cloudfront

Advertisement


Home > Politics - Gossip

మినీ కూటమి: కాంగ్రెస్ రాజకీయానికి ప్రొఫెసర్ బలి?

మినీ కూటమి: కాంగ్రెస్ రాజకీయానికి ప్రొఫెసర్ బలి?

మహాకూటమి కాస్తా, రెండు మినీ కూటములుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా పొత్తుకు శ్రీకారం చుట్టిన పార్టీలు, సీట్ల పంపకాల దగ్గరకు వచ్చేసరికి తమ నిజస్వరూపాన్ని బైటపెట్టుకున్నాయి. లెక్కలు ఓ పట్టాన తేలడంలేదు. సిగ్గు వదిలేసిన టీడీపీ, 'చేయి' విదిల్చిన సీట్లతో సరిపెట్టుకున్నా సీపీఐ, జనసమితి మాత్రం బెట్టు వీడలేదు.

కాంగ్రెస్ కి ఈ రెండు పార్టీలు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశాయి. సీట్ల విషయంలో తేడాలొస్తే శుక్రవారం మీటింగ్ పెట్టుకుని తమదారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పాయి. సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, నారాయణతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం భేటీ కావడమే దీనికి నిదర్శనం.

సీట్ల కేటాయింపులో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీపీఐ, టీజేఎస్ లు ఓ మినీ కూటమిగా ఏర్పడటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకటీ అరా అంటూ కాంగ్రెస్ ఇస్తున్న లీకులపై ఈ రెండు పార్టీల నేతలు రగిలిపోతున్నారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తమ పార్టీని కూడా సింగిల్ డిజిట్ కే పరిమితం చేయాలని చూస్తుండే సరికి కోదండరాంకి దిక్కు తోచడం లేదు.

ఆమాత్రం దానికి పార్టీ పెట్టడం దేనికి, టీఆర్ఎస్ లో కలిస్తే మేమే గౌరవంగా చూసుకునేవాళ్లం కదా అని గులాబీదండు నుంచి సెటైర్లు పడుతుండే సరికి ప్రొఫెసర్ కి చిర్రెత్తుకొస్తోంది. దీనికితోడు సీపీఐ నేతలు, కోదండరాం కడుపుమంటలో ఇంకాస్త పెట్రోల్ పోస్తున్నారు. దీంతో ఇరు పార్టీల నేతలు కూడబలుక్కుని మినీ కూటమి యత్నాలు ప్రారంభించారు.

అదే సమయంలో మినీ కూటమిని మరో భయం కూడా వెంటాడుతోంది. మహాకూటమితో కలసి పోకుండా విడిగా జనాల్లోకి వెళ్తే గెలుస్తామా లేదా అనే విషయంపై వీరికి అనుమానాలున్నాయి. అందుకే ముందుగా బెదిరింపుల పర్వానికి తెరతీశారు.

వీలైనంత వరకు బెదిరించి చివరకు టీడీపీలాగే ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ తో సర్దుకుపోతాయనే మాటలు కూడా వినపడుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పక్షపాత పెద్దన్న పాత్రతో మహా కూటమి కాస్తా రెండు మినీ కూటములుగా మారే అవకాశం కనిపిస్తోంది. 

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్