cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్.. సత్తా తేలిపోతుంది!

పవన్.. సత్తా తేలిపోతుంది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు దాదాపుగా వచ్చినట్లే. తన వైఫల్యాలు ఎక్కడ బయటపడిపోతాయోనని.. చంద్రబాబు ఈ ఎన్నికలు జరగకుండా చూడడానికి ఏవైనా కొత్త ప్రణాళికలు రచిస్తే తప్ప... మూడునెలల్లోగా పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు నిర్వహించే అవసరం రాకుండా, పంచాయతీల్లో ప్రత్యేకాధికార్లను పెడుతూ చంద్రబాబు సర్కార్ జారీచేసిన జీవోను హైకోర్టు కొట్టవేసింది.

అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కోరుకుంటున్న పార్టీల్లో మూడో కృష్ణుడుగా రంగప్రవేశం చేసిన పవన్ కల్యాణ్ అసలు బలమేంటో ఈ ఎన్నికల్లో తేలిపోతుంది. పంచాయతీ ఎన్నికలు అనేవి ఇప్పట్లో ఖచ్చితంగా రావు అని ఫిక్సయ్యారో ఏమో గానీ పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల గురించి చాలా చాలా దూకుడుగా మాట్లాడారు.

ఆ నడుమ గోదావరి జిల్లాల్లో పంచాయతీల మాజీ సర్పంచులతో ఆయన ఓ సమావేశం నిర్వహించారు. ఎన్నికలు వెంటనే నిర్వహించకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారనే సంగతి ఆ సమావేశంలో ఆయన దృష్టికి వచ్చింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ రెచ్చిపోయారు.

చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి దమ్ముంటే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన సవాళ్లు విసిరారు. ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే గనుక.. ఖచ్చితంగా జనసేన పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటుందని కూడా ఆయన ఢంకా బజాయించి ప్రకటించారు.

తమ పార్టీకి క్షేత్రస్థాయిలో బలంలేదని చాలా మంది ఎగతాళి చేస్తుంటారని, పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే.. తమ పార్టీ అసలు బలాన్ని నిరూపించుకుంటాం అని కూడా ఆయన ప్రకటించారు. తీరా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి.

హైకోర్టు ఆదేశాలను అమల్లోపెట్టి, చంద్రబాబు ఎన్నికలు నిర్వహించడానికి సాహసిస్తే గనుక.. ఖచ్చితంగా రాష్ట్రంలో ఈసారి అధికార పీఠాన్ని అందుకోవడానికి తహతహలాడుతున్న మూడు పార్టీల్లో ఎవరి బలం ఏమిటో స్పష్టంగా తేలిపోతుంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది గనుక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సొంత ఓటు బ్యాంకు ఉన్నది గనుక.. ఆ పార్టీలకు పెద్దసంఖ్యలో స్థానాలు దక్కడంలో విశేషం లేదు. కానీ... ప్రత్యామ్నాయ మూడోరాజకీయ శక్తిగా తాను అధికారంలోకి రాగలఅననుకుంటున్న పవన్ కల్యాణ్ కు మాత్రం ఈ ఎన్నికలు లిట్మస్ టెస్టు లాంటివి అవుతాయి.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి