Advertisement


Home > Politics - Gossip
నష్టం మోడీకి కాదు సార్.. తమరికే!

ఏపీలోని రెండు పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ప్రస్తుతం కేంద్రంలోని మోడీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఉన్నాయి. దీనిని అనుమతించడం గురించి సోమవారం చర్చ జరగాల్సి ఉంది. అయితే ఈలోగా కమల నాధులు మాత్రం.. ఈ విషయంలో తమదైన శైలిలో అతి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అవిశ్వాస తీర్మానాల వల్ల.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు, మోడీ ప్రభుత్వానికి వీసమెత్తు నష్టం కూడా లేదని కన్నడసీమకు చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్ అంటున్నారు. అయితే ఆయనకు ఓ సంగతి అర్థం కావడం లేదు. నష్టం మోడీకి కాదు సార్.. తమరికే అని తెలుగు ప్రజలు దీవిస్తున్నారు.

తమాషా ఏంటంటే.. తమ ప్రయత్నం వలన మోడీ సర్కారు మరో రెండు రోజుల్లో నిలువునా కుప్ప కూలిపోతుందని, అవిశ్వాసం ప్రతిపాదించిన పార్టీలతో సహా ఎవ్వరూ అనుకోవడం లేదు. కాకపోతే.. తమరికి మాత్రం నష్టం తప్పదని అనంతకుమార్ ను ఉద్దేశించి తెలుగు ప్రజలు అనుకుంటున్నారు.

ఎందుకంటే.. అవిశ్వాస తీర్మానం ద్వారా.. తెలుగు ప్రజలకు మాట ఇచ్చి మోడీ సర్కారు ఎన్నికల పబ్బం గడచిపోయిన తర్వాత ఏ రకంగా వంచించిందో దేశవ్యాప్తంగా అందరికీ అర్థం అవుతుంది.

మోడీ సర్కారు చేసిన వంచన గురించి సభలో విస్తృతంగా జరిగే చర్చ ద్వారా దేశ ప్రజలందరిలోనూ కొత్త ఆలోచన వస్తుంది. ఏతా వతా.. మోడీకి ప్రభ, ఇమేజికి కాస్త గండిపడుతుంది. ప్రభుత్వం పడిపోకపోవచ్చు గానీ.. ఆయన ఇమేజి పతనం కావడం మాత్రం ఖరారు.

ఆ రకంగా భాజపా వంచన రచ్చకెక్కే సమయానికే కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఈసారి కన్నడ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారాన్ని దక్కించుకోవాలని.. భారతీయ జనతా పార్టీ చాలా ఉవ్విళ్లూరుతోంది. దక్షిణాదిలో తమకు అంతో ఇంతో దిక్కూ మొక్కూ ఉన్న ఈ రాష్ట్రంలో గతంలో అధికారం అందినట్టే అంది జారిపోవడం వారికి చాలా ఇబ్బందిగా ఉంది.

మళ్లీ గెలవాలని అనుకుంటున్న సమయంలో.. మోడీ నమ్మక ద్రోహాల గురించి జరిగే ప్రచారం.. కచ్చితంగా.. అక్కడి ఓటింగ్ పై కూడా ప్రభావం చూపిస్తుందని అంతా అనుకుంటున్నారు. పైగా కర్నాటకలో తెలుగు ఓటర్ల ప్రభావం కూడా చాలా ఎక్కువ. వారందరూ కలసి పనిచేస్తే.. భాజపాకు అక్కడి అసెంబ్లీలో అధికారం కల్ల అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.