cloudfront

Advertisement


Home > Politics - Gossip

బేరం చెడగానే రాళ్లేస్తున్నారు!

బేరం చెడగానే రాళ్లేస్తున్నారు!

అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే లౌక్యశిఖామణులు రాజకీయాల్లో పుష్కలంగా ఉంటుంటారు. ఇప్పుడు వర్తమానంలో గమనిస్తే తెలంగాణ ఇంటిపార్టీ కూడా అదే తీరుగా కనిపిస్తోంది. మహాకూటమి ఏర్పడిన నాటినుంచి.. వారి జట్టులో ఒకరుగా ఏనాడూ సోదిలో కూడా వినిపించకుండా ఉండిపోయిన తెలంగాణ ఇంటి పార్టీ.. చివరగా సీట్ల కేటాయింపు వేళ వచ్చేసరికి ఓ స్థానం దొరకబుచ్చుకోడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. కాంగ్రెస్ అంతర్గత సమీకరణాల్లో అదికూడా దక్కకపోయేసరికి ఇప్పుడు మహాకూటమి మీద వాళ్లు రాళ్లేస్తున్నారు.

తెలంగాణ ఇంటి పార్టీ అంటూ ఒక పార్టీ ఉంది. చెరుకు సుధాకర్ దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయడం అనేది వీరి ప్రకటిత ఎజెండా! అయితే సాధారణంగా జనసామాన్యంలో ఎక్కువ మందికి సరిగా తెలియని ఈ పార్టీ మహా కూటమిలో భాగంగా సీట్లను పొందాలని అనుకుంది. కానీ.. మహాకూటమి ఏర్పడిన నాటినుంచి ఏనాడూ వారి జట్టులోకి చేరలేదు. ఆ కూటమిలో భాగంగా ఉన్నట్లు ప్రకటించనూ లేదు.

భాగస్వామ్య పార్టీలకు కాంగ్రెస్ సీట్లు పంచే సమయం వచ్చిన తర్వాత.. తెలంగాణ ఇంటి పార్టీకి కూడా ఓ సీటు కేటాయించడానికి కాంగ్రెస్ ఉద్యుక్తమైనట్లుగా వార్తలు వచ్చాయి. నకిరేకల్ స్థానాన్ని వారికివ్వదలచుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే.. దీనిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తన అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు అక్కడ టికెట్ ఇవ్వకుంటే తమ సోదరులిద్దరూ పోటీచేయబోం అంటూ బెదిరించారు. కాంగ్రెస్ దిగివచ్చింది. తెలంగాణ ఇంటి పార్టీని పక్కన పెట్టింది.

అయితే చివరిదాకా బేరాలాడి నకిరేకల్ నుంచి మహాపొత్తుతో భార్యను ఎమ్మెల్యే చేయాలని అనుకున్న చెరుకు సుధాకర్ ఇప్పుడు కూటమిపై రాళ్లేస్తున్నారు. తాము యెన్నం శ్రీనివాసరెడ్డి కోసం ఒకటి, నల్గొండ జిల్లాలో మరొకటి రెండే స్థానాలు అడిగాం అని.. అయినా మహాకూటమి మోసం చేసిందని అంటున్నారు. ఆ సీటు తన భార్యకోసం అడిగినట్లుగా చెప్పడంలేదు.

తెలంగాణలో దశాబ్దాల పోరాట చరిత్ర ఉన్న సీపీఐ కేవలం మూడు సీట్లకు ఒప్పుకుని పోటీచేస్తోంటే.. నిన్నగాక మొన్న పుట్టిన ఇంటిపార్టీకి రెండు సీట్లు ఎలా వస్తాయని అనుకున్నారో గానీ.. ఇప్పుడు 21 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారంటూ చెరుకు సుధాకర్ అంటున్నారు మరి!

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్