cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్‌పై బాబు స్పందన వ్యూహంలో భాగమా..?

పవన్‌పై బాబు స్పందన వ్యూహంలో భాగమా..?

గోదావరి జిల్లాల్లో రసవత్తర చర్చ
జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన రాజకీయ వ్యూహంలో భాగమేనా? అన్న చర్చ ఉభయ గోదావరి జిల్లాల్లో సర్వత్రా జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయంగా సెంటిమెంట్‌ జిల్లాలుగా పేరొందిన గోదావరి జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. బాబు వ్యాఖ్యలు రాజకీయంగా వ్యూహాత్మక కదలికలకు సంకేతాలిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలసి నడచిన పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇటీవలి కాలంలో చంద్రబాబు సహా తనయుడు లోకేష్‌పై తీవ్రస్థాయిలో పవన్‌ ధ్వజమెత్తారు. లోకేష్‌ పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో చంద్రబాబుకు పూర్తిగా దూరమైనట్టు, ఆయనను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్థమైనట్టుగా పవన్‌ సంకేతాలిచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో బాబు-పవన్‌ల మధ్య చీకటి ఒప్పందాలున్నట్టు వైకాపా నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. పవన్‌ ముసుగుతీస్తే బాబు కనిపిస్తారని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు.

తాజాగా పవన్‌తో కలసి ఎన్నికల్లో పోటీచేస్తే తప్పేంటి? ఈ విషయంలో వైకాపాకు పందుకు ఉలుకు? అంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రశ్నించడం గోదావరి జిల్లాల్లోని రాజకీయవర్గాల్లో కాకరేపింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాజకీయ వ్యూహంలో భాగమేనని, వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ కలసిపోతారనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని వైకాపానేతలు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో పలువురు సీనియర్‌ నేతలు ఇటు చంద్రబాబు, అటు పవన్‌కళ్యాణ్‌లను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రశ్నించడం కోసం పుట్టిన జనసేన ప్రజల కోసం పోరాడితేనే శ్రేణులు వెనుక ఉంటాయని, అధికార పార్టీతో చేతులు కలిపిన పక్షంలో శ్రేణులన్నీ ఇంకోదారి చూసుకోవడం తథ్యమని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని చెప్పిన జనసేన ఒకవేళ యూటర్న్‌ తీసుకుంటే ప్రజారాజ్యానికి పట్టిన గతే జనసేనకూ పడుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు జనసేన పార్టీకి చెందిన నేతలు సైతం చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొడితే మంచిదని సూచిస్తున్నారు.

నిజంగా తమ నాయకుడు పవన్‌కళ్యాణ్‌కు ఇటువంటి వ్యూహం లేనిపక్షంలో చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించాల్సిందేనని పేర్కొంటున్నారు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగేసత్తా జనసేనకు ఉందన్న సంకేతాలనే ప్రజల్లోకి పంపాలని కోరుతున్నారు. ఇదిలావుంటే తెలుగుదేశం శ్రేణులు చంద్రబాబు వ్యాఖ్యలను తప్పు పట్టకుండా అచితూచి వ్యవహరిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న కూటమి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తమ అధినేత ఈ విధంగా వ్యాఖ్యానించారని, ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్‌తో కలసి నడుస్తోన్న తమకు 2014 ఎన్నికల్లో స్నేహహస్తం అందించిన పవన్‌తో మరోసారి కలసినడిస్తే ఇబ్బందేముందని కూడా వాదిస్తున్నారు. ఇదిలావుంటే నేడో రేపో పార్టీల ఫిరాయింపులకు రంగం సిద్ధం చేసుకున్న కొందరు నేతలు తాజా పరిణామాలతో అయోమయంలో ఉన్నారు.

ఇటు టీడీపీ నుండి జనసేనలోకి అటు జనసేన నుండి టీడీపీలోకి ఫిరాయించేందుకు నిర్ణయించుకున్న నేతలు ప్రస్తుత పరిణామాలతో వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫిరాయించిన అనంతరం ఇరుపార్టీలూ వచ్చే ఎన్నికల్లో కలిస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న ఆలోచనతో నేతలు డైలమాలో ఉన్నారు.
-డి.శ్రీనివాస్‌కృష్ణ

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

మహిళా మంత్రికి సలహాలు.. పోటీ చేయకమ్మా డబ్బులు మిగులుతాయ్