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే తాము వచ్చిన వత్తిలో తమకంటూ మరింత ప్రత్యేకత చూపించుకోవడానికే వాళ్లంతా కొంచెం ఎక్స్‌ట్రా కష్టంపడ్డారు. అందులో కూడా తమ ప్రత్యేకత నిరూపించుకున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు కూడా ఇదేకోవకే చెందుతారు. వాస్తవానికి హీరోయిన్ల కెరీర్‌ స్పాన్‌ చాలా తక్కువ. దశాబ్దాలకు దశాబ్దాలు వీళ్లు కొనసాగే అవకాశాలు ఉండవు. అందులోనూ.. వీళ్లు ఒక్కో భాషలో కొన్ని సినిమాలను వెదుక్కోవాలి. కాబట్టి హీరోయిన్లు అన్ని భాషలనూ నేర్చుకొంటూ వెళ్లడం కష్టమే. అయినా కొందరు కష్టపడుతూ ఉంటారు. తమ అంకిత భావాన్ని చూపుతూ ఉంటారు.

ప్రత్యేకించి ఈ ఐదారేళ్లలో పరిచయం అయిన హీరోయిన్లలోనే ఈతీరు కనిపిస్తూ ఉంటుంది. సాయిపల్లవి,అనుపమ పరమేశ్వరన్‌, నిత్యామీనన్‌, రష్మిక.. వీళ్లు దాదాపుగా తమ తొలి తెలుగు సినిమా నుంచినే డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించుకున్న వాళ్లే. మరికొందరు కొన్ని సినిమాల తర్వాత స్టార్ట్‌ చేశారు. పూజాహెగ్డే, కీర్తీసురేష్‌, తాప్సీ, రకుల్‌ప్రీత్‌, మడోన్నా సెబాస్టియన్‌ వంటివాళ్లు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే సమంత కూడా సొంత డబ్బింగ్‌ క్లబ్‌లోకి జాయిన్‌ అయ్యింది కానీ.. ఈమె చేత తెలుగును మాట్లాడించే విషయంలో సదరు మూవీమేకర్లు మరింత శ్రద్ధ తీసుకోవాలి.

మహానటిలో శంకరయ్యను కాస్తా సంకరయ్య అంటూ పలికి విసిగించింది. అలాగే యూటర్న్‌లో కూడా సమంత డబ్బింగ్‌ కాస్త రణగొణగా అనిపిస్తుంది. తెలుగు విషయంలో సమంత మరింత కసరత్తు చేయాలి. ఎంతైనా తెలుగు ఇంటి కోడలు కదా!
 

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!