cloudfront

Advertisement


Home > Movies - Movie News

భారతీయుడు 2.. సీరియస్ గానా, కమల్ ఏమన్నాడు?

భారతీయుడు 2.. సీరియస్ గానా, కమల్ ఏమన్నాడు?

భారతీయుడు 2 సినిమాకు సంబంధించి రూమర్లు మళ్లీ మొదలయ్యాయి. కొన్నాళ్ల కిందట భారతీయుడు 2 అంటూ వార్త వచ్చింది. అప్పటికే రెండు దశాబ్దాల కిందటి సినిమా అయిన భారతీయుడుకు సీక్వెల్ అని, కమల్ హీరో, శంకర్ దర్శకత్వం, లైకా నిర్మాణం.. అంటూ వార్తలు వచ్చాయి. తెలుగు వెర్షన్ రైట్స్ ను లైకా నుంచి దిల్ రాజు కొనుక్కొంటున్నట్టుగా కూడా కబుర్లు వినిపించాయి. మొదట ఆ విషయాన్ని ధ్రువీకరించిన దిల్ రాజు.. అనంతరం ఆ ప్రాజెక్ట్ నుంచి తను తప్పుకున్నట్టుగా స్వయంగా అనౌన్స్ చేశాడు.

ఆ తర్వాత భారతీయుడు 2 ఊసులో లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి అజయ్ దేవగణ్‌ను తెరపైకి తెచ్చారు. భారతీయుడు 2లో ఈ బాలీవుడ్ నటుడు నటించబోతున్నాడని.. 2.0తో అక్షయ్ కుమార్ ను సౌత్‌కు తెచ్చిన శంకర్ ఈసారి అజయ్ దేవగణ్ ను తెస్తున్నాడని.. ప్రధాన మీడియా వర్గాలన్నీ చెబుతున్నాయిప్పుడు. అయితే భారతీయుడు సీక్వెల్ నిజంగా పట్టాలెక్కుతుందా? అనేది మాత్రం డౌట్ గానే మిగిలింది. అసలుకు ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాకు ఇప్పుడేం సీక్వెల్ చేస్తారు? అనేది అంతుబట్టని అంశం.

కథే పెద్ద కొశ్చన్ మార్క్. ఇక కమల్ హాసన్ రాజకీయాలు అంటున్నాడు. ప్రస్తుతం విశ్వరూపం 2 సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు కమల్ హాసన్. ఈ నేపథ్యంలో భారతీయుడులో అజయ్ దేవగణ్ అనే అంశం గురించి ఆరాతీస్తే.. తనకేం తెలియదని చెప్పాడు. ఆ సినిమా దర్శకుడు నటీనటులను ఎంచుకొంటూ ఉండవచ్చని కమల్ అన్నాడు. ఒకరకంగా ఆ ప్రాజెక్ట్ గురించి శంకర్ తనతో ఏమీ చెప్పలేదన్నట్టుగా కమల్ వ్యాఖ్యానించాడు.

అసలుకు భారతీయుడు 2లో కమల్ హాసన్ హీరోనే కాదని, ఏ విక్రమో, సూర్యనో చేస్తాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ సీక్వెల్ పార్ట్ గురించి ఏదీ అధికారికం కాదు. అన్నీ రూమర్లే. కాబట్టి భారతీయుడు 2 ఒక ఊహాజనితం మాత్రమేనేమో!