cloudfront

Advertisement


Home > Politics - Political News

మోడీ, రాహుల్, కేజ్రీ.. ఈ 'చావు' రాజకీయాలేంటి?

మోడీ, రాహుల్, కేజ్రీ.. ఈ 'చావు' రాజకీయాలేంటి?

'నన్ను చంపేస్తారు.. ఒక బీసీ ప్రధానిగా ఉండటం వాళ్లకు ఇష్టం లేదు..' అని అంటారు మోడీ. 'అలా అయితే నేను చనిపోవడానికి కూడా సిద్ధమే..' అంటూ ఇంకేదో చెబుతాడు రాహుల్ గాంధీ. 'నన్ను కూడా సెక్యూరిటీ సిబ్బందే చంపేస్తారేమో..' అంటూ ఈ 'చావు' రాజకీయం చేసే వారి జాబితాలోకి చేరాడు అరవింద్ కేజ్రీవాల్!

పోలింగ్ ఆఖరి విడతకు వచ్చే సరికి వీరు ఇలాంటి మాటలతో సెంటిమెంట్లు రేపాలని చూస్తున్నారని ఈ మాటలను బట్టి అర్థం అవుతోంది. తనను చంపేస్తారంటూ మోడి ముందు నుంచినే చెప్పుకొంటూ వస్తున్నారు! రెండేళ్ల కిందటి నుంచినే మోడీ ఆ మాట చెప్పుకొచ్చారు. అయినా ఆయన మోస్ట్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్, ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నాడని ఆయన భక్తులు చెబుతూ ఉంటారు. అలాంటిది ఆయనకే అలాంటి భయం ఉండటం ఏమిటో!

ఇక రాహుల్ గాంధీ తోపు తురుము.. అని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు. ఆయనేమో 'చచ్చిపోతా..' అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నారు. చదువుకున్నవ్యక్తి, మేధావి, సామాన్యుడు.. అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ను కీర్తించే వారూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు.. ఆయన కూడా ఒక చాలా సగటు రాజకీయ నేత అనే అభిప్రాయాలు కలిగిస్తూ ఉన్నాయి. ఈ మాటలతో వీళ్లు జాలి, సానుభూతి కోరుకుంటూ ఉన్నారని స్పష్టం అవుతోంది. మరి వీళ్లలో ఎవరి మీద జనాలు 'జాలి' చూపుతారో!