cloudfront

Advertisement


Home > Movies - Movie News

ముదురు భామలు.. కుర్రాల్లతో రొమాన్స్‌!

ముదురు భామలు.. కుర్రాల్లతో రొమాన్స్‌!

హీరోయిన్ల భర్తల ఎంపిక ఎంత ప్రత్యేకంగా ఉంటుందో... వీళ్ల ఎంపికలో అంత సాపత్యం కూడా ఉంటుంది. ప్రత్యేకించి ఇండియాలో అయితే హీరోయిన్లను దేవతలుగా చూస్తారు జనాలు. రంగుపొంగు ఉండే భామలే హీరోయిన్లు అవుతారు కాబట్టి అందం హీరోయిన్ల సహజ సంపద. ఆపై తెరపై వీళ్ల అప్పీరియన్స్‌ జనాలను కట్టిపడేస్తుంది. వీటికితోడు హిట్టైన సినిమాల్లో నటిస్తే హీరోయిన్లు ఆటోమెటిక్‌గా దేవతలు అయిపోతారు.

తెరపై కనిపించే హీరోయిన్ల కన్నా పక్కింటమ్మాయిలే అందంగా ఉన్నా.. పక్కింటి అమ్మాయిలు ఎందుకూ కొరగాని వారిగా, హీరోయిన్లు మాత్రం దేవతలుగా మనదగ్గర చలామణి అయిపోతూ ఉంటారు. మరి ఇలాంటి దేవతలు భర్తలను ఎంపిక చేసుకునే వైనం మాత్రం చాలా చాలా విడ్డూరంగా ఉంటుంది. ఈ దేవతలను జనాలు ఎంతగొప్పగా ఊహించుకొంటూ ఉంటారో.. వీళ్లు ఎంపిక మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. అందమైన ఈ హీరోయిన్ల భర్తలు అందంగా ఉండటం, ఉండకపోవడం ఒక సంగతైతే.. వాళ్లు రెండో పెళ్లి కావడం మరోఎత్తు.

దేశంలో ప్రముఖ హీరోయిన్లందరూ రెండోపెళ్లి వ్యక్తినే పెళ్లాడిన దాఖలాలున్నాయి. మహానటి సావిత్రి నుంచి మొన్నటి విద్యాబాలన్‌ వరకూ ఎంతోమంది హీరోయిన్లు.. రెండో పెళ్లి వాడినే పెళ్లి చేసుకున్నారు. ఎందుకలా? అంటే సమాధానం లేదు. ఆల్రెడీ మొదటి భార్యను నిర్లక్ష్యం చేసి వీళ్లను పెళ్లాడే వాడు వీళ్లు ఎలా బాగా చూసుకుంటారని అనుకుంటారో కానీ.. దశాబ్దాలుగా అందాల దేవతలంతా రెండో పెళ్లి వాడికే ఫిదా అయిపోతూ ఉన్నారు.

ఇక ఈ దేవతలు భర్తల ఎంపికలో రెండో విచిత్రం వయసు. రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్లంతా తమకన్నా వయసులో పెద్దవాడినే చేసుకున్నారు. కొందరు చాలా పెద్దవాడిని చేసుకున్నారు. ఇక రెండో కేటగిరిలోని హీరోయిన్లు వయసులో తమ కన్నా చాలా చిన్నవాడిని చేసుకున్న వాళ్లు. తాజాగా ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ల ప్రేమాయణం, వీళ్లకు నిశ్చితార్థం కూడా జరిగిపోయిందనే వార్తల నేపథ్యంలో మరోమారు హీరోయిన్లు తమ భర్తలను ఎంపిక చేసుకుంటున్న వైనం చర్చకు వచ్చింది, ప్రియాంక చోప్రా కన్నా నిక్‌జోనస్‌ అనే ఆ అమెరికన్‌ కుర్రాడు తొమ్మిది పదేళ్లు చిన్నవాడు.

