Advertisement


Home > Politics - Gossip
పవన్ నిజ నిర్థారణ కమిటీలో చీలిక..?

కమిటీని ఏర్పాటుచేసిన ఉద్దేశం మంచిదే కావొచ్చు. అందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మెచ్చుకోదగ్గదే. కానీ అందులో భాగంగా ప్రతిఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కమిటీ అన్న తర్వాత అధ్యక్షత వహించడం కామనే. కానీ ఓ ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చుట్టూ కమిటీ తిరిగితే అది కచ్చితంగా చీలికలకు దారితీస్తుంది. పవన్ పెట్టిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (సంయుక్త నిజనిర్థాకరణ కమిటీ)లో ఇప్పుడు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

కమిటీని ఏర్పాటుచేసిన పవన్ ను మినహాయిస్తే.. అందులో ఉన్న జయప్రకాష్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్ మొత్తం కమిటీని తమ చేతుల్లోకి తీసుకున్నట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ్ తన వాక్చాతుర్యంతో, మిగతా వాళ్లను డామినేట్ చేస్తున్నట్టు కమిటీలోని సభ్యులే కొందరు గుసగుసలాడుకుంటున్నారు. దీనికి వాళ్లు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. 

ఇందులో ముఖ్యమైనది కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్రం వివరాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ జేపీ వ్యాఖ్యానించడం. కమిటీలో ఎక్కువమంది సభ్యులు దీన్ని విభేదిస్తున్నారు. మరీ ముఖ్యంగా మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కీలకమైన ఈ అంశాన్ని జేఎఫ్ సీ వదిలేయడం తనకు చాలా అసంతృప్తిని మిగిల్చిందని ఆయన నిన్న ఆఫ్ ది రికార్డు వ్యాఖ్యానించారు. కాకపోతే సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలగకూడదని తను మౌనంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 

ఐవీఆర్ తో పాటు మరో ఇద్దరు మహిళా సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కేవలం ఉండవల్లి, జేపీ చుట్టూ కమిటీ తిరగడం బాగాలేదని అంటున్నారు. కేంద్రం ఏపీకి ఎన్ని నిధులిచ్చింది, ఇంకా ఎన్ని నిధులివ్వాలి లాంటి అంశాలపై చర్చ కోసమైతే కమిటీని ఏర్పాటుచేయాల్సిన అవసరంలేదని, ఓ ఎకౌంటెంట్ ను పెట్టుకుంటే సరిపోతుందని వాళ్లు అంటున్నారు. ఇచ్చిన నిధులను చంద్రబాబు సర్కార్ ఎలా వాడింది, యుటిలైజేషన్ సర్టిఫికేట్ ను కేంద్రానికి ఎందుకివ్వలేదు లాంటి అంశాలపై దృష్టిపెడితే రాష్ట్రానికి మరింత న్యాయం జరుగుతుందని వాళ్లు అంటున్నారు. 

చూస్తుంటే.. వచ్చే సమావేశాల్లో నిజనిర్థారణ కమిటీలో కూడా చీలక వస్తుందేమో అనిపిస్తోంది. ఈ గ్యాప్ లో వ్యవహారం కాస్తా అవిశ్వాసం టర్న్ తీసుకోవడంతో.. ఈ అంశానికి ప్రాధాన్యం తగ్గింది.