cloudfront

Advertisement


Home > Politics - Political News

ఎన్టీఆర్... చిరంజీవి.. పవన్.. తేడా సుస్పష్టం!

ఎన్టీఆర్... చిరంజీవి.. పవన్.. తేడా సుస్పష్టం!

సినిమాల్లో రాణించడం ఓ కళ. రాజకీయాల్లో రాణించడం మరో కళ. ఈ రెండింటినీ కలగలిపి రెండు రంగాల్లోనూ శిఖర సమానులుగా నిలిచిన వాళ్లను వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. తెలుగు సినిమా రంగానికి సంబంధించి ఆ గొప్పదనం ఎన్టీఆర్ తోనే ఆగిపోయింది, ఆయనొక్కరికే పరిమితం అయింది. సినిమాల్లో గొప్ప కరిష్మా ఉన్న కథానాయకులెవరూ రాజకీయ చదరంగంలో విజేతలుగా నిలవలేకపోయారు. ఎన్టీఆర్ తోపాటు.. సినీరంగం నుంచి చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు.

ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచారు. కానీ ఒక పార్టీకి, ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించేంత స్థాయి ఎవరికీ లేకపోయింది. చిరంజీవి ప్రజారాజ్యంతో ఎన్టీఆర్ స్థానాన్ని మెగాస్టార్ భర్తీ చేస్తారని ఓ అంచనా ఉన్నా.. అది ఆదిలోనే ఆవిరైపోయింది. చిరంజీవి ఓపిక పట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేం కానీ, కాంగ్రెస్ లో కలసిపోవడంతో ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇకపై చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేదిలేదు, వచ్చినా సాధించేది ఏమీలేదు. అంతెందుకు ఆయన్ను పట్టించుకునే వారు కూడా లేరు.

చిరు తర్వాత పవన్ కల్యాణ్ కాస్త సిన్సియర్ గా ప్రయత్నించారని కొందరికి అనిపించింది. ఎన్టీఆర్ లాగే రాష్ట్రానికి నాయకుడయ్యే మరో వెండతెర వేల్పు వచ్చారని అంచనాలు వేశారు. కానీ అదీ వర్కవుట్ కాలేదు. సాక్షాత్తూ పవన్ కల్యాణ్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా జనసేనకు మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదంటే.. పవన్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే చంద్రబాబు పార్టనర్, ఆ యాక్టర్ ని ఎవరూ నమ్మలేదు. పవన్ కల్యాణ్ పాతికేళ్లు వేచిచూసినా పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఏమీ ఉండదేమో.

అంతెందుకు.. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడని పేరున్న ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కి కూడా రాజకీయాలు కలిసిరాలేదు. టీడీపీ తరపున ఎన్టీఆర్ సుడిగాలి ప్రచారం చేసిన టైమ్ లో కూడా పార్టీ ఘోరపరాభవం పాలైంది. తాతను గుర్తుకు తెస్తూ ఖాకీ యూనిఫామ్ లో మనవడు హడావిడి చేసినా కూడా ఫలితం లేదు. ఎన్టీఆర్ కొడుకులు.. హరికృష్ణ, బాలకృష్ణ కూడా సినిమా నుంచి రాజకీయం వైపు అడుగులేసినా అవి తప్పటడుగులుగానే మిగిలిపోయాయి.

సో.. తెలుగు రాజకీయాల్లో చక్రంతిప్పిన నటుడిగా ఒక్క ఎన్టీఆర్ పేరే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇతర నటులంతా ఆ గట్టు నుంచి వచ్చినా ఆయన స్థాయిని మాత్రం అందుకోలేకపోయారు. ఇక ఎన్టీఆర్ సైతం.. సినిమాల్లో విజేతగా నిలిచి.. రాజకీయాల్లో అల్లుడి చేతులో వెన్నుపోటుకి గురై పరాజితగా కన్నుమూయడం విశేషం. అదే రాజకీయాలకూ.. సినిమా రంగానికీ ఉన్న తేడా. 

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?