Advertisement


Home > Politics - Political News
బీజేపీకి ఆదర్శం.. బాబు, కేసీఆర్‌లే!!

ఒకవైపు కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ కామెడీలు చేస్తున్నాడు చంద్రబాబు నాయడు. అక్కడ బీజేపీ అనైతికంగా వ్యవహరించింది అని బాబు అంటున్నారు. అక్కడ బీజేపీ అనైతికంగా వ్యవహరించిందనేది నిజమే కావొచ్చు కానీ, చంద్రబాబుకు మాత్రం నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి.. రాజ్యాంగ విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబు మాట్లాడటానికి మించిన ప్రహసనం ఇంకోటి ఉండదు. అయితే నవ్వి పోదురుగాక నాకేంటి.. అనుకునే చంద్రబాబు నాయుడు కర్ణాటకలో విలువల హననం అంటూ మాట్లాడుతున్నాడు. తనదైన కామెడీని చేస్తున్నాడు. తను చేస్తే సంసారం, వేరే వాళ్లు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా బాబు మాట్లాడుతున్నాడు.

కానీ అసలు సంగతి ఏమిటంటే, కర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఆఖరి వరకూ ప్రయత్నించిన బీజేపీకి ఆదర్శం చంద్రబాబు, కేసీఆర్‌లే అని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా బీజేపీ నేతలే సెలవిచ్చారు. అసెంబ్లీ సమావేశానికి ముందు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలు ఏపీ, తెలంగాణ పరిణామాలను ప్రస్తావించారు.

ఎమ్మెల్యేలకు చేసిన ఫోన్ కాల్స్‌లో ఏపీ, తెలంగాణ పరిణామాలు చర్చకు వచ్చాయి. ఇప్పుడు ఫిరాయించి బీజేపీకి మద్దతు పలికితే తమపై అనర్హత వేటు పడుతుందేమో.. అసలే తమ నియోజకవర్గాలో ప్రత్యర్థులు బలమైన వాళ్లు.. అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించగా, బీజేపీ నేత మురళీధరరావు ఏపీ, తెలంగాణలను గుర్తు చేశాడు ఫోన్ కాల్స్‌లో. ‘అనర్హత వేటు భయం వద్దు.. ఏపీలో ఎమ్మెల్యేలు ఫిరాయించారు. తెలంగాణలో ఫిరాయించారు.. వారిపై అనర్హత వేటు పడిందా?’ అని మురళీధర్ రావు ఆ ఫోన్ కాల్స్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించడం గమనార్హం.

ఏపీలో, తెలంగాణలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడలేదు కాబట్టి.. మీపై కూడా పడదని ఆయన అక్కడ హామీ ఇచ్చాడు. ఇదీ కథ. ఒకవైపు చంద్రబాబు ఏమో కర్ణాకటలో ప్రజాస్వామ్యానికి పాతర అంటుంటే.. దీనికి ఆదర్శపురుషుడుగా చంద్రబాబు పేరునే ప్రముఖంగా వాడుకున్నారు బీజేపీ నేతలు.