cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ట్రెండ్ మార్చిన ‘అభిమాన పైత్యం’.!

ట్రెండ్ మార్చిన ‘అభిమాన పైత్యం’.!

బుడ్డోడు మనోడు కాదురా.. ఆ సినిమాని తొక్కేయండి..  వాట్సాప్‌లో సంచరిస్తోన్న మెసేజ్ ఇది

మా ‘స్టార్’నే పక్కన పెడ్తారా.? ఆ సినిమాపై దుష్ర్పచారం స్టార్ట్ చేసెయ్యండి.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది

తెలుగు సినీ రంగంలో నందమూరి కుటుంబం, మెగా కుటుంబం ఇప్పుడు పోటీ పడ్తున్నాయి.. హిట్ సినిమాలతో కాదు.. అభిమానుల మధ్య అంతర్గత కుమ్ములాటలతో. నందమూరి హీరోల సినిమాలకి నందమూరి అభిమానులే విలన్లుగా మారిపోతున్నారు. సేమ్ టు సేమ్ మెగా హీరోల సినిమాలకి మెగా అభిమానులే విలన్లయిపోతున్నారు. చిత్రమైన పరిస్థితి ఇది. ‘మేమంతా ఒక్కటే..’ అని ఒక్కోసారి ఆయా హీరోలు అభిమానులకు సంకేతాలిస్తున్నా, పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. ఈ కొత్త ట్రెండ్.. అభిమాన పైత్యం.. అభిమానుల మధ్య వైరం.. తెలుగు సినీ పరిశ్రమకు కీడు చేస్తోంది.

మా పవన్‌కళ్యాణ్ ఎక్కడ.?

‘మా పవన్‌కళ్యాణ్ ఎక్కడ.?’ అంటూ చిరంజీవిని అభిమానులు ఇబ్బంది పెట్టిన సందర్భాలెన్నో వున్నాయి. చరణ్ సినిమా ఫంక్షన్లలోనూ, మెగా ఫ్యామిలీకి చెందిన ఇతర హీరోల సినిమా ఫంక్షన్లలోనూ పవన్ ఫ్యాన్స్ పేరుతో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు. మొదట్లో చిరంజీవినీ, ఆ తర్వాత చరణ్‌నీ.. ఇబ్బంది పెట్టిన పవన్ ‘వెర్రి’ ఫ్యాన్స్.. మొన్నీమధ్యనే వరుణ్‌తేజ ‘లోఫర్’ సినిమా ఫంక్షన్‌లో ఏకంగా ప్రభాస్‌ని ఇరకాటంలో పడేశారు. ప్రభాస్ అభిమానులకీ, పవన్‌కళ్యాణ్ అభిమానులకీ భీమవరంలో ఆ మధ్య పెద్ద రగడే జరిగింది. దానికి కొనసాగింపుగా ‘లోఫర్’ ఆడియో విడుదల వేడుకలో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుని వుండొచ్చేమో అన్నది పరిస్థితుల్ని పరిశీలిస్తున్న సగటు సినీ జీవుల వాదన. అయితే, పవన్ అభిమానుల పేరుతో సినిమా ఫంక్షన్లలో అల్లరి చేయడం అనేది పరమ రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. ‘అది బాబాయ్ మీద అభిమానం మాత్రమే.. ఎప్పుడోగానీ బాబాయ్ అభిమానులకు కన్పించరు.. అందుకే బాబాయ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో మీదున్న అభిమానాన్ని కొంచెం ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు..’ అని వరుణ్ కవరింగ్ ఇచ్చాడు.

అభిమాన పైత్యం అంటే ఇదే మరి.!

వాస్తవానికి ఇది ‘అభిమాన పైత్యం’లోని కొత్త కోణం. ఒకప్పుడు చిరంజీవి అభిమానులకీ, బాలకృష్ణ అభిమానులకీ.. ఆ మాటకొస్తే ఆయా హీరోలకి వున్న అభిమానులు, ఇతర హీరోలపైనా, వారి సినిమాలపైనా బురదజల్లే ప్రయత్నం చేసేవారు. పెద్ద విజయాల్నీ చిన్న విజయాలుగా చూపేందుకు ప్రయత్నించేవారు. అలా అభిమానుల మధ్య విపరీతమైన ‘వార్’ జరిగేది. ఇప్పటిలా అప్పుడు సామాజిక మాధ్యమాల్లేవు. అందుకే థియేటర్ల వద్ద ఈ హంగామా కన్పించేది. ఎప్పుడన్నా వీలు కుదిరితే, తమ అభిమాన హీరో ఇమేజ్‌కి ఇంకెవరూ సాటిరారంటూ పత్రికలు, ఛానళ్ళలో హడావిడి చేసేవారు. ఇప్పుడేమో ట్రెండ్ మారింది. అభిమాన పైత్యం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలొచ్చారు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోల సంగతి సరే సరి. మెగా ఫ్యాన్స్ అంటే మొత్తంగా మెగా హీరోలందరికీ అభిమానులు.. నందమూరి ఫ్యాన్స్ అంటే మొత్తంగా నందమూరి హీరోల అభిమానులు.. అన్న ట్రెండ్ మారి.. హీరోలవారీగా అభిమానులు విడిపోయారు. అభిమానుల్లోనే కుంపట్లు రగిలాయి. దాంతో, పోటీ ఒకే కుటుంబంలోని ఇద్దరు హీరోల మధ్య.. అన్నట్టుగా తయారైంది. 

