cloudfront

Advertisement


Home > Politics - Political News

అమరావతి మాటెత్తితే ఒట్టు!

అమరావతి మాటెత్తితే ఒట్టు!

-అమరావతి ప్రస్తావన లేని ఎన్నికలు!
-నాలుగున్నరేళ్ల పాటు హడావుడి చేసిన బాబు
-విదేశాలకు లెక్కలేనన్ని పర్యటనలు
-గత ఎన్నికల ముందు నుంచినే హంగామా
-మరి ఐదేళ్లలో సాధించింది ఏమిటి?
-ఎన్నికల సమయంలో ఆ ఊసేఎత్తని చంద్రబాబు!

గత ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఏం అచ్చేసింది? విభజనతో రాజధానిని కోల్పోయిన సీమాంధ్రను సింగపూర్‌ను చేస్తామని, సింగపూర్‌ లాంటి రాజధానిని తయారు చేస్తామనే కదా? ఈ విషయంలో ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? గత ఎన్నికల ముందు.. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా సింగపూర్‌ ప్రస్తావన చేసినట్టుగా మరే అంశాన్నీ ప్రస్తావించలేదు. సీమాంధ్ర- సింగపూర్‌ అనేప్రాస కూడా కుదిరిందని బాగా హడావుడి చేశారు. చంద్రబాబు అనుభవం అని, చంద్రబాబుకు అధికారం ఇవ్వాలని, రాజధానిని నిర్మించడం అనేది చంద్రబాబు నాయుడుకు చిటికెలో పని అని, హైదరాబాద్‌ను కట్టిన తాపీమేస్త్రీ ఆయనేనని తెలుగుదేశం వాళ్లు హడావుడి చేశారు. చంద్రబాబు నాయుడు కూడా తనకు అధికారం ఇస్తేచాలు.. చిటికెలో రాజధానిని నిర్మించి పెట్టడమే అని ప్రచారం చేసుకున్నారు. ఈ విషయంలో బాబు వీరాభిమానులు చిటికెలు వేసి మరీ చెప్పారు.

ఇదంతా గత ఎన్నికల ముందుకథ. ఈ కథలతోనే ఓట్లను పొందారు. తీరా.. ఎన్నికలు అయ్యాకా చేసింది ఏమిటి అంటే.. చిటికెల పందిళ్లు వేయడమే! వేల ఎకరాల భూములను సేకరించి.. ఆ భూముల్లో అది ఇక్కడ, ఇది అక్కడ.. అంటూ చిటికెల పందిళ్లు వేశారు. ఐదేళ్లు చిటికెల పందిళ్లు వేయడమే సరిపోయింది. తీరా మళ్లీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో.. అమరావతి ఊసే తెలుగుదేశం పార్టీ ఎత్తడంలేదు. గత ఎన్నికల ప్రచారంలో రాజధాని అంశం గురించి ప్రముఖంగా పేర్కొని.. ఇప్పుడుమాత్రం దాని ఊసే ఎత్తకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడి అసమర్థతగా కాదా? బాబే సమర్థుడు అని రాజధాని గురించి కాకమ్మ కబుర్లు చెప్పి, ఇప్పుడు రాజధాని గురించి మాటే ఎత్తకపోవడం, ఐదేళ్లలో రాజధాని విషయంలో సాధించిన ప్రగతి ఏమిటో చెప్పకుండా.. ఏవేవో మాట్లాడుతూ.. ఓటు అడుగుతూ ఉండటాన్ని ఏమనాలి? మోసం అని కాదా? అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!

అమరావతి కథలే వేరు!
సత్యం శంకరమంచి రచించిన 'అమరావతి కథలు'కు మించిన వినోదాన్ని అందించాయి చంద్రబాబు నాయుడు చెప్పిన అమరావతి కథలు. బాబు తరఫున చిడతలు పట్టుకుని వాయించే అనుకూల మీడియా.. ఈ విషయంలో ఎన్నో కట్టు కథలు చెప్పింది. అవి అంతులేని కథలుగా నిలిచాయి. అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్ని దేశాల్లో పర్యటించారో కూడా అందరికీ తెలిసిందే. ఒకటా రెండా.. సింగపూర్‌కు అయితే లెక్కకు మించిన పర్యటనలు. ఆఖరికి అధికారులు కూడా సింగపూర్‌కు వెళ్లి, అక్కడే మకాం పెట్టారు. మంత్రి నారాయణ, లోకేష్‌ బాబు లాంటివాళ్లు సింగపూర్‌కు వెళ్లి రావడం అంటే.. ఏదేదో పుంగనూరుకు వెళ్లివచ్చినంత ఈజీగా తిరిగారు.

ఇక అమరావతి మోడల్స్‌ కోసం.. బ్రిటన్‌, సౌత్‌కొరియా, జపాన్‌, చైనా వంటి దేశాలన్నీ చుట్టేశారు. ఆయా దేశాల్లో ఏవైతే ఫేమస్సో వాటన్నింటినీ అమరావతికి తెచ్చేస్తు ఉన్నట్టుగా బాబుగారు కలరింగ్‌ ఇచ్చారు. లండన్‌కు వెళితే అమరావతికి లండన్‌ ఐ, చైనాకు వెళ్లినప్పుడేమో అమరావతికి బుల్లెట్‌ట్రైన్‌, మరో దేశానికి వెళితే అమరావతికి హైపర్‌లూప్‌.. ఈ మాటలన్నీ చిన్నవే. వీటికి గురించి తెలుగుదేశం అనుకూల మీడియా పుంఖానుపుంఖాలుగా రాయడం, అవి చదివి జనాలు ఏవేవో ఊహించుకోవడం. ఐదేళ్లపాటు రాజధాని విషయంలో ఇలాంటి హైడ్రామాను నడిపించారు!

గ్రాఫిక్స్‌ మరోవైపు!
విదేశాలు చుట్టేసి.. ఆయా దేశాల్లోని ప్రసిద్ధమైన వాటి పేరుచెప్పి అమరావతి విషయంలో జనాలను అభూత కల్పనల్లో ముంచెత్తడం ఒకఎత్తు అయితే, గ్రాఫిక్స్‌ గందరగోళం మరోవైపు. అమరావతి నవనగరాల నగరం అంటూ.. వాటిల్లో ఒక్కోటి ఆదిరిపోయేడిజైన్లలో ఉంటాయంటూ.. మరింతకాలం మభ్యపెట్టారు.ఆఖరికి ఈ వ్యవహారంలో చదువూసంధ్యల్లేని సినిమా డైరెక్టర్లను కూడా ఇన్‌వాల్వ్‌ చేశారు. వాళ్ల దర్శకత్వంలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి డిజైన్ల రూపకల్పన అని పక్కగా ప్రజల చెవుల్లో పూలు పెట్టేమాటలు చెప్పారు.

ఆఖరికి సదరు సినిమా దర్శకులే సిగ్గుపడ్డారు. తామేంటి.. రాజధాని నిర్మాణానికి రూపురేఖలను డిజైన్‌ చేయడం ఏమిటని.. వారే భయపడ్డారు. అయితే తను ఏంచెబితే అదే జనాలు నమ్ముతారు, జనాలను ఎంతగా అయినా భ్రమల్లోకి తీసుకెళ్లగల తన సామర్థ్యం మీద అతి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు మాత్రం ఆ విషయాల్లో భయపడలేదని పరిశీలకులు అంటారు. అనుకూల మీడియా ఉంది కదా అనిచెప్పి మరీ అడ్డగోలుగా వెళ్లిపోయారని.. అమరావతిని ఒక భ్రమగా, భ్రమరావతిగా మిగిల్చారని స్పష్టం అవుతూనే ఉంది.

ఇంతకీ సాధించింది ఏమిటి?
ఇప్పటివరకూ అమరావతి విషయంలో సాధించింది ఏమిటి అంటే.. ఏమీలేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, బోలెడన్ని శిలా ఫలకాలు! అమరావతి గ్రాఫిక్స్‌కు సంబంధించి ఒక ఎమ్యూజ్‌మెంట్‌ నిర్మాణం. ఇదీ సాధించింది. తాత్కాలిక సచివాలయం నాణ్యత ఏమిటో కూడా ప్రజలకు స్పష్టం అయ్యింది. చిన్నపాటి వర్షాలకే తాత్కాలిక సచివాలయం కారింది. వెయ్యికోట్ల రూపాయలు ఖర్చుచేసి చేపట్టిన ఆ నిర్మాణం నాణ్యత ఏమిటో ఆ విధంగా స్పష్టం అయ్యింది. తాత్కాలిక సచివాలయం లీకుల విషయంలో రకరకాల కహానీలు చెప్పారు. అది కూడా ప్రతిపక్షనేత కుట్ర అని నవ్వుల పాలయ్యారు. ఆ తర్వాతి వర్షాలకు కూడా అది కారడం ఆగకపోవడంతో.. అసలు కథ బయటపడిపోయింది. వర్షంతో బాబుగారి మార్కు ప్రగతి ఏమిటో రంగు వెలసి దర్శనమిచ్చింది. ఒక రాష్ట్ర బడ్జెట్‌ను ఉపయోగించుకుని.. ఒక చిన్నపాటి సచివాలయం, అంతేస్థాయి అసెంబ్లీ కట్టడం ఏమాత్రం విషయం కాదు. ఇవి చాలా చాలా చిన్న విషయాలు. అవి చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో సాధించింది!

కబుర్లు చెప్పమని అడిగితే.. చంద్రబాబు నాయుడుకు హద్దే ఉండదు. అమరావతిని అలా ఉండబోతోంది, ఇలా ఉండబోతోంది.. అంటూ బాబుగారు చెప్పేమాటలకు అడ్డుకట్ట ఉండదు. ఆ మాటలకూ ఐదేళ్లలో సాధించిన దానికి.. పొంతన ఉండదు. ఐదేళ్లలో సాధించిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. బాబుగారు చెప్పేమాటలు నిజం కావడానికి మరో ఐదువందల సంత్సరాలు పట్టినా పెద్దగా ఆశ్చర్యం ఉండదు! బాబు మాటల గారడీకి, వాస్తవానికి అంత తేడా ఉంది!

ఎన్నికల సమయంలో ఆ ఊసేలేదు!
తమ గత ఐదేళ్ల పాలనలో అమరావతి గురించి ఫలానావి సాధించామని చెప్పి.. మరోసారి తమకు అవకాశం ఇస్తే ఫలానావి సాధించబోతున్నట్టుగా చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ముందుకు రావడంలేదు? ఎందుకు ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబు నాయుడు అమరావతి ఊసు తీసుకురావడం లేదు? అమరావతి పేరే ఎత్తకుండా ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు? ప్రజలకు పెట్టిన పప్పుబెల్లాల గురించి మాట్లాడుతున్నారు కానీ.. పండగకు మగ్గిపోయిన గోధుమపిండి, పురుగులు పట్టిన బెల్లం ఇవ్వడం గొప్ప అని చెబుతున్నారు కానీ.. అమరావతి ఊసు ఎత్తడంలేదు. అసలు ఏదైనా సాధించి ఉంటే.. అమరావతి ఏమైనా అభివృద్ధి జరిగి ఉంటే.. చంద్రబాబు నాయుడు అస్సలు వదిలేవారు కాదని, దాన్ని గోరంతలను కొండంతలు చేసి చెప్పుకునే వాళ్లని, గోరంత కూడా ఏమీ జరగలేదు కాబట్టి బాబు అమరావతి ఊసే ఎత్తడంలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గ్రాఫిక్స్‌ కూడా రెడీ చేయలేకపోవడంతో.. కనీసం వాటిని చూపించి అయినా జనాలను భ్రమల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ వెనుకబడిందని.. ఓవరాల్‌గా అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు కథ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందని, అందుకే ఆ మాటే ఎత్తడం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేవలం అమరావతి అని మాత్రమేకాదు.. ఐదేళ్లలో బాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో పురోగమనం శూన్యమని.. పప్పుబెల్లాలు పెట్టిన పాలనసాగించి, గతంలో వైఎస్‌ ఆధ్వర్యంలో మొదలైన సంక్షేమ పథకాలను కొంతశాతం అమలుచేసి.. విదేశాలు తిరుగుతూ పొద్దుపుచ్చిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తను ఏంచేసింది చెప్పుకోలేక.. వాళ్ల మీద వీళ్ల మీద నెపాలు వేస్తూ, వాళ్లనూ వీళ్లను బూచిగా చూపుతూ సాగుతున్నారని... విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!