Advertisement


Home > Politics - Gossip
జగన్ కు ఈ మాటలు ఇరకాటమే!

రాందాస్ అథవాలే... తలా తోకాలేని మాటలతో వైఎస్ జగన్మోహన రెడ్డిని భ్రష్టు పట్టించడమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడా అని అనిపిస్తుంది. రాందాస్ అథవాలే అనే కేంద్రమంత్రి ఒక రకంగా చెప్పాలంటే అతీగతీ లేని నాయకుడు. మహారాష్ట్రలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) అనే పార్టీకి ఆయన వ్యవస్థాపకుడు, అధినేత. ఆ పార్టీ కి లోక్ సభలో ఒక్కరంటే ఒక్క సభ్యుడు కూడా లేరు. రాజ్యసభలో ఒకే ఒక్క సభ్యుడిగా అథవాలే ఉన్నారు. మహారాష్ట్రలో విదర్భ ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడుతున్న బిల్డప్ తో ఆయన తనకంటూ అస్తిత్వం సృష్టించుకున్నారు. స్థానికంగా మహారాష్ట్రలో తమకు అనుకూలించగల సమీకరణాల కోసం మోడీ సర్కారు.. రెండు సభలకు కలిపి ఒకడే సభ్యుడు ఉన్నప్పటికీ.. ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టింది.

స్థూలంగా పరిశీలిస్తే... రాందాస్ అథవాలే భాజపా నాయకుడు కాదు. మరో చిన్నా చితకా పార్టీ వ్యక్తి. ఆయనేమీ భాజపా విధాన నిర్ణేత కాదు. అయినా సరే.. ఆయన ఎన్డీయేలోకి వైఎస్సార్ కాంగ్రెస్ రావడం గురించి, భాజపా పూనుకుని ఆయనను సీఎం చేసేయడం గురించి తన తాహతుకు మించి అతిశయం అనదగిన డైలాగులు వల్లిస్తున్నారు. తమాషా ఏంటంటే అలాంటి ఊరూపేరూ లేని నాయకుడ మాటలను పట్టుకుని.. తెలుగుదేశం వైఎస్ జగన్ ను ఇరుకున పెట్టడానికి పూనుకుంటోంది.

కేంద్రమంత్రి రాందాస్ అథవాలే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తూ హైదరాబాదులో ఓ కార్యక్రమంలో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అథవాలే మాటలు కొత్త విషయం ఏమాత్రం కాదు. ఈ ఏప్రిల్లో విజయవాడలో కూడా ఆయన ఇలాంటి మాటలే మాట్లాడారు. చంద్రబాబు వెళ్లిపోయాడు గనుక.. జగన్ వచ్చి ఎన్డీయేలో చేరితే బాగుంటుందని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని అప్పట్లో అన్నారు.

ఈసారి అథవాలే కాస్త డోసు పెంచారు. జగన్ ఎన్డీయేలోకి రాదలచుకుంటే.. తాను మోడీ, అమిత్ షాలతో మాట్లాడి ఒప్పిస్తానని ఆయన అంటున్నారు. ఇంతకంటె కామెడీ మరొకటి ఉండదు. తన రాష్ట్రంలో తనకూ ఊరూ పేరూ లేకపోయినా.. ఆయన తానేదో మహా నాయకుడు అయినట్లుగా... ఎన్డీయేలో చేరడానికి జగన్ ఎగబడుతోంటే.. మోడీ, అమిత్ వ్యతిరేకిస్తున్నట్లుగా, తాను ఒప్పించగలనని చాటుకుంటున్నట్లుగా ఈ మాటలు ఉన్నాయి.

అలాగే జగన్ వచ్చి కలిస్తే.. ఆయనను ముఖ్యమంత్రి చేస్తాం అని కూడా అంటున్నారు. భాజపాతో కలవకుంటే జగన్ ముఖ్యమంత్రి కాలేడా అనేది వైకాపా వారి ప్రశ్న. రాష్ట్రంలో భాజపాకే దిక్కూమొక్కూలేకుండా పోయింది. వంచించిన పార్టీని ఈ రాష్ట్రం ఛీ కొడుతోంది. అలాంటి సమయంలో.. మాతో కలిస్తే సీఎం చేస్తాం అంటూఆయన జగన్ కు ఆఫర్ పెట్టడం అజ్ఞానమే అనే వ్యాఖ్యలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

అసలే భాజపాతో జగన్ కుమ్మక్కు అయ్యాడని చంద్రబాబు ఆరోపిస్తున్న తరుణంలో, రాందాస్ చేసే ఇలాంటి వ్యాఖ్యలు జగన్ ను ఇరుకున పెట్టేవే. ఆయన మాటలు కుట్రపూరితాలని, కొందరు ఆయన వెనుక ఉండి జగన్ మీద ఇలాంటి బురద చల్లిస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.