
'మీ..టూ..' ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే అంశం చుట్టూ చర్చ జరుగుతోంది. బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా, బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేశాక, ఈ 'మీ టూ' ఉద్యమానికి మరింత పబ్లిసిటీ వచ్చిందన్నది నిర్వివాదాంశం. వింటా నందా అనే రచయిత, నిర్మాత.. బాలీవుడ్ నటుడు అలోక్ నాథ్ తనపై అత్యాచారం చేశాడని ఆరోపించడంతో 'మీ టూ' వ్యవహారం మరింతగా హాట్ టాపిక్ అయ్యింది.
సౌత్‌లో, గాయని చిన్మయి 'మీ..టూ..' గురించి స్పందిస్తూ, తాను ఎదుర్కొన్న 'లైంగిక వేధింపుల' గురించి ప్రస్తావించే సరికి.. ఇక్కడా ఈ హీట్ బాగా పెరిగింది. తాజాగా, బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ 'మీ టూ'పై స్పందించింది.
'మీ టూ' పై మీ అభిప్రాయమేంటని అడిగితే, 'పని చేసే చోట లైంగిక వేధింపులు అత్యంత దురదృష్టకరం..' అంటూనే, లైంగిక వేధింపుల బాధితుల్లో మహిళలే కాదు, చిన్న పిల్లలూ.. ఆఖరికి మగవాళ్ళు కూడా వుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాంటి ప్రలోభాలకు గురికాకపోవడం, ధైర్యంగా నిలబడటం వల్ల లైంగిక వేధింపుల బారిన పడకుండా వుండొచ్చని అభిప్రాయపడింది అనసూయ.
తనకు తెలిసినంతవరకు టాలీవుడ్లో లైంగిక వేధింపుల ఘటనలు తక్కువేనని అనసూయ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, టాలీవుడ్లో లైంగిక వేధింపులకు సంబంధించి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు, ఆ సమయంలో జరిగిన రచ్చ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
మీడియా సంస్థల్లోనూ లైంగిక వేధింపులకు సంబంధించి 'మీ టూ..' అంటూ జర్నలిస్టులు గళమెత్తుతున్నారు. తెలుగు మీడియాలోనూ బాధితులున్నారన్న ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే ఏ అంశమ్మీద అయినా తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేసే అనసూయ.. ఈసారెందుకో కాస్త 'డిప్లమాటిక్'గా సమాధానం చెప్పింది.