cloudfront

Advertisement


Home > Politics - Gossip

కుమారస్వామికి ఇక నిద్రలేని రాత్రులే!

కుమారస్వామికి ఇక నిద్రలేని రాత్రులే!

ఆయన పార్టీ గెలిచింది కేవలం 37స్థానాల్లో మాత్రమే. 224ఎమ్మెల్యే సీట్లున్న రాష్ట్రంలో కేవలం 37మంది బలాన్ని కలిగి ఉండాంటే.. తూచ్ అనేయాల్సిందే. కానీ.. ఆయననే సీఎం కిరీటం వరించి వచ్చింది. ఎగిరి గంతేసి దాన్ని అందుకున్నారు. మూడు నాలుగు రోజులు టెన్షన్ రాజ్యమేలింది. ఎట్టకేలకు యడ్యూరప్ప రాజీనామా చేయడంతో సీఎం కుర్చీ తనదే అని కుమారస్వామికి ఖరారు అయిపోయింది.

కాకపోతే.. ఈ వైభవం ఆయనకు ఎన్నాళ్లుంటుంది? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం 104మంది సభ్యుల బలముంది. రెండు స్థానాల్లో ఇంకా ఎన్నికలు జరగాలి. ఆ పర్వం పూర్తయితే గనుక.. వారి బలం కాస్త పెరగవచ్చు.

కుమారస్వామి పరిపాలన మొదలైన తర్వాత.. ఆయన జంబో క్యాబినెట్ ఏర్పాటు చేయగల అవకాశమైతే లేదు. పరిమితిని బట్టి మాత్రమే ఆయన మంత్రి పదవులు పంచగలరు. మిగిలిన అసంతృప్తి వాదులకు కాంట్రాక్టుల ఆశ చూపించాల్సిందే తప్ప మరో మార్గం లేదు. అయితే ఆ పరిస్థితి వచ్చిన తర్వాత.. ఆ రెండు పార్టీల్లోని అసంతృప్తి వాదులను ఆకర్షించడం కమలదళానికి చాలా ఈజీ అయిపోతుంది.

పైగా అధికారపార్టీ సాగిస్తున్న దుర్మార్గమైన పాలన నచ్చక వారు వచ్చి తమ పార్టీలో చేరుతున్నారంటూ.. ఎదురుదాడి చేయడానికి కూడా వీలుంటుంది. మహా అయితే అధికారంలో జేడీఎస్ లేదా కాంగ్రెస్ వారుంటారు గనుక.. ఆ పార్టీలకు చెందిన వ్యక్తే స్పీకరుగా ఉంటారు గనుక.. ఎవరైనా పార్టీ ఫిరాయించి బీజేపీ వైపు వెళితే తక్షణం అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. అంటే ఉప ఎన్నికలు వస్తాయి. లేదా, భాజపా కూడా వ్యూహాత్మకంగా పదవులకు రాజీనామా చేయించి, ఆ పిమ్మట వారిని తమ పార్టీలోకి చేర్చుకోవచ్చు. అదే జరిగితే కుమారస్వామి సర్కారు కుప్ప కూలుతుంది.

ఇలాంటి పరిణామాలు సంభవించడానికి కన్నడనాట ఎంతైనా అవకాశం ఉంది. అంటే కుమారస్వామి ఇప్పుడంటే కేవలం రెండు రోజులు ఎమ్మెల్యేలను హోటళ్లలో పెట్టి కాపలా కాస్తూ గడిపారు. కానీ రోజులుగడిచే కొద్దీ.. ఎమ్మెల్యేలను ఇలా బంధించి ఉంచడం వారికి ఎలా సాధ్యం.

ముఖ్యమంత్రి అవుతారే తప్ప.. ఏ రోజున ఎవరు పార్టీ వీడిపోతారో.. అనే భయంతో పదవిలో ఉన్నంత కాలమూ ఆయనకు నిద్రలేని రాత్రులు తప్పకపోవచ్చు. ‘‘ప్రజల కోరిక ఫలించింది.. భాజపా అధికారంలోకి వచ్చింది’’ అనే నినాదంతో యడ్డీ ఈ అయిదేళ్ల లోపుగా ఏదో ఒకరోజు మళ్లీ అధికారంలోకి రావొచ్చు.. అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.