సినీ అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన రాజకీయం

పవన్‌కళ్యాణ్ కొత్త రాజకీయ పార్టీ పెట్టాక.. ఆయన అభిమానులు టీడీపీని సపోర్ట్ చేశారు. చిరంజీవి అభిమానులు కాంగ్రెస్‌తోనే వుండిపోవాలనుకున్నారు. అలా రాజకీయం మెగా ఫ్యామిలీలో చిచ్చుపెట్టింది. ఆ చిచ్చు అలా కంటిన్యూ అవుతోంది. ‘మేమంతా ఒకటే కుటుంబం.. అన్నయ్య నాకు దేవుడు.. తండ్రి తర్వాత తండ్రి..’ అని పవన్ చెప్పినా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. ‘టీడీపీకి నేనెప్పుడూ దగ్గరగానే వుంటాను మొర్రో..’ అని ఎన్టీఆర్ చెబుతున్నా, అతన్ని నందమూరి అభిమానులు పక్కన పడేస్తున్నారు. కొడాలి నాని వ్యవహారంతోనే ఎన్టీఆర్‌ని టీడీపీ శ్రేణులు దూరం పెట్టేశాయి. ఆ తర్వాత ఒకటీ అరా సందర్భాల్లో బాబాయ్ భజన చేసి, ఎలాగోలా మేనేజ్ చేయగలిగిన ఎన్టీఆర్, ఇప్పుడు రూట్ మార్చాడు. బాబాయ్ భజన ఎప్పుడైతే ఎన్టీఆర్ మానేశాడో.. నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు పూర్తిగా అతన్ని పక్కన పడేశాయి. అది అతని సినిమాలపైనా తీవ్రంగానే ప్రభావం చూపిస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకైతే పూర్తిగా ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ తయారైపోయారు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ చుట్టూ నందమూరి అభిమానులు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సంక్రాంతికి ఎన్టీఆర్, బాలకృష్ణతో తలపడ్తుండడమే ఇందుకు కారణం.

ఈ పైత్యం తెలుగు సినిమాకే నష్టం

సగటు సినిమా అభిమాని మాత్రం.. ఈ సరికొత్త ‘అభిమాన పైత్యం’ చూసి ఆశ్చర్యపోతున్నాడు. సినీ పరిశ్రమలోనూ ఈ విషయమై చర్చ తీవ్రంగానే జరుగుతోంది. ప్రధానంగా నిర్మాతలు ఇక్కడ అడ్డంగా బుక్కయిపోతోంటే, అదే దిశగా దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా బిక్కమొహం వేయాల్సి వస్తోంది. ఓ కుటుంబం నుంచి ఎక్కువమంది హీరోలొస్తే, గంపగుత్తగా అ కుటుంబ అభిమానులు తమ సినిమాకి రాజపోషకులుగా మారతారని నిన్న మొన్నటిదాకా భావించిన నిర్మాతలు, ఇప్పుడీ సినీ కుటుంబాల మధ్య వివాదాలతో తమ సినిమాలు నాశనమైపోతున్నాయని ఆందోళన చెందడాన్ని ఎలా తప్పు పట్టగలం.? ఒకప్పుడే నయ్యం.. ఓ సినిమా మీద కసితో ఇంకో సినిమాని అభిమానులు లేపేసేవారు. ఇప్పుడలా కాదు. వీళ్ళు ఆ సినిమాని, వాళ్ళు ఈ సినిమానీ తొక్కేయడమ్మీద దృష్టిపెట్టారు. అంతిమంగా తెలుగు సినిమా పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. ప్రముఖ హీరోలు, ప్రముఖ సినీ కుటుంబాలు.. ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టి, వివాదాల్ని పరిష్కరించకపోతే, పరిస్థితి శృతిమించిపోవడం ఖాయం.. అది తెలుగు సినీ పరిశ్రమ మనుగడకి మంచిది కాదు.

సింధు