cloudfront

Advertisement


Home > Movies - Movie News

నాకు అదే వరం.. అదే శాపం: శ్రీనువైట్ల

నాకు అదే వరం.. అదే శాపం: శ్రీనువైట్ల

వరుస డిజాస్టర్ల తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు శ్రీనువైట్ల. ఈ సినిమాతో ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదని, తన మార్క్ కామెడీ కచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులకు భరోసా ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన ట్రేడ్ మార్క్ పై స్పందించాడు ఈ దర్శకుడు. సినిమాల్లో తన మార్క్ కామెడీ పెట్టడం ఒక్కోసారి తనకు వరంగా, మరోసారి శాపంగా మారుతోందని చెప్పుకొచ్చాడు.

"కొంతమంది దర్శకులకు ఓ బ్రాండ్ వస్తుంది. అది వరం, అదే శాపం కూడా. కొత్తకథలు ఏం చేస్తున్నామనే విషయాన్ని పక్కనపెడితే, ఆ కథలో నా మార్క్ మిస్ అవ్వకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పడం చాలా కష్టమైపోతోంది. కథలో కావాలని కామెడీ పెట్టాడు అనే విమర్శ రాకూడదు. కానీ అది నా బాధ్యత. ఈసారి కూడా అమర్ అక్బర్ ఆంటోనీతో ఓ కొత్తకథను చెబుతూనే, ఎంటర్ టైనింగ్ గా చూపించాం."

తన గత చిత్రాల్లో కామెడీ మిస్ అయిందనే విషయాన్ని వైట్ల ఒప్పుకున్నాడు. తన మార్క్ కామెడీ రొటీన్ అయిపోయిందనే భావనతో కామెడీని మిస్ చేశానని, కానీ అదే తనబలం, అదే తనకు వరంకావడంతో ఇప్పుడు మరోసారి అదే ఫార్మాట్ లో వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు.

"నా గత చిత్రాల్లో నా మార్క్ కామెడీ మిస్ అయిందని నేను కూడా ఫీల్ అయ్యాను. వింటేజ్ శ్రీనువైట్ల కావాలంటూ చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. అంటే ఒకప్పటి శ్రీనువైట్ల అని అర్థం. ఈమధ్య వచ్చిన 3 సినిమాల శ్రీనువైట్ల మాకొద్దు అంటున్నారు. ఈసారి విపరీతంగా నవ్విస్తాం, మీరు చూస్తారు".

కోన వెంకట్ తో కలిసి పనిచేసే ఉద్దేశం లేదని మరోసారి పరోక్షంగా ప్రస్తావించాడు శ్రీనువైట్ల. కొత్త రచయితలతో ట్రావెల్ చేస్తున్నానని, అమర్-అక్బర్-ఆంటోనీకి అంతా కొత్త వాళ్లు వర్క్ చేశారని తెలిపాడు. ఇకపై కూడా కొత్త రచయితలతో పనిచేస్తానని అంటున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది అమర్ అక్బర్ ఆంటోనీ.

టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్‌!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్