Advertisement


Home > Politics - Political News
అసలు ఆట ఇప్పుడు మొదలైంది

తన అను'కుల' మీడియా మనం ఎలా రాయమంటే అలా రాస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రలో నడిచిపోతోంది. కానీ తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్. నిత్యం పత్రికల్లో మాత్రం పోరాటం ఆగదు, పోరాటం ఆగదు అని కనిపిస్తూ వుంటుంది.

కానీ వాస్తవానికి తెలుగుదేశం ఏ పోరాటం చేస్తోందో ఎక్కడా కనిపించదు. రాస్తారోకోలా? ధర్నాలా? రాజీనామాలా? మరేమైనా విధమైన పోరాటమా? ఎక్కడా వుండదు. కానీ రోజూ పెద్ద అక్షరాలతో దాదాపు అదే హెడ్డింగ్.

ఇలా మీడియా దాదాపుగా ఇదే పోకడ పోతున్నా కాంగ్రెస్ నాయకులు అయితేనేం, వైకాపా నేత జగన్ అయితేనేం తెలుగుదేశం పార్టీని భలే కార్నర్ లోకి నెట్టగలుగుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు జై రామ్ రమేష్ భలే మాట అన్నారు. మమ్మల్ని అడ్డగోలుగా విడగొట్టారు, సరిగ్గా చట్టం తయారుచేయలేదు అంటున్నారు కదా? సరే, కాంగ్రెస్ తప్పు చేసింది... తెలుగు ప్రజలు శిక్షించారనుకుందాం... మరి ఇప్పుడు భాజపా చేతిలో మెజారిటీ అధికారం వుంది. న్యాయం చేయవచ్చు కదా? మీకు నచ్చిన చట్టం మీరు చేయవచ్చు కదా? అన్నారు.

అది ఆలోచించదగ్గ మాటే కదా? కానీ దానికి తెలుగుదేశం నాయకులు భలే రివర్స్ అవుతున్నారు. జైరామ్ రమేష్ చేసిందంతా చేసి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని, ఆయనకు అస్సలు మాట్లాడే హక్కు లేదని, ఆయన చెత్త చేస్తే తాము సరిచేయాలా? అని అడుగుతున్నారు. కాంగ్రెస్ చెత్త చేసింది కాబట్టే కదా? భాజపా, తెదేపాలను ఎన్నుకున్నది? మరి సరిచేయాలి కదా? అన్న రూట్ లో ఆలోచించరేమిటో?

సరే, ఆ సంగతి అలా వుంచితే, రాజీనామాలు కాదు, అవిశ్వాసం ముఖ్యం అంటూ ఆంధ్రజ్యోతి, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం కలిసి వైకాపాను కార్నర్ లోకి తోసే ప్రయత్నం చేసాయి. దానికీ కౌంటర్ పడింది. దానికి తాము రెడీ అని, మద్దతు ఇవ్వడానికి మీరు రెడీనా అని వైఎస్ జగన్ అడగనే అడిగారు. ఇప్పుడు బంతి వెళ్లి జనసేన, తెలుగుదేశం పార్టీల కోర్టులో పడింది. వాళ్లు సమాధానం చెప్పాలి. లేదా అడ్డగోలుగా ఏదో ఒకటి మాట్లాడుతారో చూడాలి.

అయినా తెలుగుదేశం పార్టీ జనాలు ఏం మాట్లాడినా, మర్నాడు 'మన' పత్రికల్లో మాత్రం మళ్లీ అదే శీర్షిక 'పోరు ఆగదు'. అంతేకదా మరి.