cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీడీపీ నేతలపై కత్తులు నూరేందుకు కమలనాథులు రె'ఢీ'

టీడీపీ నేతలపై కత్తులు నూరేందుకు కమలనాథులు రె'ఢీ'

గోదావరి జిల్లాల్లో అనూహ్య పరిణామాలు

తెలుగుదేశం నేతలపై నేరుగా త్తులు దూసేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. ఇటీవలి కాలంలో టీడీపీ నేతల అక్రమాలను ఎండగడుతూ వచ్చిన బీజేపీ నేతలు తాజా పరిణామాల నేపథ్యంలో నేరుగా ఢీకొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికార టీడీపీ పమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో సాగిస్తున్న అక్రమాలను ఎండగట్టాలని కాషాయ దళం యోచిస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అనూహ్య మార్పులు, మంత్రివర్గాల నుండి టీడీపీ, బీజేపీ మంత్రులు రాజీనామాలు చేసి బయటకురావడం వంటి పరిణామాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రత్యేక హోదాకై ఉద్యమం నేపథ్యంలో నలుగురు కేంద్ర, రాష్ట్ర మంత్రుల రాజీనామా చేయడంతో పోరాటాన్ని పతాకస్థాయికి తీసుకువెళ్ళినట్టయ్యిందని గోదావరి జిల్లాలకు చెందిన విశ్లేషకులు పేర్కొంటున్నారు. హోదాకై ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ప్రస్తుతం ఎడతెగని చర్చ జరుగుతోంది. వాస్తవానికి గోదావరి జిల్లాల్లో టీడీపీ, బీజేపీ నేతల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఇరు పార్టీలూ రాష్ట్ర, కేంద్రస్థాయిల్లో మిత్రధర్మాన్ని పాటిస్తున్నట్టు చెబుతూ వచ్చినా, ఈ జిల్లాల్లో టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. కొన్ని సందర్భాలలో కమలనాథులే ఓ అడుగు ముందుకువేసి దేశం నేతలపై బహిరంగ విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. బీజేపీ పమ్మెల్సీ సోమువీర్రాజు, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు వేర్వేరు సందర్భాలలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సుమారు ఏడాది కాలంగా ఇరుపార్టీల నేతలూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న సందర్భాలున్నాయి.

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కలసి పోటీ చేసేందుకు ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ, ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల ఓటమికి తెలుగుదేశం నేతలే కారణమయ్యారని బీజేపీ నేతలు బాహాటంగా విమర్శించారు. ఇదే సమయంలో కాకినాడ పోర్టులో వెలుగుచూసిన ఆయిల్‌ మాఫియా వ్యవహారాన్ని టీజేపీ నేతలు ఆయుధంగా వాడుకున్నారు. ఆయిల్‌ మాఫియాకు ఓ టీడీపీ నాయకుడు లీడర్‌గా పేర్కొంటూ, మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన సాగించారు. అసలైన దోషులను అరెస్ట్‌ చేయాలని బీజేపీ నేతలు రోడ్డెక్కడంతో పాటు సదరు మాఫియా లీడర్‌ను అదుపులోకి తీసుకోవాలని నిరాహార దీక్ష చేశారు.

దీంతో ఇరుపార్టీల మధ్య ఆగాధం ఏర్పడింది. అప్పటి నుండి కమలనాథులు ఏదో ఒక సందర్భంలో టీడీపీ నేతలను ఇరుకున పెడతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలుజరుగుతున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలపై నిర్వాసితులకు దక్కాల్సిన నష్ట పరిహారాన్ని తెలుగుదేశం నేతలు బినామీ పేర్లతో స్వాహా చేస్తున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య తదితరులు ధ్వజమెత్తారు.

ముఖ్యంగా హోదాకై జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు నిర్వహించిన చర్చావేదికల్లో ఇరు పార్టీలకు చెందిన జిల్లానేతలు మల్లయుద్ధాలకు దిగారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ మంత్రులు, అటు కేంద్రంలో టీడీపీ మంత్రులు రాజీనామాలు చేయడంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టేనని ఆయావర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంకోవైపు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి టీడీపీ వైదొలగే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్ళు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. అదే కనుక జరిగితే తమకంటే ఆనందించేవారుండరని కమలనాథులు చెబుతున్నారు.

ఇదిలావుంటే బీజేపీ నేతలు ప్రస్తుతం తెలుగుదేశం పమ్మెల్యేలు సాగిస్తున్న అక్రమాలపై దృష్టి సారించి, ఆయా విషయాలను బహిరంగంగా ప్రకటించే పనిలో ఉన్నారు. తాజాగా ఉభయ రాష్ట్రాల్లో ప్రముఖ రియల్టర్‌గా అవతరించిన పిఠాపురం పమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ సాగిస్తోన్న అక్రమాలపై బీజేపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య ధ్వజమెత్తారు. పిఠాపురం నియోజకవర్గంలో వర్మ సాగిస్తోన్న అక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే అక్రమాలకు పాల్పడుతున్న పమ్మెల్యేల బండారాన్ని బయట పెడతామంటూ కమలనాధులు హెచ్చరిస్తుండటం గమనార్హం!