ఒకవైపు ఈ మధ్యకాలంలో హీరోయిన్లు విదేశీ ప్రియులను చూసుకోవడం ఎక్కువైంది. గత కొంత కాలంలోనే ఆరేడు మంది హీరోయిన్లు విదేశీయులను పెళ్లి చేసుకోవడం లేదా, విదేశీ ప్రియుళ్లతో కాలక్షేపం చేయడం జరుగుతోంది. ఈ పరంపరలో ప్రియాంక చోప్రా కూడా విదేశీ ప్రియుడిని పట్టింది. ఇలా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ను ఫాలో అవుతున్న ఈ హీరోయిన్‌.. మరోవైపు తన కన్నా చిన్నవాడిని మోహించి.. రెండో రకమైన ట్రెండును కూడా ఫాలో అవుతోంది. గత కొన్నేళ్లలో ఇలా చిన్నవాడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ల జాబితాను గమనిస్తే అది ఆసక్తిదాయకంగా ఉంది. అందులో దక్షిణాది జంటలు కూడా ఉన్నాయి.

నమ్రతా శిరోద్కర్‌ -మహేశ్‌ బాబు:
ఒకప్పటి మిస్‌ ఇండియా, ఆపై బాలీవుడ్‌ హీరోయిన్‌ నమ్రతా శిరోద్కర్‌. ప్రస్తుతం తెలుగింటి కోడలు. తెలుగు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు భార్య. కలిసి నటించడం ద్వారా దగ్గరైన ఈ జంట కొంతకాలంలోనే ప్రేమలో పడింది. ఆపై వివాహం చేసుకుని ఒక్కటయ్యింది. విశేషం ఏమింటే.. మహేశ్‌బాబు కన్నా నమ్రత వయసులో పెద్దది. దాదాపు నాలుగేళ్లు పెద్దది.

ప్రస్తుతం వీళ్ల వయసులను గమనిస్తే.. నమ్రత వయసు 46 కాగా, మహేశ్‌ బాబు వయసు 42 సంవత్సరాలు. వీరికన్నా ముందు చాలామంది సెలబ్రిటీలు ఇలా వయసు తక్కువైన భర్తలను పొందారు. ఆ పరంపరలో నమ్రత, మహేశ్‌ల పెళ్లి జరిగింది. క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ కూడా తన భార్య కన్నా నాలుగేళ్లు చిన్నవాడని చెప్పనక్కర్లేదు.

ఐశ్వర్య -ధనుష్‌:
రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య కూడా తనకన్నా చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడు కూడా హీరోనే, బాగా ఫేమస్‌ అయిన ధనుష్‌ అని చెప్పనక్కర్లేదు. ఐశ్వర్య కన్నా ధనుష్‌ దాదాపు రెండు సంవత్సరాల చిన్నవాడు. అప్పటికే నటుడిగా రుజువు చేసుకున్న ధనుష్‌కు తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు రజనీకాంత్‌.

ఐశ్వర్యరాయ్‌- అభిషేక్‌ బచ్చన్‌:
11యేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు ఐశ్వర్యరాయ్‌ అభిషేక్‌ బచ్చన్లు. అప్పట్లో ఈ పెళ్లి బాగా వార్తల్లో నిలిచిన అంశం. సల్మాన్‌ఖాన్‌, వివేక్‌ ఒబెరాయ్‌లతో ప్రేమాయణాన్ని సాగించి ఐష్‌ చివరకు వాళ్లిద్దరినీ వదిలించుకుని అమితాబ్‌ తనయుడిని పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లితో బచ్చన్‌ బ్రాండింగ్‌ పతాక స్థాయికి చేరింది. ఈ పెళ్లి సందర్భంలోనే చర్చకు వచ్చిన మరో అంశం ఐశ్వర్యరాయ్‌ పెద్దది అనేది. అభిషేక్‌ కన్నా రెండు సంవత్సరాలు పెద్దది ఐశ్వర్య.

శిల్పాషెట్టి- రాజ్‌కుంద్రా:
ఈ సాగరకన్య కూడా బాలీవుడ్‌ హీరోయిన్లు భర్త ఎంపికలో ఫాలో అయ్యే నియమాలను తప్పకుండా అనుసరించింది. అదెలాగంటే.. రాజ్‌ కుంద్రాకు అప్పటికే వివాహం అయ్యింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడతను. వ్యాపారవేత్తగా ఫేమస్‌ అయిన అతడిని శిల్పాషెట్టి పడేసింది. ఐపీఎల్‌ వ్యాపారంతో కుంద్రా అందరికీ పరిచయస్తుడే. శిల్పాషెట్టి కన్నా కుంద్రా వయసులో చిన్నవాడే. అయినా వీళ్ల పెళ్లికి వయసు ఆటంకం కాలేదు. ఈ జంట ఏకమైంది. ఎంచక్కా కాపురం చేసుకుంటోంది.

అమ్రితాసింగ్‌- సైఫ్‌ అలీఖాన్‌:
బహుశా చాలా వయసు తేడాతో పెళ్లి చేసుకున్న జంట ఇదే కాబోలు. అమ్రితా కన్నా సైఫ్‌ అలీఖాన్‌ 12 సంవత్సరాలు చిన్నవాడు. నవాబుల వంశంలో పుట్టిన హీరో ఇతడు. మతం, వయసులో తేడా వీళ్ల పెళ్లిని ఆపలేదు. పెళ్లి చేసుకున్నాకా.. తమ వయసులో తేడా అంతకాలం కాపురంచేశారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వీరి కూతురు ఇప్పుడు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. అనంతరం విడిపోయింది ఈ జంట. ఆ తర్వాత సైఫ్‌ తనకన్నా చాలా చిన్నదైన కరీనాను పెళ్లి చేసుకున్నాడు.

ఇలాంటి సెలబ్రిటీలు మరింత మంది ఉన్నారు. బాలీవుడ్‌ ప్రఖ్యాత నటి నర్గీస్‌దత్‌ తనకన్నా చిన్నవాడైన సునీల్‌ దత్‌ను పెళ్లిచేసుకుంది. వీళ్ల తనయుడే సంజయ్‌దత్‌. బాలీవుడ్‌ దర్శకురాలు, ఫేమస్‌ డ్యాన్స్‌ డైరెక్టర్‌ ఫరాఖాన్‌ భర్త కూడా ఆమెకన్నా చాలా చిన్నవాడే. బాలీవుడ్‌ దర్శకనటుడు ఫర్హాన్‌ అక్తర్‌ భార్య కూడా అతడి కన్నా పెద్దదే. ఈ జంట విడిపోయింది. ఇక టీమిండియా ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ శిఖర్‌ ధావన్‌ భార్య కూడా అతడికన్నా వయసులో పెద్దదే.

పై జాబితాను మరోరకంగా కూడా చూడవచ్చు. తమకన్నా వయసులో చిన్నవాడైన వ్యక్తిని భర్తగా చేసుకున్న జాబితాగానే కాకుండా, వయసు విషయంలో తమకన్నా పెద్దదైన మగువను పెళ్లి చేసుకున్న మగాళ్ల కోణం నుంచి కూడా పై జాబితాను చూడవచ్చు. అంతిమంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే. వయసులో స్త్రీ పెద్దదా, మగాడు పెద్దవాడా అనేఅంశం పాయింటేమీ కాదు, మగాడే పెద్దవాడు అయి ఉండాలనేది ఎప్పుడో శతాబ్దాల కాలంలో అప్పటి ఆయు:ప్రమాణాల లెక్కప్రకారం పెట్టుకున్న నియమం తప్ప మరేం కాదని అనుకోవాలి.

పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి పెళ్లిళ్ల పట్ల ఆశ్చర్యపోయే కాలం ఎప్పుడో దాటిపోయింది. మనదగ్గర మాత్రం ఇలాంటి పెళ్లిళ్లు సామాన్యులకు మరికొన్ని దశాబ్దాల పాటు కూడా కాస్త చోద్యంగానే అనిపించవచ్చు. సెలబ్రిటీలకు మాత్రం అలాంటి విచిత్రం లేదిక!