cloudfront

Advertisement


Home > Politics - Political News

కరుణానిధి.. ద్రవిడ సూర్యుడు, తెలుగువాడు!

కరుణానిధి.. ద్రవిడ సూర్యుడు, తెలుగువాడు!

తమిళనాట కొన్ని లక్షల, కోట్ల మందికి ఎంతో కొంత తెలుగు నేఫథ్యం ఉంటుంది. వాళ్ల పూర్వికులు తెలుగు వాళ్లు. తెలుగు నాట నుంచి వలస వెళ్లిన వాళ్లు, రాష్ట్రాల విభజనల్లో బోలెడంత తెలుగు ప్రభావం ఉన్న ప్రాంతం ‘తమిళనాడు’ అయ్యింది. అలాంటి తెలుగు నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి కరుణానిధి కుటుంబం కూడా. ఇలాంటి కుటుంబాలు చాలా వరకూ తెలుగు ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ ఉంటాయి. మరి కొన్ని ఆ ఉనికిలోనే ఉంటాయి. వీళ్ల ఇళ్లలో తెలుగే మాట్లాడుకొంటూ ఉంటారు. కరుణానిధి కుటుంబం తెలుగును వదులుకుందో లేదో కానీ.. కరుణానిధి తల్లిదండ్రులు మాత్రం తెలుగు నేపథ్యం కలవారే. ఇలాంటి తెలుగు కుటుంబం నుంచి వచ్చిన కరుణానిధి.. తమిళ ఉద్యమ కర్త కావడం, ద్రవిడ సూర్యుడిగా వెలిగిపోవడమే చిత్రం.

పెరియార్ ఆధ్వర్యంలో మొదలైన ద్రవిడ ఉద్యమం అన్నాదురై తో రాజకీయ టర్న్ తీసుకుంది. పెరియార్ ప్రత్యేక దేశం అంటే.. ద్రవిడ కళగంలో చీలిక వచ్చింది. డీఎంకే ఏర్పడింది. ప్రత్యేక దేశం కన్నా.. తమిళనాట రాజకీయంగా ఆధిపత్యం సాధించడానికి ప్రాధాన్యతను ఇచ్చాడు అన్నాదురై. అలాంటి అన్నాకు అత్యంత సన్నిహిత ఫాలోయర్, శిష్యుడు కరుణానిధి. నాటక, సినీ నేపథ్యం ఉన్న కరుణానిధి ద్రవిడ ఉద్యమంలో యూత్ లీడర్‌గా నిలిచాడు. యూత్ ‌లో కరుణానిధికి ఉన్న ఫాలోయింగ్ ఎంతంటే.. ఆ దశలో కరుణానిధి హేర్ స్టైల్‌ను యువత ఫాలో అయ్యేది. అంతలా యువతను ప్రభావితం చేశాడాయన.

యువకుడిగానే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అన్నా ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి అయ్యారు. అన్నా హఠాన్మరణంతో దిక్కులేనిదిగా అయిన డీఎంకేకి పెద్ద దిక్కు అయ్యారు కరుణ. అధికారం కరుణానిధికి అందగానే.. పార్టీలో నెమ్మదిగా ఆధిపత్య పోరు మొదలైంది. ప్రత్యేకించి ఎంజీఆర్‌తో విబేధాలు డీఎంకే ప్రస్థానాన్ని మరో మలుపు తిప్పాయి. కరుణానిధితో విబేధాల నేపథ్యంలో ఎంజీఆర్ ప్రత్యేక పార్టీని పెట్టుకున్నాడు. డీఎంకేని చీల్చి అన్నాడీఎంకేను స్థాపించుకున్నాడు. అక్కడి నుంచి కరుణానిధికి కొత్త ఛాలెంజ్‌లు ఎదురయ్యాయి.

మరో ద్రవిడ పార్టీ ముందు, ఎంజీఆర్ ప్రభ ముందు కరుణానిధి హీరోయిజం మసకబారింది. ఎంజీఆర్ మరణం వరకూ మళ్లీ కరుణ అధికారాన్ని అందుకోలేకపోయాడు. అన్నాడీఎంకే లో అంతర్గత కలహాలు తీవ్రం అయ్యాకా కరుణను మళ్లీ అధికారం వరించింది. అయితే.. అనూహ్యంగా కరుణకు జయలలిత రూపంలో కొత్త సవాల్ ఎదురైంది. ఆమెను ఎదుర్కొంటూ.. ఒకసారి విజయం, మరోసారి పరాజయం.. ఇలా కరుణానిధి ప్రస్థానం సాగుతూ వచ్చింది.

ఈ రాజకీయ ప్రస్థానంలో కరుణానిధి కొన్ని చేదు అనుభవాలనూ ఎదుర్కొన్నారు. తను జైలుకు వెళ్లడం ఒక ఎత్తు అయితే, ఆయన కూతురు జైలుకు వెళ్లడం కరుణ జీవితంలో అత్యంత విషాదకరమైన అంకం. 2జీ స్కామ్‌లో కరుణ కూతురు జైలు పాలు అయిన సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా అశక్తుడయ్యాడు. తీహార్ జైల్లో తన కూతురు కనీస సౌకర్యాలు లేని ఖైదు చేయబడిన సమయంలో.. పరామర్శకు వెళ్లిన కరుణ తండ్రి హృద‌యం తట్టుకోలేకపోయింది.

2జీ స్కామ్ ఒకసారి కాదు, వరసగా రెండు సార్లు కరుణానిధిని అధికారానికి దూరం చేసింది. ఇక వారసత్వం విషయంలోనూ కరుణానిధి ముప్పుతిప్పలు పట్టారు. ఆరు మంది పిల్లల్లో ఇద్దరు తనయులు తన వారసత్వం కోసం పోరాడారు. కరుణ మరణానంతరం కూడా ఈ విషయంలో కొంత అనిశ్చితే నెలకొని ఉంది.