Advertisement


Home > Politics - Gossip
ప్రవేశపెట్టండి.. రంగంలో దిగుతా: పవన్

తాను చేసిన సూచన ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన జగన్మోహన్ రెడ్డి, దానికి సరిపడా మద్దతు కూడగట్టడానికి తనకు విసిరిన సవాల్ ను పవన్ కల్యాణ్ స్వీకరించారు. ముందు మీరు తీర్మానం ప్రవేశపెట్టండి. దానికి అవసరమైన మద్దతు తాను కూడగడతానని పవన్ కల్యాణ్ అన్నారు.

తాను స్వయంగా ఢిల్లీకి వచ్చి, అవసరమైతే భాజపా వ్యతిరేక పార్టీలు ఉన్న రాష్ట్రాలు అన్నీ తిరిగి అయినా సరే.. మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశానికి నేను చెప్పలేను.. నేను వారి పార్టనర్ ను కాదు. తనకు క్రెడిట్ అవసరం లేదని.. క్రెడిట్ వైసీపీనే తీసుకోవచ్చునని ఆయన చెప్పుకొచ్చారు.

నిబంధనల ప్రకారం అవిశ్వాసతీర్మానాన్ని ఒక్క సభ్యుడైనా ప్రవేశపెట్టవచ్చునని, తీర్మానం ప్రవేశపెడుతూ నోటీసు ఇచ్చిన తరవాత.. దానికి ఎందరు మద్దతిస్తున్నారని సభలో స్పీకరు అడుగుతారని.. ఆ సమయంలో 50 మంది చేతులెత్తి మద్దతిస్తే చాలునని.. ఓటింగ్ జరుగుతుందని ఆ మాత్రం బలం కూడగట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

వీలైనంత త్వరగా రెండు మూడురోజుల వ్యవధిలోనే వైసీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనేది తన విజ్ఞప్తి అని పవన్ ప్రకటించారు. అలా జరిగితే.. మార్చి 5న సమావేశం మొదలు కాగానే స్పీకరు దాన్ని గురించి ప్రకటించి ఎందరు మద్దతిస్తారని అడుగుతారని పవన్ చెప్పారు. మార్చి 4వ తేదీలోగా తాను అన్ని పార్టీల పెద్దలను కలిసి మద్దతు కూడగటట్టే ప్రయత్నం చేస్తానని ఆయన వెల్లడించారు.

ఏపీ డిమాండ్లలో నిజం ఉందని సమర్థించిన తెరాస ఎంపీ కవిత, తాము కూడా అవిశ్వాసం పెట్టే యోచన ఉన్నట్లు లీకులు ఇచ్చిన రాహుల్, అలాగే అఖిలేష్, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఐ, సీపీఎం ఇలా అందరినీ కలసి తాను మద్దతు తీసుకువస్తానని.. కనీసం 80 మంది మద్దతు కూడగట్టగలననే నమ్మకం ఉన్నదని పవన్ వెల్లడించారు.

జగన్ దమ్ము ధైర్యం తెగింపు అన్నీ ఉన్న వ్యక్తి అని తనకు బాగా తెలుసునని.. ఆయన ఇప్పుడు వాటిని నిరూపించుకోవాలని, ఆయన వెంట తమ మద్దతు పూర్తిగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ గనుక ఈ అవకాశాన్ని మిస్ చేసుకుంటే.. తెలుగుదేశానికి మరో అవకాశం ఉంటుందని.. వారు కూడా మిస్ చేసుకుంటే.. రాష్ట్రానికి నష్టం తప్పదని పవన్ అన్నారు.

తనకు రాజకీయాలతో సంబంధం లేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం దిద్దడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం అని.. వైసీపీ వారికి నిర్ణయం తీసుకోవడానికి సమయం కావల్సి వస్తే.. కనీసం మార్చి 4లోగా.. అవిశ్వాసం ప్రతిపాదించాలని ఆయన కోరారు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి