cloudfront

Advertisement


Home > Politics - Gossip

సీబీఎన్‌ ఆర్మీ: గుట్టువిప్పిన పండుల

సీబీఎన్‌ ఆర్మీ: గుట్టువిప్పిన పండుల

రాజకీయాల్లో నేతలు పార్టీల్ని మార్చేయడం సర్వసాధారణమైపోయిన రోజులివి. పొద్దున్న ఓ పార్టీలో, మధ్యాహ్నం మరో పార్టీలో, సాయంత్రానికి ఇంకో పార్టీలో.. విలవల వలవలూడ్చేసి రాజకీయాలు చేసే నేతలెంతోమంది కన్పిస్తుంటారు. ఎన్నికల వేళ నేతలు పార్టీల్ని మార్చేయడం మామూలే. కానీ, అందర్నీ ఒకేగాటన కట్టేయలేం. పార్టీ మారే నేతలు కొందరు, అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తుంటారు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా వ్యవహరిస్తుంటారు.

అసలు విషయమేంటంటే, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు ఈరోజు వైఎస్సార్సీపీలో చేరారు.. తెలుగుదేశం పార్టీపై విమర్శలూ చేశారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి తాను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే 'సీబీఎన్‌ ఆర్మీ'కి ఝలక్‌ ఇచ్చారు. ఆ 'సీబీఎన్‌ ఆర్మీ' గుట్టు విప్పారు. కమ్మనేతల్ని విమర్శించడానికి కమ్మనేతల్ని, దళితనేతల్ని విమర్శించడానికి దళితనేతల్నీ దించడం చంద్రబాబుకి అలవాటేననీ, ఆయన దగ్గర ఈ మేరకు 'ఆర్మీ' విభాగాలు సర్వసన్నద్ధంగా వుంటాయనీ పండుల సెలవిచ్చారు.

'నా మీద కూడా విమర్శలు చేయడానికి టీడీపీలో వున్న దళిత సోదరుడు సిద్ధమయ్యే వుంటాడు. కానీ, ఓ చిన్న మనవి. నేను మాట్లాడిన మాటల్లో తప్పేమన్నా వుంటే విమర్శించండి. దళితజాతి తరఫున మాట్లాడండి..' అంటూ పండుల చేసిన వ్యాఖ్యలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. చంద్రబాబు సొంత సర్వేల్లో, పండుల రవీంద్రబాబుకి ఓటమి తప్పదని తేలడంతో, మళ్ళీ ఎంపీ టిక్కెట్‌ ఇచ్చే విషయమై పండులకి మొండి చెయ్యి చూపించారు టీడీపీ అధినేత. ఆ కారణంగానే ఆయన టీడీపీని వీడి, వైసీపీలో చేరారు.

'నేను టిక్కెట్‌ ఆశించి చేరలేదు' అని పండుల రవీంద్రబాబు చెప్పొచ్చుగాక.. కానీ, అసెంబ్లీకి పండులను పంపించేందుకు వైఎస్‌ జగన్‌ ఇప్పటికే టిక్కెట్‌ ఖరారు చేశారనీ, టిక్కెట్‌ ఖరారయ్యాకనే పండుల పార్టీ మారారన్నది ఆయన అనుచరులే ఆఫ్‌ ది రికార్డ్‌గా చెబుతున్నమాట. పండుల కంటే ముందు టీడీపీని వీడిన అవంతి, పార్టీ మారే క్రమంలో ఒకింత అత్యుత్సాహం చూపిన విషయం విదితమే. అవంతిపై టీడీపీ విరుచుకుపడిన తీరుతోనే పండుల, ఒకింత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఇక, సీబీఎన్‌ ఆర్మీ విషయానికొస్తే.. రాజకీయాల్లో ఈ తరహా 'సిద్ధాంతాన్ని' మొట్టమొదట తీసుకొచ్చిన వ్యక్తిగా చంద్రబాబుకి చాలా 'గొప్ప' పేరుంది. రెజిమెంట్ల తరహాలో ఆయా కులాలకు చెందిన ముఖ్యనేతల్ని ఉపయోగిస్తుంటారాయన ప్రత్యర్థుల మీద విమర్శలు చేసేందుకు. ఇతర రాజకీయ పార్టీల్లో ఈ తరహా వాతావరణం కొద్దోగొప్పో కన్పిస్తున్నా, అదీ చంద్రబాబు అంటించిన జాడ్యమే.

కొసమెరుపు: ఇప్పుడంటే పండుల సీబీఎన్ ఆర్మీ గురించి నిజాయితీగా బయటపడ్డారుగానీ, నిన్నటిదాకా ఆయనా ఆ ఆర్మీలో సభ్యుడే.. వైసీపీ దళిత నేతల మీద, వైఎస్ జగన్ మీదా నిన్న మొన్నటిదాకా పండుల విరుచుకుపడిన తీరుని ఎలా మర్చిపోగలం. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.

ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!

అంతా అనైతికం, చెప్పేవి మాత్రం నీతులు