cloudfront

Advertisement


Home > Politics - Gossip

జీవీఎల్‌ 'అతి' వెనుక అసలు కథ.?

జీవీఎల్‌ 'అతి' వెనుక అసలు కథ.?

నోడౌట్‌.. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. భారతీయ జనతా పార్టీలో తనకంటూ ఓ 'కోటరీ'ని ఏర్పాటు చేసుకున్న నరేంద్రమోడీ, 'డ్యామేజ్‌ కంట్రోల్‌' కోసం ఆ కోటరీని అత్యంత వ్యూహాత్మకంగా వినియోగిస్తోన్న విషయం విదితమే. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలొచ్చినా, ఇతరత్రా రాజకీయ సంఘటనలు చోటు చేసుకున్నా.. బీజేపీని అక్కడ ఆ సమయంలో 'యాక్టివ్‌'గా మార్చడంలో ఈ కోటరీ అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ వస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జీవీఎల్‌ నరసింహారావు, దేశంలోని పలురాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంలో భారతీయ జనతా పార్టీకి అత్యంత విలువైన సూచనలు, సలహాలు అందించారు.. వ్యూహ రచనలో తనదైన ముద్రవేశారు. అందుకుగాను, జీవీఎల్‌ నరసింహారావుని రాజ్యసభకు పంపించారు ప్రధాని నరేంద్రమోడీ. రైట్‌ టైమ్‌లో.. ఆయన్ని రాజ్యసభకు పంపడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 'బీజేపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు' చెక్‌ పెట్టాలన్నది నరేంద్రమోడీ వ్యూహం. అయితే, జీవీఎల్‌ అనే అస్త్రాన్ని ప్రయోగించడం ద్వారా ఏపీలో బీజేపీకి డ్యామేజ్‌ కంట్రోల్‌ అవుతుందా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 

నిజానికి, జీవీఎల్‌ నరసింహారావుకి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలులేవు. ఏ ఎన్నికల్లోనూ ఆయన పోటీచేసింది లేదు. అన్నిటికీ మించి, రాజ్యసభ సభ్యుడయ్యేదాకా ఏపీ ప్రజలకి జీవీఎల్‌ నరసింహారావు అంటే ఎవరో తెలియని పరిస్థితి. 2019 ఎన్నికల్లో జీవీఎల్‌ నరసింహారావుకి, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలిపించే సత్తా వుందా.? అంటే, అంత సీన్‌ లేదని బీజేపీ నేతలే చెప్పేస్తుంటారు. రైల్వేజోన్‌ విషయమై నిన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌తో ఏపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిథులు సమావేశమయితే, అక్కడ జీవీఎల్‌ సృష్టించిన రగడ అంతా ఇంతా కాదు.

సొంత రాష్ట్రానికి కాస్తో కూస్తో మేలు చేయాలనుకుంటే, రైల్వేజోన్‌ కావొచ్చు, కడప ఉక్కు కావొచ్చు, ప్రత్యేక ప్యాకేజీ కావొచ్చు.. ఆయా అంశాల్లో ప్రధాని నరేంద్రమోడీపైనా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపైనా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. కేంద్ర మంత్రుల్ని ఆయా ప్రాజెక్టుల విషయంలో ఒప్పించగలగాలి. అంత సీన్‌ లేకపోతే, సైలెంట్‌గా అయినా వుండాలి. కానీ, జీవీఎల్‌ అలాకాదు.! ఆయన అతి కాస్తా రాష్ట్ర ప్రజలకు చికాకు తెప్పించేస్తోంది. 

నాలుగేళ్ళు చంద్రబాబు, బీజేపీతో అంటకాగిన వైనం రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. చంద్రబాబు హయాంలో అవినీతి గురించి జీవీఎల్‌ ప్రస్తావించడాన్ని తప్పుపట్టలేం. కానీ, అధికారం చేతుల్లో పెట్టుకుని.. రాజకీయ ఆరోపణలకే బీజేపీ నేతలు పరిమితమైతే ఎలా.? ఈ కాస్త ఇంగితాన్ని జీవీఎల్‌ మిస్‌ అవుతున్నారు. ఇదంతా జీవీఎల్‌ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు ఏపీ బీజేపీ నేతల వద్దనే సరైన సమాధానం లేని పరిస్థితి. 

కేంద్రమంత్రి వర్గంలో చోటు కోసం తహతహలాడుతున్నారా.? లేదంటే, ఆంధ్రప్రదేశ్‌ మీద జీవీఎల్‌ ప్రత్యేకంగా ఏమన్నా 'కక్ష' పెంచుకున్నారా.? ఏమో, ఆయనకే తెలియాలి.!