Advertisement


Home > Movies - Movie News
బాబుపై పవన్ ట్వీట్లు: వెన్నుపోటు 1-2-3

కొన్ని రోజులుగా టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న రచ్చపై ఎట్టకేలకు స్పందించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ఈ మొత్తం వ్యవహారంలో పావులను పవన్ ఏం అనలేదు. కనీసం వాళ్ల ప్రస్తావన కూడా తీసుకురాలేదు. దీనికి మూల కారకులైన చంద్రబాబు, అతడి అనుకూల మీడియాపై నేరుగా విరుచుకుపడ్డారు. వెన్నుపోటు-1, వెన్నుపోటు-2, వెన్నుపోటు-3 అంటూ పవన్ పెట్టిన ట్వీట్స్ సరికొత్త దుమారానికి తెరతీశాయి.

వెన్నుపోటు-1
"రాష్ట్ర మేలు కోసం ఏమీ ఆశించకుండా తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం. కానీ మీ అబ్బాయి (లోకేష్), అతని స్నేహితులు వెనకమూలగా మీ మీడియా శక్తుల ద్వారా చేయూతనిచ్చిన మమ్మల్ని చంపివేస్తుంటారు. మిమ్మల్ని నమ్మడం ఎలా?"

వెన్నుపోటు-2
"గత 6 నెలలుగా మీ మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా నాపై, నా కుటుంబంపై నిరవధిక మీడియా అత్యాచారం జరిపిస్తున్నారు. 10కోట్ల డబ్బు ఖర్చుపెట్టి మరీ నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి, నా తల్లిని తిట్టించి వాటిని పదేపదే ప్రసారం చేసి వాటిపై డిబేట్లు చేయిస్తున్నారు."

వెన్నుపోటు-3
"వర్మ అనే ఒక దర్శకుడు, శ్రీసిటీ ఓనర్ (tv9 ఓవర్) శ్రీనిరాజు (10 కోట్లు డబ్బు ఇచ్చిన వ్యక్తి), టీవీ9 రవిప్రకాష్.. వీరి ముగ్గురి ద్వారా మీ అబ్బాయి లోకేష్, అతని స్నేహితుడు రాజేష్ కలిసి కొన్ని రోజులుగా చేస్తున్నది మీకు (చంద్రబాబు) తెలియదంటే నమ్మగలమా..?"

ఇలా చంద్రబాబుపై ఓ రేంజ్ లో విమర్శలు చేశారు పవన్. తనను అప్రతిష్టపాలు చేసేందుకు 10కోట్ల రూపాయలతో లోకేష్ పథకం రచించాడని ఆరోపించారు. ఇదే సందర్భంగా మీడియాను సూటిగా కొన్ని ప్రశ్నలడిగారు పవన్ కళ్యాణ్.

1. ఇన్నాళ్లు నాపై చేసిన రచ్చను మీరు నేరుగా చంద్రబాబు, లోకేష్ పై చేయగలరా?
2. నాపై ప్రసారం చేసిన తిట్లను ప్రతిపక్ష నాయకుడిపై ప్రసారం చేయగలరా?
3. నాపై చేసిన ఇలాంటి ప్రయత్నాన్ని ఎప్పుడైనా బాలకృష్ణపై ప్రయత్నించారా?

కేవలం తను, తన తల్లి మాత్రమే ఈ తిట్లకు, అనుచిత వ్యాఖ్యలకు బలయ్యామని బాధపడ్డారు పవన్ కల్యాణ్. "మై డియర్ రిచ్ అండ్ పవర్ ఫుల్ మీడియా" నాకు, నా తల్లికి మాత్రమే ఎందుకు ఇంత ప్రత్యేకమైన ఎక్స్ క్లూజివ్ ట్రీట్ మెంట్ ఇచ్చారో చెప్పాలంటూ నిలదీశారు పవన్.