Advertisement


Home > Movies - Movie News
ఇలియానాకు రాజమౌళి ఏం చెప్పాడు..?

రాజమౌళి దర్శకత్వంలో ఇలియానా ఒక్క సినిమా కూడా చేయలేదు.  సినిమాల పరంగా వీళ్లిద్దరికీ సంబంధం లేదు. కానీ రాజమౌళి చెప్పిన కొన్ని మాటలు మాత్రం తన మనసులో అలా నాటుకుపోయాయంటోంది ఇలియానా. బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఈ గోవా బ్యూటీ, తన సినిమాకు సంబంధించి రాజమౌళి చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంది.

"చాలా ఏళ్ల కిందటి మాట. అప్పుడే నా సౌత్ సినిమా రిలీజైంది. అదే టైమ్ లో రాజమౌళిని కలిశాను. చాలా తక్కువ మాట్లాడే వ్యక్తి ఆయన. నా సినిమాను ఎలా భరించారో చెప్పుకొచ్చారు. ఎందుకంటే అదొక భయంకరమైన సినిమా. అట్టర్ ఫ్లాప్ అయిన మూవీ. అదొక చెత్త సినిమా అంటూ నాతో చెప్పిన రాజమౌళి, అందులో నేను మాత్రం బాగున్నానని చెప్పారు."

రాజమౌళి చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ తన మనసులో అలానే ఉన్నాయంటోంది ఇలియానా. సినిమా ఎలాంటిదైనా అందులో వందశాతం అంకితభావం చూపించాలని, అప్పుడే మూవీ ఫ్లాప్ అయినా ఇలాంటి ప్రశంసలు దక్కుతాయంటోంది ఇలియానా. ఇక సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ.. ఓ సినిమాకు తడుముకోకుండా 'ఎస్' లేదా 'నో' చెప్పే స్థాయిలో ఉండడం తనకు ముఖ్యమంటోది ఇలియానా.

"ఆమధ్య మరో సినిమా కూడా రిజెక్ట్ చేశాను. ఎందుకంటే అందులో నేను అందంగా మాత్రమే కనిపిస్తాను. అంతకుమించి మరేం ఉండదు. నిజానికి ఆ సినిమాలో చాలా పెద్దోళ్లు నటించారు. కానీ నాకు స్కోప్ లేదు కాబట్టి తప్పుకున్నాను. ఇలా కొన్ని సందర్భాల్లో నేను చేయనని గట్టిగా చెప్పగలిగాను. ఓ సినిమాను చేస్తాను లేదా చేయనని గట్టిగా చెప్పే స్థాయి కలిగి ఉండడం చాలా ముఖ్యం."

ఇలా తన మనసులో భావాల్ని బయటపెట్టింది ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ లో లైఫ్ బాగుందని చెబుతున్న ఇలియానా, తననుతాను నిరూపించుకునే పాత్రల కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది.