cloudfront

Advertisement


Home > Movies - Movie News

ముసలోళ్ల మల్టీస్టారర్ ఎవరు చూస్తారండి బాబు!

ముసలోళ్ల మల్టీస్టారర్ ఎవరు చూస్తారండి బాబు!

చిరంజీవి-బాలకృష్ణ కలిసి సినిమా చేస్తే అదిరిపోతుంది కదా. వెంకటేశ్-నాగార్జున కలిసి మల్టీస్టారర్ చేస్తే ఆ కిక్కే వేరు. అసలు చిరంజీవి, నాగ్, బాలయ్య కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది. మొన్నటివరకు చాలమంది సినీ అభిమానుల పగటి కలలు ఇలా ఉండేవి. వాళ్లు కలిసి సినిమా చేయరనే విషయం తెలిసినా కూడా, అభిమానుల్లో ఇదొక ఫాంటసీ. ఇలాంటి క్రేజీ మల్టీస్టారర్లపై నాగార్జున స్పందించాడు. 

ప్రేక్షకులంతా క్రేజీ అనుకుంటున్న ఈ కాంబినేషన్లను కూరలో కరివేపాకులా తీసి పడేశాడు నాగ్. ఈ వయసులో తామంతా కలిసి సినిమా చేస్తే ఏముంటుంది కిక్ అని రివర్స్ లో ప్రశ్నించాడు. అక్కడితో ఆగకుండా, "ముసలోళ్లంతా కలిసి మల్టీస్టారర్ చేస్తే ఎవరు చూస్తారండి బాబు" అంటూ తమ జనరేషన్ హీరోల మీద తానే జోకులేశాడు. 

ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా తను, వెంకీ కలిసి ఓ సినిమా చేయడం సమస్యకాదని, కానీ అలాచేస్తే ప్రేక్షకులే ముసలివాళ్లంతా కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారని విమర్శిస్తారని చెప్పుకొచ్చాడు. ఇది కూడా నిజమే. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. 90ల్లోనే, హవా నడుస్తున్న టైమ్ లో ఈ సీనియర్లలో ఒకరిద్దరు కలిసి మల్టీస్టారర్లు చేస్తే బాగుండేది. ఇప్పుడు చేసినా ప్రయోజనం ఉండదు. 

అందుకే తామంతా ఇప్పుడు యంగ్ హీరోస్ తో మల్టీస్టారర్లు చేస్తున్నామంటున్నాడు నాగార్జున. ఓవైపు మల్టీస్టారర్ మూవీస్ లో నటిస్తూనే, మరోవైపు సోలోగా కూడా సినిమాలు చేస్తానంటున్నాడు నాగ్. తన కోసం ఓవైపు కల్యాణ్ కృష్ణ, మరోవైపు రాహుల్ రవీంద్రన్ రెండు స్టోరీలు రెడీ చేస్తున్నారని, వీటిలో ఏది ముందు రెడీ అయితే అందులో నటిస్తానని తెలిపాడు. తన సొంత బ్యానర్ పైనే సినిమా ఉంటుందని స్పష్టం చేశాడు నాగ్.