cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీడీపీకి కొర‌క‌రాని కొయ్య జీవీఎల్

టీడీపీకి కొర‌క‌రాని కొయ్య జీవీఎల్

టీడీపీ నేత‌ల‌కు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి , రాజ్యస‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు కొర‌క‌రాని కొయ్యగా మారారు. ఎవ‌రినైనా మాయచేసే విద్యలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆరితేరార‌నే పేరు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా ఆర్థిక‌ప‌ర‌మైన ఆరోప‌ణలు జీవీఎల్ చేస్తున్నారు. బీజేపీ-టీడీపీ మ‌ధ్య మైత్రీబంధం తెగిపోయిన త‌ర్వాత జీవీఎల్ న‌ర‌సింహారావు తెర‌పైకి వ‌చ్చారు. అంత వ‌ర‌కూ తెలుగు రాష్ర్టాల్లో ఆయ‌న పేరు విన్నవారు లేరు. ప్రకాశంజిల్లా వాసైన జీవీఎల్ 30ఏళ్ల క్రిత‌మే ఢిల్లీ వెళ్లి కేంద్ర రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇటీవ‌లే ఆయ‌న ఉత్తర‌ప్రదేశ్ నుంచి రాజ్యస‌భ‌కు ఎన్నిక‌య్యారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై మ‌య‌స‌భ నిర్మిస్తున్నారా అని జీవీఎల్ కామెంట్ చేసి వివాదాస్పద‌మ‌య్యారు. నాటి నుంచి మొద‌లైన ఆయ‌న మాట‌లదాడి, ప్రత్యర్థుల ప్రతిదాడుల మ‌ధ్య జీవీఎల్ పేరు మార్మోగుతోంది. ఇటీవ‌ల చంద్రబాబు ప్రభుత్వంపై ప‌ర్సన‌ల్ డిపాజిట్స్ (పీడీ) అకౌంట్లు, డ‌బ్బు ఖ‌ర్చులో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించారు. అంతేకాదండోయ్‌... యూపీఏ హ‌యాంలో కేంద్రంలో 2జీ కుంభ‌కోణం కంటే పెద్ద కుంభ‌కోణం చంద్రబాబు స‌ర్కార్‌లో జ‌రిగింద‌ని, రాష్ర్టంలో ప‌ర్సన‌ల్ డిపాజిట్స్ (పీడీ) కుంభ‌కోణం అతి పెద్దద‌ని అవినీతి ఆటంబాబు వేశారు.

అధికారుల ప‌ర్సన‌ల్ ఖాతాల్లోకి రూ.55వేల కోట్లు పంప‌డం ఏంటి? అని ప్రశ్న వేసి భారీ అవినీతికి పాల్పడ్డార‌నే విమ‌ర్శలతో టీడీపీ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. లాలూప్రసాద్ యాద‌వ్ కంటే మ‌రింత కిందికి దిగ‌జారార‌ని టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ‌రావును షేర్ మార్కెట్ బ్రోక‌ర్ అని తీవ్ర ప‌ద‌జాలంతో దూషించారు. దీనికి ప్రతిగా బుడ‌బుక్కలోడు అని జీవీఎల్ ఆరోప‌ణ‌ల‌ను కుటుంబ‌రావు దీటుగా తిప్పికొట్టారు. మీకు (ప్రభుత్వ పెద్దల‌కు) ఏమాత్రం సిగ్గు, శ‌రం లేదా?. ఈ నిధుల‌పై జ‌వాబు చెప్పే వ‌ర‌కు ప్రజాకోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటాన‌ని జీవీఎల్ హెచ్చరించారు.

ఇదిలా ర‌చ్చ కొన‌సాగుతుండ‌గా ఢిల్లీలో రైల్‌భ‌వ‌న్‌లో రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయ‌ల్ ఎదుట టీడీపీ ఎంపీలు, రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీ జీవీఎల్  ప‌ర‌స్పరం నువ్వెంత అంటే నువ్వెంత అని స‌వాల్ విసురుకున్నారు. నిన్ను ఆంధ్రాలో తిర‌గ‌నివ్వమ‌ని టీడీపీ నేత‌లు హెచ్చరించ‌గా, తేల్చుకుందాం రండి, ఏం చేస్తారో చూద్దాం అని అంతే తీవ్రస్థాయిలో జీవీఎల్ కౌంట‌ర్ ఇచ్చారు.

ఇదంతా విశాఖ రైల్వేజోన్, వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఇచ్చిన రూ.350 కోట్ల సొమ్మును వెన‌క్కి తీసుకోవ‌డంపై మంత్రిని అడ‌గ‌డానికి సుజ‌నాచౌద‌రి, అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, అవంతిశ్రీ‌నివాస్‌, క‌ళా వెంక‌ట్రావ్ త‌దిత‌రులు వెళ్లిన‌ప్పుడు చోటు చేసుకొంది. త‌మ‌పై దాడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం ఒక ప‌థ‌కం ప్రకార‌మే జీవీఎల్‌ను ప్రోత్సహిస్తోంద‌ని టీడీపీ ఆవేద‌న చెందుతోంది.

రాష్ర్ట ప‌భుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోప‌ణ‌లు చేస్తున్న వారిపై కేసులు పెట్టేందుకు న్యాయ స‌ల‌హా తీసుకుంటున్నామ‌ని కుటుంబ‌రావు అంటున్నారంటే చంద్రబాబు ఎంత మ‌ద‌న‌ప‌డుతున్నదో అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి నిజానిజాల‌ను ప‌క్కన పెడితే బాబు స‌ర్కార్ అవినీతికి పాల్పడుతోంద‌నే సందేశం జీవీఎల్, ఇత‌ర నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు తీసుకెళుతున్నట్టు రాష్ర్ట ప్రభుత్వ పెద్దలు ఆందోళ‌న చెందుతున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీ మ‌ధ్య వైరం ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.