cloudfront

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు!

చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు!

తిరుమల వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అక్కడ ఉండగానే మరో షాక్ తగిలింది. తిరుమలలో తన కార్యక్రమానికి హాజరుకాకుండా లోకల్ ఎమ్మెల్యే సుగుణమ్మ తిరుగుబాటు ఒక షాక్ అయితే, మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబునాయుడు, మరో 14 మంది తెలుగుదేశం నాయకుల పేరిట నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీచేసింది. ఈనెల 21వ తేదీలోగా.. వీరందరినీ అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరు పరచాల్సిందిగా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

2010లో బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఓ ఉద్యమం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే ఎజెండా తెలుగుదేశం నాయకులందరూ చంద్రబాబు ఆధ్వర్యంలో అక్కడకి వెళ్లి నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అప్పట్లోనే వారందరిపై కేసులు నమోదు అయ్యాయి. అప్పటినుంచి కేసు విచారణలో ఉన్నదే గానీ.. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నడూ మామూలు నోటీసులు కూడా సర్వ్ కాలేదని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఒకేసారి.. చంద్రబాబు సహా వారందరిపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ అయ్యాయి.

ముందస్తు నోటీసులు ఏమీలేకుండానే.. ఒకేసారి ఈ నాన్ బెయిలబుల్ వారంట్లు ఏంటంటూ.. తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తిరుమలలో శ్రీవారి సేవలో ఉండగానే.. ఇలా నోటీసులు వచ్చిన సమాచారం ఆయనకు అందిందని చెప్పుకుంటున్నారు.

అప్పట్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది.. బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకోడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ.. చంద్రబాబు నాయుడు ఓ పొలిటికల్ పోరాటం నడిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వం ఉంది. కేంద్రంలోని భాజపాతో సున్నం పెట్టుకున్న నేపథ్యంలో తనమీద కక్ష సాధింపునకే ఇలా అరెస్టు వారంట్లు ఇచ్చారంటూ ప్రచారం చేయడానికి చంద్రబాబు అండ్ కో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

ఈ వారంట్ల దెబ్బకు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని నమ్ముతున్నారు.