cloudfront

Advertisement


Home > Politics - Gossip

భాజపాకు మేనిఫెస్టో అంటే ఒక కామెడీ!

భాజపాకు మేనిఫెస్టో అంటే ఒక  కామెడీ!

భాజపా మేనిఫెస్టో అనేది ఓ వంచన డాక్యుమెంట్ అని ఏపీలో.. మోడీ మోసాన్ని చవిచూసిన ప్రజలు కొత్త నిర్వచనం చెబితే చెప్పవచ్చు గాక! విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కుఫ్యాక్టరీ, విభజన సమస్యల పరిష్కారం.. అన్నింటినీ మించి ప్రత్యేకహోదా అన్ని మేనిఫెస్టో అంశాల్లోనూ గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని వంచించిన చరిత్ర వారికి ఉంది. ఈ సంగతులేమీ తెలుగువారే అయిన తెలంగాణ ప్రజానీకానికి తెలియనివి కాదు. అలాంటప్పుడు తెలంగాణలో మళ్లీ మేనిఫెస్టో అంటూ.. రకరకాల పన్నాగాలకు దిగుతోంది... తెలంగాణ భాజపా!

రెండు రోజుల కిందట ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో తయారుచేస్తాం అని భారతీయజనతా పార్టీ చెప్పుకుంది. నిజానికి వారికి ప్రతినియోజకవర్గానికి బరిలో దిగడానికి మనుషులే లేరు. కానీ మేనిఫెస్టోల విషయంలో మాత్రం ప్రగల్భాలు పలికింది. తాజాగా మళ్లీ మరో డాంబికపు మాట అంటున్నారు... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. మరో 20 ఏళ్లకు సరిపడా తాము ఈ ఎన్నికల్లో మేనిఫెస్టో తయారుచేయబోతున్నాం అని ఆయన ప్రవచించారు.

సాధారణంగా మేనిఫెస్టో అంటే ఏ పార్టీ అయినా సరే.. ఎన్నికలను ఎదుర్కోబోయే ముందు.. రాబోయే అయిదేళ్ల పదవీకాలంలో తాము ఏం చేయబోతున్నామో.. ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తామో చెబుతుంది. కానీ.. వచ్చే 20ఏళ్లకు సరిపడా మేనిఫెస్టో తయారుచేస్తున్నాం అంటే అర్థం ఏమిటి?

ఈ మేనిఫెస్టోలోని అంశాలను తాము 20 ఏళ్లలో అమలు చేస్తామని, అంటే.. వచ్చే ఇరవయ్యేళ్లపాటూ మమ్మల్నే గెలిపిస్తూ ఉండాలని భాజపా చెబుతున్నట్లుగా అనుకోవాలా? లేదా, ఎటూ తాము గెలిచి అధికారం పగ్గాలు చేపట్టే అవకాశం ఉండదు గనుక.. అలవిమాలిన హామీలన్నింటినీ గుదిగుచ్చి.. ఇరవయ్యేళ్లకు సరిపడా అభివృద్ధిని కేవలం ఈ అయిదేళ్లలోనే సాధించేస్తాం అని చెబుతున్నట్లుగా అనుకోవాలా?

మరి భాజపా అంత లావు అభివృద్ధిని తీసుకువస్తే.. అయిదేళ్ల తర్వాత.. ఇక మేనిఫెస్టో అనేది గానీ, హామీలుగానీ లేకుండానే ప్రజల వద్దకు వారు వస్తుంటారని అనుకోవాలా? అని ప్రజలు విస్తుపోతున్నారు.