cloudfront

Advertisement


Home > Movies - Movie News

కొందరు చేసిన కుట్రలకు నేను బలైపోయాను

కొందరు చేసిన కుట్రలకు నేను బలైపోయాను

మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారు శివాజీరాజా. తన ఓటమికి కారణాలతో పాటు తాజాగా తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పారు. నిజాయితీగా ఇన్నేళ్లు పనిచేసినందుకు తనకు మంచి బహుమానం ఇచ్చారంటున్న శివాజీరాజా.. కేవలం కొంతమంది కుట్రల కారణంగా తను ఓడిపోయినట్టు తెలిపాడు.

"ఓల్డేజ్ హోమ్ అనే కార్యక్రమం అనుకున్నాను. దాని మీద నీళ్లు చల్లేశారు. నేను ఓడిపోవడానికి కారణం కూడా ఓల్డేజ్ హోమ్. ఎందుకంటే, ఎవరూ లేని వ్యక్తి భీమవరం నుంచి సంచేసుకొని ఇక్కడికొచ్చి, అధ్యక్షుడై ఒక్కడే ఓల్డేజ్ హోమ్ కట్టేస్తే పేరంతా నాకే వచ్చేస్తుందని కొందరు కుట్ర చేశారు. ఆ కుట్రలో నేను బలైపోయాను."

అసోయేషన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా పదవి పట్టుకొని వేళాడుతున్నానంటూ తనపై నరేష్ వర్గం చేస్తున్న ఆరోపణల్ని శివాజీ ఖండించారు. అసోసియేషన్ రూపొందించిన రూల్స్ ప్రకారమే తను నడుచుకుంటున్నానని, నరేష్ కు ఆ రూల్స్ కూడా చదివే ఓపిక లేదన్నారు.

"నేనేదో పదవులు పట్టుకొని వేలాడుతున్నానని అంటున్నారు. నేను రూల్స్ ప్రకారం నడుచుకుంటున్నాను. ఏప్రిల్ వరకు పాత కమిటీనే ఉండాలి, కొత్తగా ఎన్నికైన కమిటీ ఏప్రిల్ లో అధికారం తీసుకోవాలని మా అసోసియేషన్ బై-లాస్ లో ఉంది. అది కూడా చదివే ఓపిక వాళ్లకులేదు. జీవిత అంటే ఫస్ట్ టైం. సెక్రటరీగా మీకు (నరేష్) అనుభవం ఉంది కదా. మీక్కూడా తెలియదా."

గతంలో తను అధ్యక్షుడిగా గెలిచినప్పుడు.. బై-లాస్ ప్రకారం 25 రోజులాగి ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ప్రమాణ స్వీకారం చేసుకున్నానని, కానీ ఇప్పుడు నరేష్ కు ఆమాత్రం ఓపిక కూడా లేదన్నారు శివాజీరాజా. ఇక జీవిత ఆరోపణలపై స్పందిస్తూ, చెక్కులపై ఎవరు సంతకాలు పెడతారో కూడా తెలియని ఆమె అమాయకత్వంపై స్పందించలేనన్నారు.

"అమెరికాలో కార్యక్రమం నా వల్లే ఆగిపోయిందని, బిజినెస్ క్లాస్ ప్రయాణం అంటూ నరేష్ ఏదేదో మాట్లాడుతున్నాడు. గతంలో తమిళ ఆర్టిస్టులు ఓ కార్యక్రమం పెట్టి మాకు అహ్వానం అందించారు. మేమంతా బిజినెస్ క్లాస్ లోనే వెళ్లాం. మలేషియాలో మేం చిన్నగదిలో ఉంటే, నరేష్ సూట్ రూమ్ తీసుకున్నాడు. తప్పతాగి ఆ తర్వాతి రోజు ఫ్లయిట్ కూడా మిస్ అయ్యాడు. మళ్లీ మరో టిక్కెట్ వేయించుకున్నాడు. ఇవి అసోసియేషన్ డబ్బులు కావా".

మా అసోసియేషన్ డైరీ కోసం 14 లక్షల 20వేల రూపాయలు పోగుచేశానని చెప్పుకుంటున్న నరేశ్, అకౌంట్స్ లో మాత్రం కేవలం 7 లక్షలు మాత్రమే చూపించాడని.. ఆ లెక్కలు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుందన్నాడు శివాజీరాజా. ఇక ఆఖరి నిమిషంలో నరేష్ కు మద్దతు పలికిన నాగబాబుపై స్పందిస్తూ.. నాగబాబు తనను ఓడించి మంచి గిఫ్ట్ ఇచ్చాడని, తను కూడా త్వరలోనే నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని స్పష్టంచేశాడు శివాజీరాజా.

చంద్రబాబు నిర్ణయాల పలితం-శక్తిమంతంగా KCR 

యాత్ర సినిమా సగటు విజయం ఏం చెప్తోంది?