Advertisement


Home > Movies - Movie News
తేజకు ఏమైంది: మొన్న వెంకీ.. ఇప్పుడు బాలయ్య!

మొన్నటికి మొన్న వెంకటేష్ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చాడు
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ కూడా చేయడం లేదని ప్రకటించాడు

చూస్తుంటే దర్శకుడు తేజ స్టార్ డమ్ హ్యాండిల్ చేయలేడేమో అనిపిస్తోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో బౌన్స్ బ్యాక్ అయిన ఈ దర్శకుడు వెంటవెంటనే అవకాశాలు అందుకున్నాడు. ఎన్నడూ లేని విధంగా వెంకటేశ్, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమా ఛాన్సులు కొట్టేశాడు. దీంతో తేజ కెరీర్ ఊపందుకుందని అంతా భావించారు. కానీ నాటకీయ పరిణామాల మధ్య ఈ రెండు సినిమాలూ వదులుకున్నాడు తేజ.

వెంకీ-తేజ సినిమా ఆల్ మోస్ట్ అంతా ఓకే. ప్రీ-ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది. రేపోమాపో సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం. చివరికి వెంకీపై టెస్ట్ కట్ కూడా జరిగిపోయింది. అలాంటి ప్రాజెక్టు కూడా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ ప్రాజెక్టుతో ఇక తనకు ఏమాత్రం సంబంధం లేదని ప్రకటించాడు తేజ. దీనికి కారణం తేజ-వెంకీ మధ్య సయోధ్య కుదరకపోవడమే. ఒక దశలో.. 'ఈ ప్రాజెక్టును మీరు హ్యాండిల్ చేయగలరా' అని నేరుగానే తేజను వెంకటేష్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీంతో ఆ సినిమా ఆగిపోయింది. మధ్యవర్తిత్వాలు కూడా నడవలేదు.

ఇప్పుడు దాదాపు అలాంటి కారణాలతోనే ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఆగిపోయింది. బాలయ్య అన్నీ చకచకా జరగాలంటారు. క్వాలిటీ అవుట్ పుట్ కోసం టైం కావాలంటాడు తేజ. దీంతో పాటు స్క్రిప్ట్ లో బాలయ్య సూచించిన మార్పులు తేజకు నచ్చలేదు. "నేను చెప్పినట్టు ముందుకెళ్దాం.. మీరు అలా పర్యవేక్షించండి చాలు.. నేను చూసుకుంటా" అని బాలయ్య అనడంతో తేజకు నచ్చలేదు. ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది.

తన కెరీర్ లో తేజ ఎక్కువగా కొత్త హీరోలు, నూతన నటీనటులతోనే సినిమాలు చేశాడు. దీని వెనక ఓ కారణం కూడా ఉంది. కెమెరామెన్ గా పనిచేస్తున్న టైమ్ తో పాటు.. దర్శకుడిగా మారిన కొత్తలో స్టార్ హీరోల నుంచి అతడికి ఎదురైన అనుభవాల దృష్ట్యా తేజ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో కూడా ఇలానే 2-3 పెద్ద ప్రాజెక్టులు అతడి చేజారిపోయాయి. దీంతో పెద్ద సినిమాలకు, పెద్ద హీరోలకు దూరంగా ఉంటూ వచ్చాడు. తన కథలకు, తన మైండ్ సెట్ కు స్టార్ డమ్ అస్సలు సూట్ కాదని పలు సందర్భాల్లో స్వయంగా తేజ చెప్పుకొచ్చాడు.

ఇవన్నీ చూస్తుంటే స్టార్ డమ్ ను తేజ హ్యాండిల్ చేయలేడేమో అనిపించడం సహజం. కానీ ఇక్కడ సమస్య ఇది కాదు. తన సినిమాల్లో హీరోయిజాన్ని పీక్స్ లో చూపించిన సందర్భాలు తేజ కెరీర్ లో కోకొల్లలు. మాస్ డైలాగ్స్ పెట్టాడు. ఆడియన్స్ తో విజిల్స్ వేయించేలా సీన్లు తీశాడు. కానీ ఇవన్నీ తను అనుకున్నట్టు మాత్రమే జరగాలని కోరుకోవడంతోనే వచ్చింది సమస్య. రెండో వ్యక్తి ప్రమేయాన్ని సహించలేడు. అది స్టార్ హీరో అయినా కూడా.

కుర్రహీరోలతో సినిమాలు చేయడం వేరు, పెద్ద స్టార్స్ తో వ్యవహారం వేరు. మనసులో అనుకున్న విషయాన్ని సదరు హీరోకు అర్థమైనట్టు చెప్పడం, ఒప్పించడంలో చాలా చాకచక్యం దాగుంది. ఈ విషయంలో తేజ వీక్. తను చెప్పినట్టే జరగాలంటాడు. ఏమైనా ఉంటే సెట్స్ లో చూసుకుందాం అంటాడు. కానీ పెద్ద హీరోల విషయంలో అలా జరగదు కదా. అందుకే స్టార్ హీరోలతో అతడు సినిమాలు చేయలేడు. ఇది అతడి తప్పు కాదు, అతడి యాటిట్యూడ్.