cloudfront

Advertisement


Home > Movies - Movie News

అసలు ఈ మనోజ్ ఎవరు?.. 'మా' లేఖపై విశాల్

అసలు ఈ మనోజ్ ఎవరు?.. 'మా' లేఖపై విశాల్

కొన్ని రోజుల కిందట మనోజ్ ప్రభాకర్ అనే తమిళ కమెడియన్, మహేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సీరియస్ గా తీసుకుంది. సదరు మనోజ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నడిగర్ సంఘానికి లేఖ కూడా రాసింది. దీనిపై నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ స్పందించాడు.

"ప్రతి విషయాన్ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. మహేష్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఏమీలేదు. ఆయన చాలా ఫేమస్. మహేష్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు." 

ఇలా మహేష్ ను వెనకేసుకొచ్చాడు విశాల్. ఎవరో ఏదో అన్నారని అభిమానులు ఆందోళన చెందవద్దని, నిజానికి అంతా కమెడియన్ అంటున్న సదరు మనోజ్ ఎవరో కూడా తనకు తెలియదని వివరణ ఇచ్చాడు విశాల్.

"నాకు క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ మాత్రమే తెలుసు. ఓ పెద్ద సెలబ్రిటీని విమర్శిస్తే ఆటోమేటిగ్గా ప్రచారం వస్తుందని కొంతమంది భావిస్తుంటారు. ఇది చాలా కామన్. ప్రస్తుతం సోషల్ మీడియా ఇలానే పనిచేస్తోంది. అందుకే ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను."

మహేష్ అభిమానులంతా అతడిపై మరింత ప్రేమ కురిపించాలని, విమర్శలు చేసిన మనోజ్ ను పట్టించుకోవద్దని కోరుతున్నాడు. విశాల్ చెప్పిన లాజిక్ లో, అతడి వివరణలో అర్థం ఉంది. కానీ మహేష్ అభిమానులు మాత్రం శాంతించలేదు. మనోజ్ ప్రభాకర్ ను ఓ నీచుడిగా అభివర్ణిస్తూనే, అతడిపై ఏదో ఒక రూపంలో చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో విశాల్ ను డిమాండ్ చేస్తున్నారు. 

"మీరు చెప్పింది నిజమే. మనోజ్ లాంటి అనామకుడ్ని మేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతడొక నీచుడు. కానీ అతడు నీచుడు అనే విషయం అందరికీ తెలియాలంటే, ప్రత్యక్షంగా అతడిపై నడిగర్ సంఘం చర్యలు తీసుకోవాలి. దయచేసి ఆ పని చేసి మాకు ఊరటనివ్వండి." 

విశాల్ ను అభ్యర్థిస్తూ ఓ మహేష్ అభిమాన సంఘం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. మా అసోసియేషన్ రాసిన లేఖపై నడిగర్ సంఘం ఇచ్చిన వివరణపై మహేష్ అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందలేదని చెప్పడానికి ఈ పోస్ట్ ఒక్కటే ఉదాహరణ.

ఈ వివాదంపై మనోజ్ ప్రభాకర్ ఇప్పటికే క్షమాపణలు కోరాడు. ఆ విషయాన్ని నడిగర్ సంఘం కూడా ప్రస్తావించింది. కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం శాంతించలేదు. తిట్టి క్షమాపణలు కోరితే సరిపోతుందా..? రేపు విజయ్, అజిత్ లాంటి హీరోల్ని ఎవరైనా తిట్టి క్షమాపణలు కోరితే మీరు ఇలానే వదిలేస్తారా అంటూ నడిగర్ సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు అభిమానులు. 

కోలీవుడ్-టాలీవుడ్ మధ్య సత్సంబంధాలు కొనసాగాలంటే, మనోజ్ లాంటి వ్యక్తులకు శిక్ష పడాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. నడిగర్ సంఘం వివరణపై మా అసోసియేషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.