cloudfront

Advertisement


Home > Movies - Movie News

అమ్మకానికి వారసత్యం.. ఆర్కే స్టూడియోస్

అమ్మకానికి వారసత్యం.. ఆర్కే స్టూడియోస్

అన్నపూర్ణ స్టూడియోస్ ను నాగార్జున అమ్మేస్తే ఎలా ఉంటుంది. రామానాయుడు స్టూడియోస్ ను సురేష్ బాబు అమ్మకానికి పెడితే ఎలా ఉంటుంది. వినడానికి కాస్త ఇబ్బందిగా, బాధగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే అవి కేవలం స్టూడియోస్ మాత్రమే కాదు, సినీ వారసత్వ సంపద కూడా. ఇప్పుడు అంతకంటే పెద్ద వారసత్యం ఒకటి అమ్మకానికి సిద్ధమైంది. దాని పేరు ఆర్కే స్టూడియోస్. 

ఇండియన్ ఫిలిం లెజెండ్ రాజ్ కపూర్, 1948లో నెలకొల్పిన స్టూడియో అది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారదేశంలో రూపుదిద్దుకున్న మొట్టమొదటి ఫిలిం స్టూడియో అది. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు రూపుదిద్దుకున్న ఆ స్టుడియోను అమ్మేయాలని నిర్ణయించింది కపూర్ కుటుంబం. 

నష్టాల్లో కొనసాగుతున్న ఆర్కే స్టూడియోస్ ను ఇక ఎంతమాత్రం కొనసాగించలేమని, రాజ్ కపూర్ తనయుడు రిషీ కపూర్ ప్రకటించారు. మంచి డీల్ వస్తే స్టూడియోను అమ్మేస్తామని ప్రకటించారాయన. ఈ ప్రకటన కేవలం రిషీ కపూర్ ది మాత్రమే కాదు. రాజ్ కపూర్ కొడుకులు, కుమార్తెలు అంతా కలిసి మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గతేడాది సెప్టెంబర్ లో అగ్నిప్రమాదానికి గురైంది ఆర్కే స్టూడియో. ఆ ప్రమాదంలో స్టూడియో దెబ్బతినడంతో పాటు రాజ్ కపూర్ కు చెందిన ఎన్నో జ్ఞాపకాలు బూడిదయ్యాయి. ఆ వెంటనే కపూర్ ఫ్యామిలీ స్టూడియోను పునరుద్ధరించింది. డబ్బులైతే బాగానే ఖర్చుపెట్టారు కానీ, ప్రస్తుతం స్టూడియో నష్టాల్లో ఉంది. అగ్నిప్రమాదం తర్వాత ఈ నష్టాలు మరింత ఎక్కువయ్యాయని రిషీ కపూర్ ప్రకటించారు. ఇకపై స్టూడియోను కొనసాగించడం తమవల్ల కాదని ప్రకటించారాయన. 

ఆసియాలోనే అతిపెద్ద షూటింగ్ ఫ్లోర్ ఆర్కే స్టూడియోస్ లో ఉంది. ఇదే ఫ్లోర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మితమయ్యాయి. జిస్ దేశ్ మే గంగ బెహ్ తీ హే, మేరా నామ్ జోకర్, బాబి, సత్యం శివం సుందరం, రామ్ తేరీ గంగా మైలీ లాంటి ఎన్నో ఆణిముత్యాలు ఈ స్టుడియోలో నిర్మితమయ్యాయి. 

రాజ్ కపూర్ రోజుల్లో ఈ స్టూడియో ఓ వెలుగు వెలిగింది. రిషీ కపూర్ హీరోగా కొనసాగిన టైమ్ లో కూడా ఆర్కే స్టూడియోస్ కు తిరుగులేదు. కాలక్రమేణ స్టూడియోలో నిర్మాణాలు తగ్గిపోయాయి. దీనికి తోడు గతేడాది జరిగిన అగ్నిప్రమాదం నష్టాల్ని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో తండ్రి వారసత్వాన్నే కాదు, భారతీయ సినీ సంస్కృతికి చెందిన ఓ గొప్ప ఆనవాలును వదులుకోవడానికి కపూర్ కుటుంబం సిద్ధమైంది.