cloudfront

Advertisement


Home > Politics - Gossip

తేజను గెంటేయడంలో పొలిటికల్ యాంగిల్?

తేజను గెంటేయడంలో పొలిటికల్ యాంగిల్?

‘ఎన్టీఆర్’ చిత్ర దర్శకత్వ బాధ్యతలనుంచి తేజను తప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలోనే చిత్రం రూపొందబోతున్నదనే మాట మాత్రమే వినిపిస్తోంది. తేజను ఏ కారణాల వలన సినిమా దర్శకత్వం నుంచి తప్పించారు అనే విషయంలో ఇప్పటికే గ్రేటాంధ్ర ఒక సవివరమైన కథనాన్ని అందించింది.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ గా దీనిని తీస్తూ.. ఆయన రాజకీయ జీవితాన్ని ఎంతవరకు స్పృశించాలి అనే విషయంలో కూడా బాలకృష్ణ- తేజల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని.. ప్రాజెక్టు నుంచి దర్శకుడిని తప్పించేంత వివాదంగా మారడానికి అవికూడా ఒక కారణం అనే పుకార్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ జీవితం మీద బయోపిక్ అంటే.. ఎక్కడినుంచి ఎక్కడివరకు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఉదయిస్తుంది. ఎందుకంటే.. ఆయన జీవితంలో ఉన్నన్ని ఉత్థాన పతనాలు, డిఫరెంట్ షేడ్స్ మరొకరి జీవితంలో మనం ఊహించలేం. ఇటు సినిమా, అటు రాజకీయ రంగాలలో మేరు నగ సమానంగా ఎదిగిన వైనం ఆయనకు అలాంటి కీర్తిని కట్టబెట్టింది.

అయితే ఈ విషయంలో.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి.. రాష్ట్రమంతా పర్యటించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, తాను ముఖ్యమంత్రి అయిన తొలి సందర్భం వరకే చిత్రాన్ని నిలిపి వేయాలనేది బాలకృష్ణ అభిప్రాయంగా చెబుతున్నారు. అయితే దర్శకుడు తేజ మాత్రం నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు- ఆ సంక్షోభం నుంచి, ప్రతికూల పరిస్థితులనుంచి ఎన్టీఆర్ ఎలా ఎదిగివచ్చారో ఆ ఘటనలు అన్నీ చిత్రంలో ఉంటేనే... పరిపూర్ణంగా ఉంటుందని తేజ పట్టుబట్టినట్లు సమాచారం.

ఎన్టీఆర్ మరణం వరకు ఆయన జీవితాన్ని మొత్తం టచ్ చేయాలనే ఉద్దేశాన్ని కూడా.. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ను కూడా ప్రస్తావించాలనే తేజ చెప్పినట్లుగా అయితే వినిపిస్తోంది. చివరి భాగాలను పక్కన పెట్టినా.. నాదెండ్ల ఎపిసోడ్ ఎన్టీఆర్ గొప్పదనాన్ని బాగా ఎలివేట్ చేస్తుందని అది ఉండాల్సిందే అని తేజ అన్నట్లుగా తెలుస్తోంది.

ఆ ఎపిసోడ్ వరకు ఉంచినట్లయితే.. తర్వాతి కథను ఎందుకు పక్కన పెట్టారనే విమర్శలు రాజకీయంగా ఎదురవుతాయని.. దానివల్ల చికాకులు తప్పవని కాబట్టి తొలిసారి సీఎం కావడం దగ్గరే కథను ఆపేయాలని బాలయ్య పట్టుబట్టినట్టుగా చెబుతున్నారు. ఆ రకమైన రాజకీయ అంశాలతో ముడిపడిన అభిప్రాయ భేదాలు కూడా ముదరడంతో తేజ తప్పుకోవాల్సి వచ్చిందని అంతా అనుకుంటున్నారు.