cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబు Vs కేసీఆర్: ఐదేళ్ల ప్రొగ్రెస్ రిపోర్ట్

చంద్రబాబు Vs కేసీఆర్: ఐదేళ్ల ప్రొగ్రెస్ రిపోర్ట్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు, కేసీఆర్ తొలి ముఖ్యమంత్రులు అయ్యారు. తెలంగాణలో ఉద్యమానికి ప్రజలు బాసటగా నిలిస్తే, ఏపీలో ప్రజలు అనుభవాన్ని గుడ్డిగా నమ్మి ఓటు వేశారు. ఐదేళ్లు తిరిగేసరికి ప్రజాభిప్రాయంలో పూర్తిగా తేడా వచ్చింది. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ పై నమ్మకం పెంచుకుంటే, ఏపీ ప్రజలు నిన్ను నమ్మం బాబూ అంటూ రివర్స్ అయ్యారు. అక్కడ వారి నమ్మకం నిలబడింది, ఇక్కడి ప్రజలకు జ్ఞానోదయం అయింది. కేసీఆర్ రెండోసారి విజయకేతనం ఎగరేశారు, బాబు ఓటమి అంచున నిలబడ్డారు.

ఐదేళ్లకాలంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే ఆయన విజయానికి కారణం అయ్యాయి. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా, కాంగ్రెస్ నేతలు దొరలపాలన అనిఎద్దేవా చేసినా కేసీఆర్ ని ప్రజలు మరోసారి ఆమోదించారు. మునుపటి కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. అంటే అక్కడ అభివృద్ధి జరిగినట్టే లెక్క. పైగా ప్రతిపక్షమే లేకుండా తెలంగాణలో ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నారు. టీడీపీ, కాంగ్రెస్ సీనియర్లు కూడా పార్టీలను వీడి టీఆర్ఎస్ తరపున ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం కేసీఆర్ ఆడుతున్న మైండ్ గేమ్.

రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నిటినీ పూర్తిగా బలహీనపరిచి మరో 20ఏళ్లపాటు తనకి తిరుగులేకుండా చేసుకుంటున్నారు కేసీఆర్. ఇక చంద్రాబు విషయానికొస్తే ప్రత్యేకహోదా విషయంలో బాబు దారుణంగా విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా ఈ విషయంలో చంద్రబాబు కాస్తా "యూటర్న్ బాబు" అనిపించుకున్నారు. పథకాలన్నీ బెడిసికొట్టాయి. రుణమాఫీ జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ భృతి టీడీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిపోతోంది. పింఛన్ల తొలగింపుతో అసలైన లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.

ఏపీ అప్పుల కుప్పలా తయారైంది. అమరావతి గ్రాఫిక్స్ కే పరిమితమని తేలింది. ఐదేళ్లలో కేసీఆర్ ఇమేజ్ అక్కడ రెట్టింపయితే, 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకి ఏపీలో పూర్తిగా పరాభవం ఎదురవుతోంది. ఎంపీ సీట్లకు అభ్యర్థులు కరువయ్యారు. ఎమ్మెల్యే స్థానాల్లో జాబితా విడుదలయ్యాక కూడా మాకొద్దు బాబు అంటూ టీడీపీ అభ్యర్థులు పార్టీని వదిలి పారిపోతున్నారు. దీన్నిబట్టే టీడీపీకి ఎంతలా ప్రజాదరణ తగ్గిందో అర్థమవుతోంది.

ఇక వారసుల విషయంలో కూడా కేసీఆర్, చంద్రబాబుకి ఈ ఐదేళ్లకాలం ఎంతో తేడా కనిపించింది. తండ్రిని మించిన తనయుడిగా, ఐటీమంత్రిగా కేటీఆర్ అక్కడ వారసత్వ పగ్గాలు అందిపుచ్చుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పగ్గాలు పుచ్చుకొని దూసుకుపోతున్నారు. ఇక్కడ దొడ్డిదారిన మంత్రిని చేసినా చినబాబు ఓనమాల దగ్గరే ఆగిపోయారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుచేసి ఎన్ని ట్రైనింగ్ లు ఇప్పించినా చినబాబు మాట మారలేదు. నాలుక మడత సరికాలేదు. దీంతో టీడీపీ భావి వారసత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

లోకేష్ సారథ్యం కచ్చితంగా ఫెయిలవుతుందనే ఉద్దేశంతో.. వయోభారం మీదపడుతున్నా ఈసారికి చంద్రబాబే ఎన్నికల రథాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు అందించిన అధికారాన్ని కేసీఆర్ గెలుపు బాటగా మలచుకుంటే.. చంద్రబాబు మాత్రం అధికార దుర్వినియోగం, కళ్లు బైర్లుకమ్మే అవినీతితో పాతాళానికి పడిపోయారు. ఈ ఐదేళ్లలో వచ్చిన స్పష్టమైన తేడా ఇదే.

అప్నా టైం ఆయేగా సాబ్ 

చెట్టు పేరుతో ఓట్లు అడుక్కోవడం.. ఎన్నాళ్లిలా