cloudfront

Advertisement


Home > Movies - Movie News

పూజాహెగ్డే తొలి సంపాదన ఎంతో తెలుసా?

పూజాహెగ్డే తొలి సంపాదన ఎంతో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపుతున్న హాట్ హీరోయిన్ పూజా హెగ్డే తన కెరీర్ తొలినాళ్ల నాటి సంగతుల్ని గుర్తుచేసుకుంది. బాగా సిగ్గుపడే స్టేజ్ నుంచి బికినీ వేసుకునే స్టేజ్ కు ఎదిగిన క్రమంతో పాటు.. తొలి సంపాదన గురించి చెప్పుకొచ్చింది.

"నా స్కూల్ డేస్ కాలంలో మొదటి సంపాదన వచ్చింది. అప్పట్లో నాకు కాలీగ్రఫీ (చేతి వ్రాత)లో కాస్త ప్రవేశం ఉండేది. ఏదైనా చాలా అందంగా రాసేదాన్ని. మా తాతగారు కోరడంతో ముంబయి అథ్లెటిక్ అసోసియేషన్ లో పాల్గొన్న విద్యార్థుల పేర్లను అందంగా రాశాను. అప్పుడు నాకు 200 రూపాయలిచ్చారు. అదే నా తొలి సంపాదన. ఆరోజు జాక్ పాట్ కొట్టినట్టు ఫీల్ అయ్యాను."

అలా తొలి సంపాదన విశేషాల్ని చెప్పుకొచ్చిన పూజా హెగ్డే.. తన మోడలింగ్, సినీరంగ ప్రవేశం చాలా విచిత్రంగా జరిగిందని తెలిపింది. విపరీతంగా సిగ్గుపడే తను ఇప్పుడు ఏకంగా కెమెరా ముందు నటిస్తున్నానని అంటోంది.

"నాకు సిగ్గు చాలా ఎక్కువ. దాన్ని పోగొట్టుకోవడం కోసం పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనాలని నిర్ణయించాను. ప్రతి ఈవెంట్ లో పాల్గొనేదాన్ని. నా కాలేజ్ డేస్ లో 2009లో ఓసారి మాధురీ దీక్షిత్ పాటకు డాన్స్ చేస్తున్నాను. సడెన్ గా స్టేజ్ పై బిగుసుకుపోయాను. వేసిన స్టెప్పునే మళ్లీ మళ్లీ 4 నిమిషాల పాటు వేశాను. చాలా సిగ్గేసింది. కానీ అక్కడే మిస్ ఇండియా టాలెంట్ హంట్ కు ఎంపికయ్యాను."

వచ్చిన ప్రతి అవకాశాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవడం వల్లనే సక్సెస్ అయ్యానంటోంది పూజా. కాలేజ్ డేస్ లో తను అస్సలు అందంగా కనిపించేదాన్ని కాదని, పొట్టి హెయిర్ కట్ తో లిప్ స్టిక్ కు కూడా దూరంగా ఉండేదాన్నని, అయినప్పటికీ నమ్మకంతో అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా టాలెంటెడ్ గా నిలిచానని చెప్పుకొచ్చింది. ఆ మరుసటి ఏడాది ఏకంగా 2010 మిస్ యూనివర్స్ పోటీల్లో సెకెండ్ రన్నరప్ గా నిలిచానని, తన ఆత్మవిశ్వాసానికి అదే పెద్ద అవార్డ్ అంటోంది.

"మిస్ యూనివర్స్ పోటీల తర్వాత వరుసగా యాడ్ అవకాశాలు వచ్చాయి. రోజుకు 3వేలు సంపాదించాను. తర్వాత 5వేలు సంపాదించాను. ఆ తర్వాత అది 10వేలకు చేరింది. ఆ తర్వాత ఫ్రెండ్ చెప్పడంతో సౌత్ సినిమాలకు ట్రై చేశాను. తమిళ సినిమా మూగమూడిలో అవకాశం వచ్చింది. కానీ నాకు నటించడం రాదు. అందరూ యాక్టింగ్ నేర్చుకోవడానికి డబ్బు కడతారు. కానీ నాకు యాక్టింగ్ నేర్పించి మరీ డబ్బు ఇస్తారని అమ్మ చెప్పడంతో ఆ సినిమా ఒప్పుకున్నాను."

రణబీర్ కపూర్ తో చేసిన యాడ్ తన జీవితాన్ని మార్చిందని అంటోంది పూజా హెగ్డే. ఆ వాణిజ్య ప్రకటన వల్లే హృతిక్ సరసన మహోంజదారో సినిమా చేసే అవకాశం వచ్చిందని, ఇక అప్పట్నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదంటోంది ఈ బ్యూటీ. అలా 200 రూపాయల సంపాదన నుంచి కోటి రూపాయల రెమ్యూనరేషన్ కు ఎదిగింది పూజా హెగ్డే.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి