cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీడీపీ మెడపై 'కోడి' కత్తి

టీడీపీ మెడపై 'కోడి' కత్తి

అటు తిరిగి, ఇటు తిరిగి 'కోడి' కత్తి, తెలుగుదేశం పార్టీ మెడపై రాజకీయంగా వేటు వేసేలానే కన్పిస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నాన్ని 'పబ్లిసిటీ స్టంట్‌'గా టీడీపీ కొట్టిపారేస్తూ వస్తోన్న విషయం విదితమే. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. ఇలా ప్రభుత్వంలో అతి 'ముఖ్యులు' మొదటిరోజు, మొదటి రెండు మూడు గంటల్లోనే ఈ హత్యాయత్నాన్ని నీరుగార్చేలా స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు.

ఇప్పుడీ విషయం న్యాయస్థానానికి చేరింది. న్యాయస్థానం, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ, రాష్ట్ర డీజీపీ.. ఇలా పలువురికి నోటీసులు జారీచేసిన విషయం విదితమే. ప్రతిపక్ష నేత మీద ఈగవాలినా, బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. కానీ, ముఖ్యమంత్రే నిర్లక్ష్యంగా ఈ దాడిని 'పబ్లిసిటీ స్టంట్‌'గా అభివర్ణించడం, దానికి డీజీపీ సైతం వంత పాడటం, హోంమంత్రీ అదే బాటలో వ్యవహరించడంతో.. ఈ కేసులో ఈ ముగ్గురిపైనా సామాన్యుల్లో 'ఏవగింపు' పెరిగిపోయింది.

దాడిచేసిన నిందితుడ్ని వైఎస్సార్సీపీ కార్యకర్త అనీ, జగన్‌ అభిమాని అనీ.. ఘటన జరిగిన వెంటనే ప్రచారంలోకి తీసుకురావడం కూడా 'కుట్ర కోణం'లో భాగమేనన్నది వైఎస్సార్సీపీ వాదన. తృటిలో ప్రాణాపాయం తప్పిందిగానీ, లేదంటే జరగరాని ఘోరం జరిగిపోయేదేనని సాక్షాత్తూ వైఎస్‌ జగన్‌ తల్లి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ఇటు వైఎస్సార్సీపీ అనుమానాలు, అటు న్యాయస్థానం నోటీసులు.. వెరసి, అధికార పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయ్యింది పరిస్థితి.

మామూలుగా అయితే ఇలాంటి కేసుల్ని 'మమ' అన్పించేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అయితే, వైసీపీ తమ అధినేతపై జరిగిన హత్యాయత్నాన్ని లైట్‌ తీసుకునే పరిస్థితుల్లో లేదు. జాతీయ స్థాయిలో చంద్రబాబు సర్కార్‌ తీరుని ఎండగడ్తోంది. ఫిర్యాదు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గరకూ వెళ్ళింది. ఈ కేసులో 'ఎ1 నిందితుడు చంద్రబాబే' అని వైసీపీ ఆరోపిస్తోంది. దాడి ఎవరు చేశారు.? ఎందుకు చేశారు.? అన్న విషయాలు విచారణలో తేలతాయేమోగానీ.. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే.. నిర్లక్ష్యంగా మాట్లాడిన పాపానికి, చంద్రబాబు అండ్‌ టీమ్‌.. ప్రజాకోర్టులో శిక్ష అనుభవించక తప్పేలాలేదు.

వివాదం ముదిరి పాకాన పడ్తున్న దరిమిలా, 2019 ఎన్నికల ప్రచారంలోనూ జగన్‌పై హత్యాయత్నం - టీడీపీ నిస్సిగ్గు రాజకీయం అనే అంశం కూడా హైలైట్‌ అయ్యే అవకాశాల్లేకపోలేదు. అదే జరిగితే, జగన్‌ విషయంలో గతి తప్పిన కోడి కత్తి, టీడీపీ మెడ మీద గట్టిగానే పడనుందన్నది నిర్వివాదాంశం.

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్