Advertisement


Home > Politics - Gossip
వైసీపీపై అనుమాన‌మే నిజ‌మైంది

ఎన్‌డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేస్తామ‌ని మొద‌టి నుంచి చెబుతున్నప్పటికీ, అంతేబ‌లంగా విప‌క్షాల అభ్యర్థికి ఓటు వేస్తామ‌ని వైసీపీ స్పష్టం చేయ‌క‌పోవ‌డంపై ప‌లు అనుమానాలు వ్యక్తమ‌వుతూ వ‌చ్చాయి. చాలామంది అనుమానించిన‌ట్టుగానే విప‌క్షాల త‌ర‌పున కాంగ్రెస్ అభ్యర్థి హ‌రిప్రసాద్‌కు కూడా ఓటు వేసేదిలేద‌ని వైసీపీ రాజ్యస‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి స్పష్టంచేశారు. వైసీపీ అనూహ్య నిర్ణయం అంద‌రినీ ఆశ్చర్యానికి లోనుచేసింది. మోడీతో వైసీపీకి స‌న్నిహిత సంబంధాలున్నాయ‌ని, రాజ్యస‌భ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌లో కూడా ఎన్‌డీఏ అభ్యర్థికి వైసీపీ మ‌ద్దతు ప‌లుకుతుంద‌ని టీడీపీ ఆరోప‌ణ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.

టీడీపీ విమ‌ర్శల‌ను వైసీపీ తిప్పికొడుతూ తాము ఎట్టిప‌రిస్థితుల్లోనూ బీజేపీకి ఓటు వేసే ప్రస‌క్తేలేద‌ని స్పష్టంచేసింది. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల అభ్యర్థికి మ‌ద్దతు ఇస్తామ‌ని ఎన్నిక ప్రక్రియ కావ‌ల‌సిన కొద్దిసేప‌టి వ‌ర‌కు కూడా విజ‌య‌సాయిరెడ్డి చెబుతూ వ‌చ్చారు. ఆ త‌ర్వాత వైసీపీ వ్యూహం మార్చుకొంది. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌, బీజేపీల‌కు స‌మానదూరం పాటించాల‌ని నిర్ణయించుకున్నట్టు విజ‌యసాయిరెడ్డి తెలిపారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నామ‌న్నారు.

ఢిల్లీలో విజయసాయిరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీలు రెండూ ఏపీకి తీరని ద్రోహాన్ని చేశాయన్నారు. అందులో రెండోమాట‌కు తావులేద‌న్నారు. ఈ కార‌ణంగానే రాజ్యస‌భ‌ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓట్లు వేయవద్దని నిర్ణయించుకున్నట్లు వివరించారు. విభ‌జిత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ తీర‌ని ద్రోహం చేసిందన్నారు.

ప్రత్యేకహోదా అంశాన్ని విభజన చట్టంలో పొందుపరచకుండా రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కేవలం మాటగా చెప్పారన్నారు. ఈ విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి తీరనిద్రోహం చేసిందన్నారు. మరోవైపు పదేళ్లుహోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ మాట నిల‌బెట్టుకోకుండా ద్రోహం చేసిందని దుయ్యబ‌ట్టారు. రాష్ర్టానికి ద్రోహం చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో టీడీపీ కుమ్మక్కైందని ఆయన ధ్వజ‌మెత్తారు.

ఇదిలా ఉండ‌గా గుంటూరులో వంచ‌న‌పై గ‌ర్జన స‌భ‌లో వైసీపీ సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వర్లు మాట్లాడుతూ తాము బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నార‌ని, రాజ్యస‌భ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌లో విప‌క్షాల అభ్యర్థికి ఓటువేసి త‌మ చిత్తశుద్ధిని చాటుకుంటామ‌న‌డం గ‌మ‌నార్హం.

అప్పటికి పార్టీ నిర్ణయం ఆయ‌న‌కు దృష్టికి రాలేద‌నే విష‌యం అర్థమ‌వుతుంది. దీన్నిబ‌ట్టి అప్పటిక‌ప్పుడు పార్టీ వ్యూహం మార్చుకుని నిర్ణయం ప్రక‌టించింద‌ని తెలుస్తోంది.